Pakistan Army New Chief | అధ్యక్ష పదవిపై కన్నేసిన పాక్​ ఆర్మీ చీఫ్​ అసిమ్​ మునీర్​?

పాకిస్తాన్‌లో అధ్యక్షుడు జర్దారీ భవిష్యత్తుపై ఊహాగానాలు వేడెక్కుతున్నాయి. ఆర్మీ చీఫ్‌ అసీమ్‌ మునీర్‌ అధ్యక్షుడవుతారన్న ప్రచారం ఊపందుకుంది. గత కొన్ని రోజులుగా జరగుతున్న రాజకీయ పరిణామాలు దేశంలో, సోషల్​ మీడియాలో వేడిపుట్టిస్తున్నాయి.

Pakistan Army New Chief | అధ్యక్ష పదవిపై కన్నేసిన పాక్​ ఆర్మీ చీఫ్​ అసిమ్​ మునీర్​?

Adharva / International News / 19 July 2025

  • షెహ్‌బాజ్‌ షరీఫ్‌, మునీర్‌, జర్దారీ సమావేశాలపై హాట్‌ టాక్‌
  • మునీర్​ అమెరికా పర్యటన ఇందుకోసమే!
  • గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు?

Pakistan Army New Chief | పాకిస్తాన్‌లో రాజకీయ సమీకరణాలు మరోసారి వేగంగా మారిపోతున్నాయి. అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ స్థానంలో ఆర్మీ చీఫ్‌ ఫీల్డ్ మార్షల్‌ అసీమ్‌ మునీర్‌ను తీసుకురావాలన్న ఊహాగానాలు సోషల్‌ మీడియాలో ఊపందుకున్నాయి. ఇటీవల ప్రధానమంత్రి షెహ్‌బాజ్‌ షరీఫ్‌ మునీర్‌తో భేటీ, అనంతరం జర్దారితో జరిగిన సమావేశం, ఈ వాదనలకు మరింత బలం చేకూర్చాయి.

2024 ఎన్నికల ఫలితాల తర్వాత పీఎంఎల్‌-ఎన్‌ (PML-N) మరియు పీపీపీ (PPP) కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అధ్యక్ష పదవి కోసం జర్దారీకి మద్దతు ఇవ్వడం ఈ మైత్రిలో భాగం. కానీ తాజాగా సుప్రీంకోర్టు రిజర్వ్డ్‌ సీట్స్‌ కేసులో తీర్పు, కొన్ని చట్టసభ నిర్ణయాలు ఈ స్నేహం మధ్య చీలికలు తెచ్చే అవకాశం ఉందన్న చర్చలు మొదలయ్యాయి. ఇదే సమయంలో రాజ్యాంగ సవరణ (27వ అమెండ్మెంట్‌)పై ఊహాగానాలు పరిస్థితిని మరింత వేడెక్కించాయి.  రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్‌, ఇంటీరియర్‌ మంత్రి మోసిన్‌ నక్వీ, ప్రధానమంత్రి షెహ్‌బాజ్‌ షరీఫ్‌ వరుస ప్రకటనల ద్వారా ఈ రూమర్స్‌ను ఖండించారు. “అధ్యక్షుడు జర్దారీ పదవి నుంచి తప్పుకుంటారన్నది పూర్తిగా అబద్ధం. మునీర్‌ అధ్యక్షుడిగా వస్తారన్నది ఆధారరహిత వార్త,” అని షెహ్‌బాజ్‌ షరీఫ్‌ తేల్చి చెప్పారు.నక్వీ ఇంకా మాట్లాడుతూ, “ఈ దుష్ప్రచారం వెనుక ఉన్నవారు మాకు తెలుసు. జర్దారీ, షెహ్‌బాజ్‌, మునీర్‌పై దాడులు చేయడం రాజకీయ స్థిరత్వానికి హానికరం” అన్నారు. ఆయన, మునీర్‌ దేశ రక్షణ, స్థిరత్వం తప్ప మరేదీ ఆలోచించడంలేదని స్పష్టం చేశారు.

అసీమ్ మునీర్: ఆధునిక సైనిక శక్తి ప్రతీక

2022లో ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అసీమ్ మునీర్‌ పాకిస్తాన్‌ సైన్యంలో అత్యంత ప్రభావశీల వ్యక్తిగా మారారు. 2023లో ఆయనకు ఫీల్డ్ మార్షల్ హోదా ఇవ్వడం దేశ చరిత్రలో రెండవసారి మాత్రమే జరిగింది.

