Noor Wali Mehsud | అఫ్గాన్ సరిహద్దులో పాక్ కొత్త శత్రువు – నూర్‌వలీ మెహ్సూద్
తహ్రీక్–ఇ–తాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి) నాయకుడు నూర్‌వలీ మెహ్సూద్ పాక్ సరిహద్దు ఉద్రిక్తతలకు కేంద్రస్థానమైపోయాడు. కాబూల్‌లో వైమానిక దాడి నుంచి బతికిపోయిన ఆయన, ఇప్పుడు ఇస్లామాబాద్‌కు పెనుముప్పుగా మారాడు.

How Noor Wali Mehsud Revived the Pakistani Taliban from Afghan Soil
(విధాత ఇంటర్నేషనల్ డెస్క్)
అఫ్గాన్–పాక్ సరిహద్దులో మళ్లీ రగులుతున్న యుద్ధానికి మూల కారణంగా నిలిచిన ఒక వ్యక్తి — తహ్రీక్–ఇ–తాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి) నాయకుడు నూర్‌వలీ మెహ్సూద్.
ఇస్లామాబాద్ నిఘావర్గాల సమాచారం ప్రకారం, పాక్‌లో రోజువారీ దాడులకు ఆయనే మూలకారకుడు. ఇటీవల కాబూల్‌లో జరిగిన వైమానిక దాడిలో ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, మెహ్సూద్ బతికిపోయినట్లు సమాచారం. టిటిపి తాజాగా విడుదల చేసిన ఆడియోలో ఆయన స్వరం వినిపించిందని పాక్ నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
2022లో అల్‌ఖైదా నేత అయ్మాన్ అల్–జవాహిరీ హత్య అనంతరం కాబూల్‌లో జరిగిన తొలి వైమానిక దాడి ఇదే. పాక్ ఈ దాడిని అధికారికంగా అంగీకరించకపోయినా, అంతర్జాతీయ వర్గాలు దీని వెనుక పాక్ వైమానిక దళమే ఉందని చెబుతున్నాయి. మరోవైపు తాలిబాన్ ప్రభుత్వం ఈ దాడిని “అఫ్గాన్ భూభాగ ఆక్రమణ దాడి”గా ఖండించింది.
అణిగిపోయిన టిటిపికి అమృతం పోసిన నాయకుడు
నూర్‌వలీ మెహ్సూద్ 2018లో టిటిపి నాయకుడిగా బాధ్యతలు చేపట్టాడు. అప్పటికే పాక్ సైనిక చర్యలతో ఆ సంస్థ బలహీనమై, సరిహద్దు ప్రాంతాల వెనక్కు చేరింది. కానీ మెహ్సూద్ నాయకత్వంలో టిటిపి తిరిగి బలపడింది. ఆయన మతపరంగా శిక్షణ పొందినవాడు, అదే సమయంలో వ్యూహాత్మకంగా సమన్వయం కలిగిన నాయకుడని విశ్లేషకులు అంటున్నారు. విభిన్న వర్గాలను ఒకే చత్రం కిందకు తీసుకొచ్చి, పాక్ సైన్యం లక్ష్యంగా దాడులు జరపడం ఆయన ప్రధాన ధ్యేయమైంది. 2021లో అఫ్గాన్‌లో తాలిబాన్ అధికారంలోకి రావడంతో టిటిపి కార్యకలాపాలు మరింత విస్తరించాయి. పాక్ సైన్యం ఉటంకించినదాని ప్రకారం, అఫ్గాన్ భూభాగం నుంచే టిటిపి యోధులు తమ దేశంపై దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రాంతం టిటిపి ప్రభావానికి లోనైందని పాక్ భద్రతా సంస్థలు గుర్తించాయి.
మెహ్సూద్ టిటిపి వ్యూహాన్ని పూర్తిగా మార్చాడు. గతంలో పౌరులపై దాడులు చేసిన ఆ సంస్థ, ఇప్పుడు సైనిక–పోలీస్ లక్ష్యాలపైనే దృష్టి పెట్టింది. 2014లో పాక్‌లోని పాఠశాలపై దాడి చేసి 130 మందికిపైగా పిల్లలను చంపిన ఘటన తర్వాత, ప్రజాభిప్రాయం ప్రతికూలంగా మారడంతో ఈ మార్పు తీసుకువచ్చినట్లు సమాచారం. ఆయన ఒక వీడియో ప్రసంగంలో “పాక్ సైన్యం ఇస్లామిక్ విలువలను నాశనం చేస్తోంది” అని తీవ్ర విమర్శలు చేశాడు. అమెరికా 2022లో ఆయనను “గ్లోబల్ టెర్రరిస్ట్”గా గుర్తించింది. ఆయన మతపరమైన సిద్ధాంతాలకే పరిమితం కాకుండా, పష్తూన్ తెగల హక్కుల కోసం పోరాడుతున్నామనే జాతీయ భావనను కలిపి కొత్త రూపంలో టిటిపిని మార్చాడని నిపుణులు చెబుతున్నారు. బ్రిటిష్ వలస పాలన వ్యతిరేక పోరాటం నుంచి టిటిపి ఉద్భవించిందని ఆయన రచించిన పుస్తకాల్లో వాదన ఉంది.
మెహ్సూద్ ఎప్పటికీ పాక్ కంట్లో నలుసే.!
ఇటీవల పాక్ అధికారులతో గిరిజన తెగ నాయకుల ద్వారా జరిగిన రహస్య చర్చల్లో, టిటిపి “సరిహద్దు ప్రాంతాలపై తమ ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేయాలి, ఆ ప్రాంతాల నుండి సైన్యం వెనక్కు వెళ్లాలి” అని డిమాండ్ చేసింది. పాక్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను ఖండించింది. నూర్‌వలీ మెహ్సూద్ వ్యక్తిత్వం ఇప్పుడు అఫ్గాన్–పాక్ ఉద్రిక్తతల కేంద్రమైంది. ఆయన జీవించి ఉన్నంతకాలం పాక్ సరిహద్దులో శాంతి ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. పాక్ సైన్యం తరచూ అఫ్గాన్ భూభాగంపై దాడులు చేయడం వల్ల కాబూల్–ఇస్లామాబాద్ మధ్య సంబంధాలు మరింత క్షీణిస్తున్నాయి.
భారత దృష్టిలో ఈ పరిణామం వ్యూహాత్మకంగా కీలకం. పాక్ అంతర్గత భద్రతా సంక్షోభం మరింతగా పెరిగితే, అది భారత సరిహద్దుల వద్ద ఉగ్రవాద కదలికలను తగ్గించే అవకాశమూ ఉంది. అదే సమయంలో, తాలిబాన్–టిటిపి అనుబంధం మరింత బలపడితే, దీని ప్రభావం దక్షిణాసియాలోని మొత్తం దేశాలపై పడే అవకాశం ఉంది. అందుకే న్యూఢిల్లీ ప్రస్తుతం ఈ పరిణామాలను అత్యంత జాగ్రత్తగా గమనిస్తోంది.
Noor Wali Mehsud, the leader of the Tehreek-e-Taliban Pakistan (TTP), has emerged as the man behind Pakistan’s growing security nightmare. Islamabad blames him for orchestrating near-daily attacks from bases inside Afghanistan. A recent airstrike in Kabul targeted his convoy, but he reportedly survived. Under his leadership, the TTP has revived, reorganised and turned its focus solely on Pakistan’s military. Analysts say India is watching closely as tensions rise between Islamabad and Kabul.