మూడో ప్రపంచయుద్ధం అనివార్యమా?
గత నాలుగు రోజుల నుండి జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ప్రపంచం మూడో యుద్ధం వైపు అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ మధ్య చాలా దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, యుద్ధాలు ప్రస్తుతం ఉచ్ఛదశలో ఉన్నాయి.

-
- మూడో ప్రపంచ యుద్ధం ముప్పు?
- విస్తరణవాదంతో ఊగుతున్న దేశాలు
- ఉక్రెయిన్, రష్యాల ఎడతెగని యుద్ధం
- నిత్య అగ్నిగుండంలా మధ్యప్రాచ్యం
- రంగంలోకి దిగుతున్న అమెరికా
- ఆయుధాల అమ్మకానికి భలే చాన్స్
- ఆధునిక కాలంలోనూ యుద్ధోన్మాదం
- యుద్ధంలో మరణించేది ప్రజలు కాదు..
- మానవత్వ హననానికే యుద్ధాలు
నానాటికీ పెచ్చరిల్లుతున్న మధ్యప్రాచ్యంలోని సమర సన్నాహాలు, యూరప్‌లో ఘర్షణలు, ఆసియాలో నివురుగప్పిన నిప్పులాంటి స్థితి.. మూడో ప్రపంచయుద్ధం ఎంతో దూరంలో లేదని సూచిస్తున్నాయి. ఈ పరిస్థితికి కారణమవుతున్నపెద్దలెవరో తెలుసుకోవడానికి గొప్పగా కష్టపడనవసరం లేదు. అందులో ఐదారుగురు ముఖ్యమైన నేతలు ఉన్నారు. మిగతావారంతా వారి స్వంత శత్రుదేశాలతో తలపడే ప్రయత్నాల్లో ఉన్నారు. వీరందరిలో మిత్రులున్నారు. శత్రువులూ ఉన్నారు. వారో పక్క, వీరో పక్క కలిస్తే, ఇక మనం మరో ప్రపంచ యుద్ధంలోకి అడుగుపెట్టినట్లే. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు, అయొతుల్లా ఖమేనీ, వ్లాదిమిర్ పుతిన్, వ్లదీమిర్ జెలెన్స్కీ ప్రధానపాత్రధారులు కాగా, పాకిస్తాన్ మిలిటరీ జనరల్ ఆసిఫ్ మునీర్, బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ సహాయపాత్రలు పోషిస్తున్నారు. యుద్ధక్షేత్రంలో ఇప్పటికే ఉన్న రష్యా–యూక్రెయిన్, ఇజ్రాయెల్–ఇరాన్లలో అమెరికా అటు ఉక్రెయిన్‌కు, ఇటు ఇజ్రాయెల్‌కు ప్రధాన మద్దతుదారుగా మాత్రమే కాక, వారికి అండగా యుద్ధంలోకి దిగడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం విషయమంతా ఇజ్రాయెల్–ఇరాన్ మీదే ఉంది కాబట్టి, ఇరాన్‌ను సర్వనాశనం చేసేదాకా అమెరికా, ఇజ్రాయెల్ నిద్రపోవు. బ్రిటన్ కూడా ఈ సమర సన్నద్ధత దృష్ట్యా తను కూడా తన ఏర్పాట్లలో మునిగిఉంది. యుద్ధం మొదలై ఐదు రోజులైనా, ఎవరూ తగ్గేట్టుగా కనబడటంలేదు. ఇరాన్ అణుశుద్ధి కేంద్రం, అధ్యక్షుడు ఖమేనీలను పూర్తిగా నిర్మూలించందే ఇజ్రాయెల్ శాంతించేలాలేదు.
టార్గెట్ ఫోర్డో భూగర్భ అణు స్థావరం!