  • మునీర్‌ కఠిన స్వభావం, వ్యూహాత్మక ఆలోచనలు, భారత్‌ పట్ల బద్ధ శత్రుత్వం, సరిహద్దు సమస్యలపై ఆయన తీసుకున్న ధోరణి వల్ల ఆయన ప్రభావం రాజకీయాల్లో కూడా పెరుగుతోందని విశ్లేషకులు అంటున్నారు.
  • జర్దారీ–షెహ్‌బాజ్‌ షరీఫ్‌ల సమావేశాలు, రాజ్యాంగ సవరణపై వస్తున్న ఊహాగానాలన్నీ సైన్యానికి రాజకీయ వేదికపై పెరుగుతున్న ప్రాబల్యానికి సంకేతంగా నిలిచాయి.
  • ఇటీవల అమెరికా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు అక్కడ పర్యటించిన మునీర్​కు ట్రంప్​ వైట్​హౌస్​లో విందు ఇవ్వడం కలకలం సృష్టించింది. పైగా మునీర్​ను మేధావిగా ట్రంప్​ ప్రశంసించడం కూడా అమెరికా వ్యూహాత్మక ఎత్తుగడలో భాగమేనని విశ్లేషకుల అభిప్రాయం. పక్కనే ఉన్న ఇరాన్​ను కట్టడి చేయడం, పాకిస్తాన్​లో సైనిక స్థావరాలు ఏర్పాటు చేయడం, పాక్​పై చైనా ఆధిపత్యానికి చెక్​ పెట్టడం లాంటవి వీటిలో భాగమని వారి అంచనా.

జర్దారీ గత ఏడాది అధ్యక్షుడిగా ఎన్నికై ఐదేళ్ల పదవీకాలాన్ని మొదలు పెట్టారు. ఆయన కుమారుడు బిలావల్‌ భుట్టో జర్దారీ కూడా విదేశాంగ పర్యటనల్లో ప్రాధాన్యత పొందడం, సైనిక వ్యవస్థతో పీపీపీ సాన్నిహిత్యం కొనసాగుతుందని తెలియజేస్తోంది. కాబట్టి జర్దారీని తొలగించే ప్రసక్తి లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్తాన్‌లో సైన్యం మరియు రాజకీయాలపై చర్చలు ఎప్పుడూ సున్నితంగా ఉంటాయి. ఇటీవల కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో జర్దారీ స్థానంలో మునీర్‌ను అధ్యక్షుడిగా నియమించవచ్చన్న వార్తలు వైరల్‌ కావడంతో ఈ ప్రచారం మరింతగా పెరిగింది. ప్రభుత్వం ఈ రూమర్స్‌ను కట్టడి చేసేందుకు చురుకైన చర్యలు తీసుకుంటోంది. కానీ, ఈ తరహా పదవీ మార్పిడి పాకిస్తాన్​కు కొత్తేం కాదు. పాకిస్తాన్‌ రాజకీయ వ్యవస్థలో సైన్యం ప్రభావం కొత్తది కాదు. స్వాతంత్ర్యం పొందిన 1947 నుంచి ఇప్పటి వరకు ఆ దేశ పాలనలో సైనిక జోక్యం ఒక నిరంతర అంశంగా మారింది. ప్రతి కీలక రాజకీయ మలుపులో సైన్యం పాత్ర కనిపించడం పాకిస్తాన్‌ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఎక్కువ కాలం నిలవకపోవడానికి ప్రధాన కారణం సైన్యం కలుగజేసుకోవడమే. ముఖ్యంగా విదేశీ విధానాలు, కాశ్మీర్‌ సమస్య, భారతదేశంతో సంబంధాలు వంటి అంశాలలో సైన్యం ఎప్పుడూ పైచేయి సాధించాలని ప్రయత్నించింది.

పీఎంఎల్‌-ఎన్‌, పీపీపీ మైత్రి:

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని బలపరిచేందుకు సంకల్పబద్ధంగా ఉన్నాయని ఖవాజా ఆసిఫ్‌ పేర్కొన్నారు. “మేము కేవలం అధికార భాగస్వామ్యమే కాదు, దానికంటే ఎక్కువగా ఒకే లక్ష్యంతో ఉన్నాం” అని ఆయన అన్నారు.