జపాన్‌లో ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుందో తెలిస్తే షాకే..

మనదేశంలో తరహాలో అక్కడ నెలల తరబడి ఎన్నికల ప్రచారాలు ఉండవు. ఊళ్లల్లో ఊరేగింపులు తీస్తామంటే ఊరుకోరు. ఇంటింటికీ వెళ్లి ఓట్ల అభ్యర్థిండం అక్కడ నిషిద్ధం. అంతేకాదు.. గోడరాతలు.. కరెంటు స్తంభాలపై పోస్టర్లు అంటించడం కూడా ఒప్పుకోరు. అదే పరిస్థితి మన దగ్గర కూడా ఉంటే ఎంత బాగుండు? ఇంతకీ దేశం పేరు జపాన్.

విధాత, హైదరాబాద్:

భారత దేశంలో ఏ ఎన్నికలు వచ్చినా విద్యుత్ స్థంభాలు, టెలిఫోన్ పోల్స్‌పై పోస్టర్లు వెలుస్తాయి. దారి పొడవునా జెండాలు, బ్యానర్లు కడతారు. బంగ్లాలపై పార్టీ జెండాలు ఎగురవేస్తారు. వేలాది కరపత్రాలు ముద్రిస్తారు. ఖాళీ గోడలపై రాతలు రాస్తారు. ఎన్నికలు వచ్చాయంటే ఒక పండుగ వాతావరణం మాదిరి రాజకీయ పార్టీలు చేస్తాయి. ఇదే కాకుండా హోరెత్తించే విధంగా పాటలు విన్పిస్తూ వేదికలపై సవాళ్లు ప్రతిసవాళ్లు చేస్తుంటారు. స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు దాటుతున్నా ఇంకా రాజకీయ పార్టీలు పాత పద్దతిలో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలకు విసుగు పుట్టిస్తాయి. ప్రజలేమి అనుకున్నా, విసుక్కున్నా పట్టించుకోరు. తమకు నచ్చిన విధంగా, తమదైన శైలిలో నాయకులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

ఇందుకు పూర్తి విరుద్ధంగా, ప్రజలకు ఏమాత్రం అసౌకర్యం, ఇబ్బందులు లేకుండా, రణగొణ ధ్వనుల నుంచి విముక్తి కల్పిస్తూ ఆ దేశంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. జాతీయ పార్లమెంటు కు జరుగుతున్న ఎన్నికల్లో శాంతి యుతంగా ప్రచారం చేస్తున్నారు. ఆ దేశం జపాన్. ప్రపంచ దేశాలకు ఆధునిక సాంకేతికను అందిస్తూ, ఆర్థికంగా దూసుకుపోతున్నది.

12 రోజులు మాత్రమే ప్రచారం

మన దేశంలో మాదిరి నెలల కొద్దీ ముందస్తు ప్రచారం ఉండనే ఉండదు. ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తరువాత పోలింగ్‌కు 12 రోజుల ముందు నుంచి మాత్రమే ప్రచారం ప్రారంభించాలి. ర్యాలీలు, సభలు నిర్వహించడానికి అవకాశమే లేదు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడానికి అనుమతించరు. ఇంటి ముందుకు వెళ్లి తలుపులు తట్టి తనకే ఓటు వేయాలని వేడుకునే పరిస్థితి ఉండదు.

పబ్లిక్ ఆఫీసెస్ ఎలక్షన్ లా ప్రకారం ప్రతి నాయకుడు నడుచుకోవాల్సిందే. విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు, గోడలపై పోస్టర్లు అంటించకూడదు. ప్రతి నియోజకవర్గంలో ఎంపిక చేసిన బహిరంగ ప్రాంతాలలో ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసి, ఆ బోర్డులపై అభ్యర్థులకు నిర్ధేశిత సైజు కేటాయిస్తారు. తమకు కేటాయించిన సైజులో పోస్టర్లు లేదా ఫ్లెక్సీలు అతికించుకోవాలి. ఒకే బోర్డుపై అన్ని పార్టీలకు చెందిన నాయకులకు సంబంధించిన హామీలు, ప్రచారం చేసుకోవచ్చు. టెలివిజన్ ఛానళ్లలో పార్టీ ప్రచారాలు, అభ్యర్థుల సమావేశాలు, బహిరంగ సభలు ప్రత్యక్ష ప్రసారాలు అస్సలే ఉండవు. బహిరంగ ప్రదేశాలలో భారీ ఎల్ఈడీ స్క్రీన్స్ లు కూడా ఏర్పాటు చేయకూడదు. ప్రభుత్వం అనుమతించిన ప్రాంతాలలో పోస్టర్లు అతికించడం, కరపత్రాలు పంపిణీ చేయాలి. కులం, మతం, ప్రాంతం పేరుతో విభజన రాజకీయాలు చేసినా, ప్రసంగాలు చేసినట్లు నిరూపితం అయితే సదరు అభ్యర్థి పై అనర్హత వేటు పడుతుంది. దీన్ని వల్ల అన్ని మతాలు, వర్గాల మధ్య వైషమ్యం లేకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించే వీలుంటుంది.

ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చులపై నియంత్రణ ఉంటుంది. ఓటర్లకు డబ్బులు ఆశచూపే అభ్యర్థులపై గట్టి నిఘా ఉంటుంది. రాజకీయ పార్టీలకు అందుతున్న విరాళాల వివరాలను పబ్లిక్ డొమైన్ లో పెడతారు. ఏ పార్టీకి ఎవరు, ఏ కంపెనీ చందాలు ఇచ్చిందనే వివరాలు అందులో స్పష్టంగా పొందుపరుస్తారు. చిన్న వాహనాల్లో మైకులు ఏర్పాటు చేసుకుని, ఇతరులకు ఇబ్బంది కలుగకుండా వీధులలో తక్కువ సమయంలో ప్రచారం ముగిస్తారు. ఇండియాలో మాదిరి భారీ బహిరంగ సభలు, సౌండ్ బాక్సులు, మైకులు, రంగు రంగుల లైట్లు, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి చెవులు చిల్లులు పడేలా వ్యవహరించరు. భారత దేశానికి పూర్తి భిన్నంగా, ప్రశాంత వాతావరణలో ఎవరికి విసుగు లేకుండా, ఇబ్బందులు కల్పించకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రపంచ దేశాలకు జపాన్ ఆదర్శంగా నిలుస్తున్నది.

Read Also |

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన మహిళలు

Latest News