మరోపక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్, జీ7 సదస్సను వీడి అర్ధంతరంగా స్వదేశానికి పయనమయ్యాడు. వెంటనే సంధాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా తన అధికారగణాన్ని ఆదేశించడం చూస్తే, ఇరాన్‌కు మూడినట్లే కనబడుతోంది. బహుశా రాబోయే రెండు మూడు రోజుల్లో ఏదో పెద్ద సంఘటనే జరిగే అవకాశముంది. ఇరాన్ రహస్య అణుస్థావరమైన ఫోర్డో భూగర్భ కేంద్రం ధ్వంసం చేయడమే అజెండా అయుండవచ్చు. ఇప్పటికే ఇజ్రాయెల్ దానిపై దాడులు చేసింది కానీ, భూగర్భంలో చాలా లోతైన ప్రదేశంలో, అత్యంత భద్రత మధ్య ఉన్న ఫోర్డో, నతాంజ్ కేంద్రాలను నాశనం చేయడం దానివల్ల కాదు. అందుకు కావాల్సిన బాంబులు అమెరికా వద్ద మాత్రమే ఉన్నాయి. ఫోర్డో ఓ పర్వతం అడుగున భూమి లోపల ఉంది. దాన్ని ధ్వంసం చేయాలంటే అమెరికా వద్ద ఉన్న జీబీయూ –57 బంకర్ బస్టర్ బాంబు వల్లే సాధ్యం. 14టన్నుల బరువుండే ఈ బాంబు పర్వతంలోపలికి చొచ్చుకుపోయి భూగర్భంలో పేలిపోతుంది. దాన్ని ప్రయోగించగల బీ–2 బాంబర్లు ఇప్పటికే మధ్యప్రాచ్యానికి చేరుకున్నాయి. అమెరికా నౌకాదళం కూడా సమీపంలోనే మోహరించిఉంది. ఇరాన్ అధినేత ఖమేనీని అంతం చేయాలని పట్టుదలతో ఉన్న నెతన్యాహూను నియంత్రించడం ట్రంప్ వల్లకావడంలేదు. ఖమేనీ అంతమే యుద్ధానికి అంతం అని నెతన్యాహూ గట్టిగా భావిస్తున్నాడు. పైగా ఆయన ఎక్కడ దాక్కున్నాడో తమ వద్ద ఖచ్చితమైన సమాచారముందని అమెరికా అధ్యక్షుడు ప్రకటించాడు కూడా.
తీవ్ర స్థాయికి ఉక్రెయిన్, రష్యా యుద్ధం
ఉక్రెయిన్–రష్యా యుద్ధం కూడా తీవ్రస్థాయికి చేరుకుంది. ఉక్రెయిన్ చేసిన డ్రోన్ దాడి వల్ల తన మెజారిటీ బాంబర్లను కోల్పోయిన రష్యా అవమానాగ్రహాలతో రగిలిపోతోంది. చిన్న చిన్న డ్రోన్లు తన పెను బాంబర్లను నాశనం చేయడం రష్యా తట్టుకోలేకపోతోంది. అందుకే కీవ్ మీద భారీ దాడికి దిగింది. ఇజ్రాయెల్.. పాలస్తీనాపై కూడా దాడి కొనసాగిస్తోంది. గాజాలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. వేలాదిమంది చిన్నపిల్లలు ఆహారం లేక చావు అంచున కొట్టుమిట్టాడుతున్నారు. వేరే దేశాలు పంపుతున్న మానవతాసాయం కూడా సరిగ్గా అందడంలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఒకే ఒక్క యుద్ధపు ఫలితం. ప్రపంచయుద్ధమే వస్తే…?
యుద్ధంలోకి అమెరికా
యుద్ధం ప్రారంభమైందని ఇరాన్ సుప్రీం ఖమేనీ బుధవారం ఉదయం ఎక్స్‌లో ప్రకటించాడు. దీంతో అమెరికా యుద్ధంలోకి నేరుగా దిగబోతోంది. ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో తమకు తెలుసన్న ట్రంప్, బేషరతుగా లొంగిపోవాలని ఖమేనీకి సూచించాడు కానీ, నేటి ఆయన ప్రకటన లొంగిపోవడమనే ప్రస్తక్తే లేదని, యుద్ధానికే సిద్ధమని, యూదురాజ్యాన్ని రానివ్వబోమని తేల్చి చెప్పింది. ఇరాన్ విదేశాంఖ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ భాఘై అమెరికా ఈ యుద్ధంలో నేరుగా జోక్యం చేసుకుంటే మధ్య ప్రాచ్యంలో పూర్తిస్థాయి యుద్ధాన్ని చూడాల్సివస్తుందని హెచ్చరించారు. తమ మిత్రులైన అరబ్‌దేశాలు, సాటి ముస్లిం దేశాన్ని నాశనం చేయడానికి తమ భూభాగాన్ని అమెరికా వాడుకోవడానికి ఒప్పుకోరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కానీ, ఇరాన్ అణ్వాయుధ సంపత్తిని కలిగిఉండటం కుదరదని తేల్చిచెప్పిన ట్రంప్, ఆయా కేంద్రాల ధ్వంసానికే మొగ్గు చూపుతాడనేది నిర్వివాదాంశం. నతాంజ్, ఫోర్డో అణుఇంధన శుద్ధి కేంద్రాలను పూర్తి స్థాయిలో నాశనం చేయాలంటే అది ఒక్క అమెరికాకే సాధ్యం. అందుకే ఇజ్రాయెల్ అమెరికా జోక్యాన్ని కోరుతోంది. బహుశా ఓ రెండు మూడు రోజుల్లో ఈ దిశగా ప్రయత్నాలు జరిగే అవకాశముంది.
