విధాత, హైదారాబాద్ : దక్షిణ కాశీగా పేరొందిన ఐదవ శక్తిపీఠం గద్వాల అలంపూర్ జోగులాంబ ఆలయం కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రసాద్ స్కీమ్ నిధుల సహకారంలో కొత్త శోభ సంతరించుకుంది. ప్రసాద్ (తీర్థ యాత్ర పునరుజ్జీవన అడ్వాన్స్)స్కీమ్ కింద దాదాపు 39 కోట్ల కేంద్ర నిధులతో ఆలయ రూపురేఖలు మారిపోయి.. పూర్వ వైభవం సంతరించుకుంది.
యాత్రికుల కోసం అత్యాధునిక ఫెసిలిటేషన్ సెంటర్, తుంగభద్ర నదీ తీరాన సరికొత్త ఘాట్లు, కాంప్లెక్స్‌లు, సౌకర్యవంతమైన రోడ్లు, లైటింగ్ తో అలంపూర్ జోగులాంబ ఆలయ పరిసరాలు సుందరంగా మారిపోయి అద్భుతమైన ఆధ్యాత్మిక టూరిజం హబ్‌గా రూపుదిద్దుకుంది. జోగులాంబ ఆలయ అభివృద్దిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓ వీడియోను ఎక్స్ లో పోస్టు చేశారు.
ఆలయ చరిత్ర..
జోగులాంబ గద్వాల్ జిల్లా, అలంపూర్ తుంగభద్ర, కృష్ణ నదుల సంగమ ప్రాంతం. చాళుక్యుల కాలంలో నిర్మితమైన ఈ క్షేత్రం, చుట్టూ ప్రాచీన నవబ్రహ్మ ఆలయాలతో అలరారుతోంది. క్రీ.శ.6వ శతాబ్దంలో చాళుక్యరాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. గోపురాలు, వాటిపై శిల్పకళ సహా మొత్తం ఆలయ నిర్మాణం అప్పటి నిర్మాణశైలికి సాక్ష్యాలుగా నిలుస్తాయి. 13-14 శతాబ్దంలో మొఘలులు, బహుమనీ సుల్తానులు దండయాత్ర చేసి.. ఆలయాన్ని నాశనం చేశారు. చాలా విగ్రహాల్ని విరగొట్టేశారు. విజయనగర చక్రవర్తి రెండో హరిహర రాయలు… బహుమనీ సైనికులను బలంగా అడ్డుకోవడంతో దాడులకు బ్రేక్ పడింది. ఆ సమయంలో భక్తులు.. జోగులాంబ, శక్తి నవ రూపాల మూల విరాట్టులను దగ్గర్లోని నవబ్రహ్మ ఆలయానికి తరలించి దాచిపెట్టారు. ఆ తర్వాత మళ్లీ కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని పునఃప్రతిష్టించారు.
చాళుక్యుల తర్వాత కాకతీయ రాజులు కూడా ఆలయ అభివృద్ధి కోసం కృషి చేశారు. కొన్ని ఆలయాల్ని మళ్లీ నిర్మించారు. శక్తిరూపంగా అమ్మవారు కొలువైన అత్యంత పవిత్ర స్థలాలు 18 అష్టాదశ శక్తి పీఠాలలో అలంపూర్ జోగులాంబ శక్తీ పీఠం ఒకటిగా నిలిచింది. కాశీ నగరానికి వరుణ, అసి అనే నదులున్నట్టే అలంపురానికి కూడా ఇటు వేదవతి – నాగావళి నదులున్నాయి. అందుకే ఈ నగరాన్ని దక్షిణ కాశి అని కూడా అంటారు
స్థల పురాణం
తండ్రి దక్షుడు యజ్ఞం చేపట్టాడని తెలిసి పిలుపు రాకపోయినా వెళుతుంది సతీదేవి. అక్కడ అవమానాలు ఎదుర్కొని అగ్నిగుండంలో పడి ప్రాణత్యాగం చేసుకుంటుంది. సతీదేవిపై ప్రేమతో శివుడు ఆ దేహాన్ని భుజాన ధరించి లోకాలు తిరుగుతుంటాడు. ఇక శివుడిని మళ్లీ తన కార్యంలోకి దించేందుకు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ముక్కలుచేస్తాడు. అమ్మవారి శరీరం ముక్కలుగా పడిన ప్రదేశాలే అష్టాదశ శక్తి పీఠాలు. అందులో భాగంగా దంతాలు పడిన ప్రదేశమే అలంపూర్. ఇక్కడ అమ్మవారు తేజోవంతంగా దర్శనమిస్తుంది. గాల్లో తేలే కేశాలు…వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం కనిపిస్తాయి.
ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని..ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని…ఆ తర్వాత దశలో గబ్బిలాలు చేరుతాయని చెప్పడమే అమ్మవారి రూపం వెనుకున్న ఆంతర్యం. ఇంట్లో జరిగే శుభాశుభాలకు జోగులాంబ ప్రతిరూపం అని..అందుకే అమ్మను గృహచండిగా పిలుస్తారు.
నవ బ్రహ్మ ఆలయాలు ప్రత్యేకం..
అలంపూర్ లో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జోగుళాంబదేవాలయంతో పాటూ నవబ్రహ్మ ఆలయం కూడా ఉంది. ప్రపంచం మొత్తం మీద బ్రహ్మదేవుడికి ఉన్న ఆలయాల సంఖ్య చాలాతక్కువ. రాజస్థాన్ లోని పుష్కర్ లో బ్రహ్మకు ఆలయం ఉంది..ఆ తర్వాత తెలంగాణలో అలంపూర్ లో కూడా బ్రహ్మకు దేవాలయం ఉంది. ఇక్కడ బ్రహ్మ 9 రూపాల్లో దర్శనమిస్తాడు. బాలబ్రహ్మేశ్వర, విశ్వబ్రహ్మ, కుమారబ్రహ్మ, అర్థబ్రహ్మ, తారక బ్రహ్మ, గరుడ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, వీరబ్రహ్మ పేర్లతో దర్శనమిస్తాడు. ఈ ఆలయాన్ని సందర్శిస్తే అంతులేని జ్జానం, సంపద కలుగుతుందని భక్తుల విశ్వాసం.
దక్షిణ కాశీగా పేరొందిన ఐదవ శక్తిపీఠం గద్వాల అలంపూర్ జోగులాంబ ఆలయానికి మోదీ ప్రభుత్వం పూర్వ వైభవం తెచ్చింది.
ప్రసాద్ స్కీమ్ కింద దాదాపు 39 కోట్ల కేంద్ర నిధులతో ఆలయ రూపురేఖలు మారిపోయాయి. యాత్రికుల కోసం అత్యాధునిక ఫెసిలిటేషన్ సెంటర్, తుంగభద్ర నదీ తీరాన సరికొత్త ఘాట్లు, కాంప్లెక్స్… pic.twitter.com/lIuYRuUInD— G Kishan Reddy (@kishanreddybjp) August 30, 2026