Energy Emergency | పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేస్తున్న తరుణంలో ఫిలిప్పీన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇంధన నిల్వలు తగ్గిపోతుండటం, ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో జాతీయ ఇంధన ఎమర్జెన్సీ(National Energy Emergency) ని ప్రకటించింది. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నంబర్ 110పై ఆ దేశ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ సంతకం చేశారు. మార్చి 24వ తేదీన అమల్లోకి వచ్చిన ఈ ఎమర్జెన్సీ ఏడాదిపాటు కొనసాగనుంది. దీంతో యుద్ధం కారణంగా ఇంధన ఎమర్జెన్సీని ప్రకటించిన తొలి దేశంగా ఫిలిప్పీన్స్ నిలిచింది.
మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి పెరిగిందని మార్కోస్ వెల్లడించారు. సరఫరా గొలుసు(Supply Chain)లో తీవ్ర అంతరాయం ఏర్పడి, అంతర్జాతీయ చమురు ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా కీలక రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధి మూసివేత.. ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశంలో ఇంధన కొరతకు దారితీసే ప్రమాదం ఉందని అంచనా వేసి, అత్యవసర చర్యలు అమలు చేస్తున్నామని ప్రకటించారు.
UPLIFT కమిటీ ఏర్పాటు
ఇంధన ఎమర్జెన్సీలో భాగంగా ఫిలిప్పీన్స్ UPLIFT ( యునిఫైడ్ ప్యాకేజీ ఫర్ లైవ్లీహుడ్స్, ఇండస్ట్రీ, ఫుడ్ అండ్ ట్రాన్స్‌పోర్టు) పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇది దేశంలోని ఇంధనం, ఆహారం, మందులు, ఇతర అత్యవసర వస్తువుల పంపిణీని పర్యవేక్షిస్తుంది. దీనివల్ల నిత్యావసర వస్తువుల కొరత లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కమిటీకి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మార్కోస్ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. ఎనర్జీ, ట్రాన్స్‌పోర్టు, ఫైనాన్స్, వ్యవసాయం, సోషల్ వెల్ఫేర్, బడ్జెట్ వంటి కీలక శాఖల మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు.
UPLIFT కమిటీ బాధ్యతలు
* ఇంధనం, ఆహారం, ఔషధాల సరఫరా పర్యవేక్షణ
* నిత్యావసర వస్తువుల కొరత లేకుండా చూడటం
* ప్రజా రవాణా సేవల్లో అంతరాయం కలగకుండా చూడటం
* ఆర్థిక కార్యకలాపాల నిలకడ
* బడుగు, బలహీన వర్గాల సంక్షేమం
వీటితో పాటు ఇంధన వినియోగాన్ని తగ్గించే దీర్ఘకాలిక వ్యూహాలను రూపొందించే బాధ్యత కూడా ఈ కమిటీకి అప్పగించారు.
కేవలం 45 రోజులకే ఇంధన నిల్వలు
ప్రస్తుతం దేశంలో ఉన్న ఇంధన నిల్వలు కేవలం 45 రోజులకే సరిపోతాయని ఫిలిప్పీన్స్ ఇంధన శాఖ కార్యదర్శి షారోన్ గారిన్ తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇంధన కొరత నివారించేందుకు ఫిలిప్పీన్స్ ప్రభుత్వం.. దక్షిణాసియా దేశాలే కాకుండా ఇతర దేశాల నుంచి దాదాపు 10 లక్షల బ్యారెల్స్ చమురు కొనుగోలు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. దీని ద్వారా అదనపు ఇంధన నిల్వలు ఉంచుకోవాలని భావిస్తోంది. దేశంలో ఏడాదిపాటు ఇంధన ఎమర్జెన్సీ అమలులో ఉండనుంది. ఈ క్రమంలో అవసరమైన ఇంధనాన్ని కొనుగోలు చేసేందుకు ముందస్తు చెల్లింపులు చేసేందుకు సిద్ధమైంది.
ఉద్యోగులకు వారానికి 4 రోజులు మాత్రమే
గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంతో తాత్కాలికంగా విద్యుత్ ఉత్పత్తి కోసం థర్మల్ ప్లాంట్లపై ఎక్కువగా ఆధారపడాలని ఫిలిప్పీన్స్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల కరెంట్ చార్జీలు పెరగకుండా అదుపు చేయవచ్చని ఇంధన శాఖ కార్యదర్శి షారోన్ గారిన్ తెలిపారు. ఇంధనాన్ని ఆదా చేయడానికి ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే పనిదినాలు అమలు చేస్తున్నారు. అలాగే ఫెర్రీ సర్వీసులను కూడా తగ్గించారు.
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేస్తున్న నేపథ్యంలో జాతీయ ఇంధన ఎమర్జెన్సీ ప్రకటించిన తొలి దేశంగా ఫిలిప్పీన్స్ నిలిచింది. రాబోయే రోజుల్లో ఫిలిప్పీన్స్‌ను ఆదర్శంగా తీసుకుని మరిన్ని దేశాలు కూడా ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read More:
Covid 19 Lockdown | ఇండియాలో లాక్‌డౌన్.. గూగుల్ సెర్చ్‌లో టాప్
Beer Price | మందుబాబులకు బిగ్ షాక్.. యుద్ధం ఎఫెక్ట్‌తో భారీగా పెరగనున్న బీర్ల ధరలు!