యుద్ధాన్ని కోరుకోవడం అమెరికా సహజ లక్షణం
యుద్ధోన్మాద దేశాల సంఖ్య పెరుగుతూఉండటం ఆందోళన కలిగించే అంశం. నిజానికి అమెరికా ఎప్పుడూ యుద్ధాన్నే కోరుకుంటుంది. తమ ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని అమ్ముకోవాలంటే ప్రపంచంలో ఏదో మూల యుద్ధం జరుగుతూనే ఉండాలి. ట్రంప్ లాంటి ఆయుధ బేహారికి ఇదో చక్కటి అవకాశం. ఓ పక్క యుద్ధాలను ఆపేయడానికే పుట్టానంటూ ప్రగల్భాలు పలికే ట్రంప్, అదే చేత్తో ఆయుధాలు అమ్మచూపుతాడు. అమెరికా అధ్యక్షుడికి ఏ దేశమైనా ఒకటే. పాకిస్తాన్‌కూ, భారత్‌కు ఆయనెప్పుడూ మంచి స్నేహితుడే. పాకిస్తాన్ నియంత సైనికాధికారిని విందుకు ఆహ్వానిస్తాడు. నరేంద్రమోదీని గట్టిగా ఆలింగనం చేసుకుంటాడు. అమెరికా గత అధ్యక్షుల ధోరణి కూడా అమెరికా ఫస్టే అయినప్పటికీ, ట్రంప్‌లా దిగజారలేదు. అత్యున్నత దేశమైన అమెరికాకు అధ్యక్షులుగా హుందాగా ఉండేవారు. మాట్లాడే పద్ధతి, స్నేహాన్ని కోరుకునే తీరు, ఆఖరికి బెదిరించే తీరు కూడా సున్నితంగా ఉండేది. అమెరికాకు తనను మించిపోయే అవకాశమున్న దేశాలను అసలు వదిలిపెట్టదు. రష్యా అయినా చైనా అయినా ప్రస్తుతం భారత్ అయినా తనకు కంటగింపే. అందుకే రష్యా, చైనాలు అమెరికాకు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయి. డోనాల్డ్ ట్రంప్ వల్ల ఈ పరిస్థితి మరింత దిగజారింది. మరిన్ని దేశాలను తనకు శత్రువులుగా మార్చుకుంటున్నారు.
అభివృద్ధిలో అమెరికాతో చైనా పోటీ
ఇక చైనా, విస్తీర్ణం దృష్ట్యా ప్రపంచంలోని అతిపెద్ద దేశాల్లో మూడో స్థానంలో ఉంది. అభివృద్ధిలో అమెరికాతో పోటీ పడుతోంది. జీడీపీలో అగ్రరాజ్యం తర్వాతి స్థానం చైనాదే. చైనాది కూడా అమెరికాలాంటి మనస్తత్వమే. విస్తరణవాదం బలంగా ఉన్న చైనా, విపరీతమైన భూసంపద కలిగిఉన్నా, ఇంకా తైవాన్ను ఆక్రమించుకోవాలని, ఇటు భారత్‌తో ఉన్న సరిహద్దును మెల్లగా జరుపుకుంటూ, అరుణాచల్‌ప్రదేశ్ నాదేనంటూ వక్రబుద్ధిని చాటుతోంది. భారత్‌ను ప్రధాన శత్రువుగా చూసే చైనా, భారత్ చుట్టూ ఉన్న చిన్నచిన్న దేశాలను అప్పులిచ్చి తనవైపుకు తిప్పుకుంటూ మెల్లగా అష్టదిగ్బంధనం చేస్తోంది. ఎటూ పాకిస్తాన్‌కు అత్యంత మిత్రదేశంగా ఉంటూనే, నేపాల్, భూటాన్, మయన్మార్, శ్రీలంక, అఫ్ఘనిస్తాన్ లాంటి పేదదేశాలకు అభివృద్ధి ఆశ చూపి లొంగదీసుకుంటోంది. ఒకవిధంగా మూడో ప్రపంచయుద్ధమంటూ వస్తే, చైనా అమెరికాలే మొదలుపెడతాయని, మిగతాదేశాలు ఏదో దానికి మద్దతుగా నిలబడాల్సివస్తుందని సింగపూర్ ‘స్ట్రెయిట్స్ టైమ్స్’ పత్రిక పేర్కొంది.
