Nobel Laureates Banerjee & Duflo To Leave US | అమెరికాను వీడ‌నున్న నోబెల్ జంట

నోబెల్ గ్రహీతలు అభిజిత్ బెనర్జీ, ఈస్టర్ డఫో అమెరికా వీడి స్విట్జర్లాండ్‌లో జ్యూరిచ్ యూనివర్శిటీలో చేరనున్నారు.

Nobel Laureates Banerjee & Duflo To Leave US | అమెరికాను వీడ‌నున్న నోబెల్ జంట

విధాత‌: ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బ‌హుమ‌తి అందుకున్న అభిజిత్ బెన‌ర్జీ, ఈస్త‌ర్ డ‌ఫో అమెరికాను వీడి, స్విట్జ‌ర్‌లాండ్‌కు రానున్నారు. యూనివ‌ర్శిటీల‌పై జ‌రుగుతున్న అణ‌చివేత నేప‌థ్యంలో వీరు మ‌సాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీని వీడి స్విట్జ‌ర్లాండ్‌లోని జ్యూరిచ్ యూనివ‌ర్సిటీలో చేర‌నున్నారు. 2019లో ఆర్థిక‌వేత్త మైకేల్ క్రేమ‌ర్‌తో క‌లిపి బెన‌ర్జీ, డ‌ఫోల‌కు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బ‌హుమ‌తి ప్ర‌క‌టించిన విష‌యం విధిత‌మే. పేద‌రిక నిర్మూల‌న‌లో ప్ర‌యోగాత్మ‌క ప‌ద్ధ‌తి అన్న అంశంపై వారికి నోబెల్ వ‌చ్చింది. వ‌చ్చే ఏడాది జులై నుంచి జ్యూరిచ్ యూనివ‌ర్శిటీలో ఆర్థిక శాస్త్రం, వాణిజ్యం, ఇన్‌ఫార్మాటిక్స్ విభాగంలో అధ్యాప‌కులుగా వారు చేర‌నున్నారు. అమెరికా యూనివ‌ర్శిటీల‌లో అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంపు ఉదార‌వాద మేధావుల‌పై సాగిస్తున్న‌ అణ‌చివేత నేప‌థ్యంలో ఈ ఆచార్యులు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు చెబుతున్నారు. యూనివ‌ర్శిటీల నిధుల‌కు కోత విధించ‌డం, విమ‌ర్శ‌లు చేసిన ప్రొఫెస‌ర్ల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డం, అంత‌ర్జాతీయ విద్యార్థుల కోటాను 15 శాతానికి త‌గ్గించ‌డం వంటి ట్రంపు చ‌ర్య‌ల‌పై యూనివ‌ర్శిటీలు మండిప‌డుతున్నాయి.