నేపాల్ వరదల్లో తల్లి సాహసం..ఇద్దరు చిన్నారుల సురక్షితం

నేపాల్‌లో వరదలు ముంచుకొచ్చిన సమయంలో.. ఓ తల్లి ఎంతో ధైర్యసాహసాలతో తన పిల్లల్ని కాపాడుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

విధాత: నేపాల్ వరదలు సృష్టించిన బీభత్సం నుంచి ఇప్పట్లో ఆ దేశం కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. వరదలలో గల్లైంతన వారిలో నాలుగు రోజులయిపోయినా.. ఇప్పటికీ 2,400 మంది ఎక్కడ ఉన్నారో.. ఏమయ్యారో తెలియడం లేదు. వారిలో 320 మంది విదేశీయులుకాగా… భారతీయులు 287 మంది ఉన్నారు. పలు ప్రాంతాల్లో చిక్కుకున్న దాదాపు 4,400 మందిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతానికి తరలించగలిగాయి. రుసువా జిల్లాలోని టిమురే ప్రాంతంలో మూడ్రోజులుగా మట్టి, శిథిలాల కింద చిక్కుకుపోయిన ఆరేళ్ల చిన్నారిని సహాయక సిబ్బంది గుర్తించి రక్షించారు. విపత్తు సంభవించి నాలుగు రోజులు కావడంతో ఇంకా ఆచూకి లభించిన వారి ప్రాణాలపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. వారంతా బురద నీటిలోనే సజీవ సమాధి అయిపోనట్లుగా భావిస్తున్నారు. మరోవైపు టిబెట్‌లో 550 మంది ఆచూకీ తెలియడం లేదు. నేపాల్‌లో మృతుల సంఖ్య 675గా తేలగా.. టిబెట్‌లో ఏడుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 682కు చేరుకుంది.

తల్లి సాహసంతో బతికిన చిన్నారుల వీడియో వైరల్

నేపాల్‌లో వరదలు ముంచుకొచ్చిన సమయంలో.. ఓ తల్లి ఎంతో ధైర్యసాహసాలతో తన పిల్లల్ని కాపాడుకుంది. ఎగువ నుంచి బురద, కొండ చరియలు, కట్టడాల శిధిలాలతో శరవేగంగా దూసుకొస్తున్న వరద ఉదృతిని గమనించిన ఓ తల్లి తన ఇద్దరి చిన్నారులతో దూరంగా పారిపోయే క్రమంలో కింద పడింది. వరద మృత్యువు రూపంలో మీదకు దూసుకొస్తున్నప్పటికి బెదిరిపోకుండా వెంటనే పైకి లేచి…పిల్లల చేతులు వదలకుండా సెకన్ల వ్యవధిలో వారిని గట్టిగా పట్టుకుని కొండ ప్రాంతంపైకి పరుగు తీసింది.

క్షణాల్లోనే ఆమె తన పిల్లలతో సురక్షితంగా ప్రాణాలలో బయటపడగా..ఆ వెంటనే రెప్పపాటు కాలంలో ఆ ప్రాంతాన్ని వరద ముంచెత్తి దిగువకు దూసుకెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను వీక్షించిన నెటిజన్లు తన పిల్లలను కాపాడుకోవడంలో ఆమె చూపిన ధైర్య సాహసాలను ప్రశంసిస్తున్నారు. ఎంతైన పిల్లల సంరక్షణలో తల్లి చూపే శ్రద్ద, తెగువ, త్యాగానికి సాటిలేదని అభినందిస్తున్నారు.

 

Latest News