విస్తరణవాదంతోనే రష్యా కూడా
ఈ భూగోళంపైనే అతిపెద్ద దేశమైన రష్యా కూడా ఇదే విస్తరణవాదంలో ముందుకెళ్తోంది. ఉక్రెయిన్ను తిరిగి ఆక్రమించుకోవాలని చూస్తున్న రష్యాను నిలువరించడానికి ఉక్రెయిన్‌కు అమెరికా సహాయం చేస్తోంది. ఇక్కడా తన వ్యాపారం మాత్రం వదులుకోలేదు. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మొదలై ఏళ్లు గడిచినా, ఎటూ తేలడం లేదు. లేదా అమెరికా తేలనివ్వడంలేదు.
క్షిపణి పరీక్షల్లో ఉత్తర కొరియా
ఉత్తర కొరియా ఒక నియంత పాలనలో ఉంది. కిమ్ ఉన్ జాంగ్ అనబడే ఈ నియంత, కేవలం ఆయుధాల తయారీ, అణుబాంబుల తయారీ పైనే దృష్టి పెట్టి, తన ప్రజలను పట్టించుకోవడమే మానేశాడు. ఓ పక్క తిండిలేక మలమలమాడుతున్న ప్రజలను వదిలేసి, క్షిపణి పరీక్షలలో నిమగ్నమైఉంటాడు. అతడి చేతిలో అణ్వాయుధం, పిచ్చోడి చేతిలో రాయిలాంటిది. దానికి శత్రువైన దక్షిణ కొరియానే కాకుండా అమెరికా కూడా భయపడాల్సిన పరిస్థితి.
ఏ యుద్ధం ఎటువైపు దారితీస్తుందో తెలియని దేశాలు కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో తన సైనిక శక్తిని భారీగా పెంచుకోవాల్సివస్తోంది. అవసరం ఉన్నా, లేకపోయినా, అణుపాటవం కలిగిన దేశాలు తమ అణుబాంబులను ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటున్నట్లు అంతర్జాతీయ అణుఇంధన సంస్థ తెలిపింది. పాకిస్తాన్‌కు తినడానికి తిండి లేకపోయినా, అణుబాంబులను మాత్రం బాగానే పోగేసింది. పహల్గావ్ దుర్ఘటన తర్వాత భారత్ కూడా తన ఆయుధశక్తిని మరోసారి పరిశీలించుకుని, పెంచే దిశగా ఆలోచిస్తోంది. ఇందులో స్వావలంబన సాధించడం కూడా భారత్ లక్ష్యం. ఇలా భారత్, దక్షిణ కొరియా, యూరప్, తైవాన్, అఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు తమ ప్రమేయం లేకుండానే యుద్ధంలోకి లాగబడుతున్నాయి.
యుద్ధంలో మరణించేది మానవత్వమే
నిజానికి ఇవన్నీ కేవలం ఆధిపత్య ధోరణిని ప్రతిబింబించే చర్యలే. తామే గొప్ప అనే మిథ్యావాదాన్ని పట్టుకుని వేలాడుతూ, ప్రపంచాన్ని క్రమంగా యుద్ధం వైపు నెడుతున్నాయి ఈ దేశాలు. ఓ పక్క సరైన తిండి లేక అల్లాడుతున్న ఆఫ్రికా దేశాల ప్రజలు, యుద్ధక్షేత్రాల్లోని పిల్లలు రోజూ వేలాదిగా మరణిస్తూంటే, చోద్యం చూస్తున్న అగ్రదేశాలు యుద్ధాలకు మాత్రం సై అంటున్నాయి. ఏదేమైనా సాంకేతికంగా ఎంతో ఉన్నతిని సాధించిన మానవజాతి, మానవత్వంతో తన జాతి మనుగడకు, అభివృద్దికి పాటుపడాల్సిన సమయంలో యుద్ధోన్మాదం వేపు అడుగులేయడం పెను విషాదం. ఈ యుద్ధంలో మరణించబోయేది ప్రజలు కాదు, మానవత్వం.