Nityananda | బొలీవియాలో భూ కబ్జాలకు నిత్యానంద స్వామి ‘కైలాస’ సభ్యుల యత్నం
న్యూఢిల్లీకి మూడింతల భూభాగాన్ని 25 ఏళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు స్థానిక తెగల నేతలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇందుకోసం వారికి ఏటా 2 లక్షల డాలర్లను చెల్లించేందుకు ఒప్పకొన్నారని తెలుస్తున్నది.

Nityananda | వివాదాస్పద గాడ్‌మాన్ నిత్యానంద వివాదాస్పద వ్యవహారాలు కొత్తేమీ కాదు. లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద పోలీసులకు చిక్కకుండా తప్పించుకుపోయాడు. గుర్తు తెలియని ప్రాంతంలో కైలాస అనే దేశాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే తన భక్తులతో కలిసి ఉంటున్నాడు. తాజాగా బొలీవియాలో భూముల కబ్జాకు కైలాస సభ్యులు ప్రయత్నించారు. స్థానిక గిరిజన తెగలతో అమెజాన్ అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూమి కొనుగోలు ఒప్పందాలకు ప్రయత్నించారు. అయితే.. ఈ విషయం తెలిసిన బొలీవియా అధికారులు కైలాస సభ్యులను పట్టుకుని, భారత్, చైనా, ఆస్ట్రేలియా సహా వారి వారి దేశాలాకు డీపోర్ట్ చేశారు. దాదాపు 20 మందిని ఈ కేసులో అరెస్టు చేశామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పెద్ద మొత్తంలో భూమిని గిరిజనుల నుంచి లీజుకు తీసుకునేందుకు ప్రయత్నించిన సదరు కైలాస సభ్యులపై ల్యాండ్ ట్రాఫికింగ్ కింద అభియోగాలు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. స్థానిక గిరిజనులతో వారు చేసుకున్న ఒప్పందాలు చెల్లబోవని ప్రకటించారు. ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’గా చెబుతున్న దేశంతో తమకు ఎలాంటి దౌత్యపరమైన సంబంధాలు లేవని బొలీవియా విదేశాంగ శాఖ అధికారి న్యూయార్క్ టైమ్స్‌కు తెలిపారు.
ల్యాండ్ డీల్స్ చేశారిలా..
టూరిస్టు వీసాలపై బొలీవియాకు కైలాస సభ్యులు వచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బొలీవియా దేశాధ్యక్షుడు లూయీస్ ఆర్క్‌తో ఫొటో కూడా దిగడం గమనార్హం. స్థానిక గిరిజనులతో కైలాస సభ్యులు ల్యాండ్ డీల్స్ కుదుర్చుకున్న విషయాన్ని బొలీవియన్ వార్తా పత్రిక ఎల్ డెబెర్.. తన పరిశోధనాత్మక కథనంలో బయటపెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కార్చిచ్చు రేగిన సమయంలో వారు దేశంలోకి చొరబడ్డారని తెలుస్తున్నది. న్యూఢిల్లీకి మూడింతల భూభాగాన్ని 25 ఏళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు స్థానిక తెగల నేతలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇందుకోసం వారికి ఏటా 2 లక్షల డాలర్లను చెల్లించేందుకు ఒప్పకొన్నారని తెలుస్తున్నది. అయితే.. ఇంగ్లిష్‌లో తయారు చేసిన డాక్యుమెంట్లలో ఆ లీజు కాలాన్ని వెయ్యేళ్లుగా పేర్కొన్నట్టు సమాచారం. అంతేకాకుండా ఆ ప్రాంతం గగనతలాన్ని, అక్కడి ప్రకృతి వనరులను వాడుకునేందుకు సైతం అనువుగా రాసుకున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఎవరీ నిత్యానంద
తనను తాను దేవుడిగా ప్రకటించుకున్న నిత్యానంద.. గతంలో కర్ణాటకలో ఆశ్రమం నడిపేవాడు. చిన్న పిల్లలను కిడ్నాప్ చేయించుకుని వచ్చి, ఆశ్రమం నడిపేందుకు వారితో విరాళాలు సేకరించేవాడని అభియోగాలు ఉన్నాయి. లైంగిక దాడి కేసులో ఆయన పోలీసులకు చిక్కకుండా పారిపోయాడు. 2019 నిత్యానంద పాస్‌పోర్ట్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆయన ఎక్కడున్నాడనేది ఎవరికీ తెలియదు. అయితే.. 2023లో నిత్యానంద స్థాపించినట్టు చెబుతున్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస.. అమెరికాలోని 30 నగరాలతో సాంస్కృతికి భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నది.