హ‌మాస్ త‌గిన మూల్యం చెల్లించాల్సిందే.. జీవితాంతం గుర్తుండేలా జ‌వాబిస్తాం

  • Publish Date - October 10, 2023 / 07:47 AM IST

  • ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజ‌మ‌న్ నెత‌న్యాహు హెచ్చ‌రిక‌
  • గాజాను అష్ట‌దిగ్బంధ‌నం చేసిన ఇజ్రాయెల్ ద‌ళాలు
  • అక్క‌డి మంత్రులు, ఎంపీలే ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని హెచ్చ‌రిక‌
  • 1500 మంది హ‌మాస్ స‌భ్యులను మ‌ట్టుబెట్టిన సైన్యం



విధాత‌: మెరుపు దాడితో విధ్వంసానికి పాల్ప‌డిన హ‌మాస్ ఉగ్ర‌వాదుల‌పై ఇజ్రాయెల్ (Israel War) సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. మంగ‌ళ‌వారం ఉద‌యం నాటికి క‌నీసం 1500 మంది ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టి వారి మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నామ‌ని ఇజ్రాయెల్ సైన్యం ప్ర‌క‌టించింది. త‌మ వైపు 900 మంది పౌరులు మ‌ర‌ణించార‌ని, 2600 మంది ఆసుప‌త్రి పాల‌య్యార‌ని పేర్కొంది. సుమారు 3 ల‌క్ష‌ల మంది రిజ‌ర్వు సైనికులు క‌ద‌న రంగంలోకి దూక‌డంతో ఇజ్రాయెల్ పాద‌ర‌సంలా గాజాలోకి చొచ్చుకుపోతోంది.


అక్క‌డి పార్ల‌మెంటు స‌భ్యులు, మంత్రులే త‌మ దాడి ల‌క్ష్యాల‌ని ప్ర‌క‌టించింది. ఆహారం, నీరు, ఇంధ‌నం త‌దిత‌రాలేవీ గాజాలోకి వెళ్ల‌కుండా వీరు ఇప్ప‌టికే అష్ట‌దిగ్భంధ‌నం చేశారు. సంక్షోభం మొద‌లైన శ‌నివారం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 1,87,000 మంది పాల‌స్తీనియ‌న్లు గాజా నుంచి వ‌ల‌స వెళ్లిపోయార‌ని అంచ‌నా. అమెరికా ఇప్ప‌టికే త‌మ యుద్ధ విమాన నౌక‌ల‌ను, జ‌లాంత‌ర్గాముల‌ను ఇజ్రాయెల్ వ‌ద్ద‌కు పంపుతుండ‌గా.. జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్‌, భార‌త్‌, బ్రిట‌న్ త‌దిత‌ర దేశాలు టెల్ అవీవ్‌కు గ‌ట్టి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని ప్రారంభించ‌న‌ప్ప‌టికీ.. ముగించేది మాత్రం మేమే అని ప్ర‌ధాని బెంజ‌మ‌న్ నెత‌న్యాహూ హెచ్చ‌రించారు.


హ‌మాస్ ద‌ళాలు తాము చేసిన త‌ప్పుకు త‌గిన మూల్యం చెల్లించాల్సిందేన‌ని, తాము నేర్పబోయే పాఠాన్ని వారు జీవితాంతం గుర్తుపెట్టుకుంటార‌ని పేర్కొన్నారు. మ‌రోవైపు పాల‌స్తీనాపై ఇజ్రాయెల్ బాంబు ప‌డిన ప్ర‌తిసారీ త‌మ చేతిలో బందీగా ఉన్న ఆ దేశ పౌరులు ఒకొక్క‌రిని చంపుతామ‌ని హ‌మాస్ తీవ్ర హెచ్చ‌రిక చేసింది. కాగా హ‌మాస్ ఇజ్రాయెల్ మ‌ధ్య జ‌రుగుతున్న పోరులో ఎటువంటి సంబంధం లేని ప‌లువురు విదేశీయులూ మ‌ర‌ణించ‌డం ప్ర‌పంచాన్ని క‌ల‌వ‌ర‌పెడుతోంది. కొంత‌మంది విదేశీయులు ఇప్ప‌టికీ ఉగ్ర‌వాదుల అధీనంలో ఉన్నార‌ని తెలుస్తోంది.


థాయ్‌ల్యాండ్ – 11, యూఎస్ – 11, నేపాల్ – 10, అర్జెంటీనా – 7 ఇలా ప‌లు దేశాలకు చెందిన వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ పోరాటాన్ని పూర్తి స్థాయి యుద్ధంగా మారకుండా ఉండేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని ఐరాస ప్ర‌క‌టించింది. ఇరు ప‌క్షాలతోనూ తాము సంప్ర‌దింపులు మొద‌లుపెట్టామ‌ని ఐరాస సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఆంటోనియో గుటెర‌స్ ప్ర‌క‌టించారు. చ‌ర్చ‌ల‌కు హమాస్ సంసిద్ధ‌త వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు అర‌బ్ దేశాల విదేశాంగ మంత్రుల‌తో పాల‌స్తీనా ప్ర‌భుత్వం స‌మావేశం కానుంది. కైరోలో జ‌ర‌గ‌నున్న ఈ స‌మావేశంలో ఇజ్రాయెల్ ఆధిప‌త్య వాదంపై చ‌ర్చిస్తామ‌ని ఒక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.

Latest News