కీలక దశకు అమెరికా–ఇరాన్‌ చర్చలు.. 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు.. హార్మూజ్‌ జలసంధి ప్రధానాంశాలు..

అమెరికా, ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న చర్చలు పురోగతిలోనే ఉన్నాయని తెలుస్తున్నది. రెండు దేశాలకు చాలా వరకూ ఆమోదయోగ్యమైన ప్రతిపాదనలపై ఉభయ దేశాల ప్రతినిధులు చర్చిస్తున్నట్టు సమాచారం. ఇందులో ఇరాన్‌ పునర్నిర్మాణం, పెట్టుబడుల ప్యాకేజీ కింద 300 బిలియన్‌ డాలర్లు వెచ్చించే అంశం కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. అదే సమయంలో మరో కీలక అంశం హార్మూజ్‌ జలసంధిని తెరిచే అంశం కూడా చర్చిస్తున్నారు.

దాదాపు మూడు నెలలుగా నెలకొన్ని ఘర్షణలు, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌, అమెరికా మధ్య చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణను శాశ్వత ఒప్పందంగా మారే దిశగా రెండు దేశాల నాయకత్వం ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఇరాన్‌లో 300 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి ప్యాకేజీ, హార్మూజ్‌ జల సంధి భవిష్యత్తు, ఇరాన్‌ అణుకార్యక్రమం, ఆంక్షల సండలింపు వంటివి ప్రస్తుతం చర్చల్లో ఉన్న కీలక ప్రతిపాదనలుగా తెలుస్తున్నది. ఇరాన్‌–అమెరికా యుద్ధం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఈ చర్చలపై యావత్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్నది.

కొత్త డ్రాఫ్ట్‌పై చర్చలు

ప్రస్తుతం రెండు దేశాల ప్రతినిధులు కొత్త డ్రాఫ్ట్‌ మెమొరాండంపై చర్చిస్తున్నారని న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం పేర్కొన్నది. గత ప్రతిపాదనలకంటే ఇది రెండు పక్షాలకు కొంత సానుకూలంగా ఉన్నదని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో కొన్ని కీలక అంశాలపై విభేదాలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఇది ప్రాథమిక ఒప్పందం మాత్రమే. ముందుగా దీన్ని అమల్లోకి తెచ్చేందుకు ఉభయ పక్షాలు అంగీకారం తెలియజేయాల్సి ఉంటుంది. అటు పిమ్మట తదుపరి దశలో ఇరాన్‌ అణు కార్యక్రమం, అమెరికా ఆంక్షలు, ప్రాంతీయ భద్రత, యుద్ధానికి అధికారిక ముగింపు వంటి క్లిష్టమైన అంశాలపై విస్తృత స్థాయిలో చర్చలు ప్రారంభం అవుతాయి. ఈ ప్రాథమిక ఒప్పందం అమల్లోకి వస్తే, తరువాతి దశలో ఇరాన్ అణు కార్యక్రమం, అమెరికా ఆంక్షలు, ప్రాంతీయ భద్రత, యుద్ధానికి అధికారిక ముగింపు వంటి క్లిష్టమైన అంశాలపై విస్తృత చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే.. ఈ చర్చల్లో అత్యంత కీలక అంశంగా 300 బిలియన్‌ డాలర్ల పునర్నిర్మాణ, పెట్టుబడి ప్యాకేజీకి ఆమోదం లభిస్తే ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మారిపోతాయని భావిస్తున్నారు. చర్చల్లో ఇటీవలి రోజుల్లో గణనీయమైన పురోగతి కనిపించినప్పటికీ.. ఇంకా దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆమోదం లభించలేదు.

తాత్కాలికంగా 60 రోజులపాటు యుద్ధ విరమణ

చర్చల్లో ఉన్న ప్రధాన ప్రతిపాదనల్లో 60 రోజులపాటు యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలన్నది కూడా ఉన్నది. ఈ రెండు నెలల వ్యవధిలో రెండు దేశాలు పరస్పర దాడులను నిలిపివేయాల్సి ఉంటుంది. మరోవైపు ఆర్థిక సహాయం, ఆంక్షల సడలింపు, పునర్నిర్మాణం, పెట్టుబడులపై చర్చలు కొనసాగించాలని ఉభయ దేశాలు భావిస్తున్నట్టు సమాచారం. ఇది తాత్కాలిక సీజ్‌ఫైర్‌గా కాకుండా.. ‘యుద్ధానికి విస్తృత ముగింపు ప్రకటన’గా చూడాలని ఇరాన్‌ అధికారులు కోరుతున్నట్టు తెలుస్తున్నది. హిజ్బొల్లా సంబంధిత లెబనాన్‌ ఘర్షణలు కూడా ఇందులో భాగమని చెబుతున్నారు.

300 బిలియన్ డాలర్‌ పునర్నిర్మాణ ప్యాకేజ్‌

దాదాపు మూడు నెలలపాటు సాగిన యుద్ధం, అమెరికా ఆంక్షలు, ఇరాన్‌పై బాంబు దాడులతో తమ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని ఆ దేశ అధికారులు చెబుతున్నారు. ఈ యుద్ధంలో ఇరాన్‌కు కనిష్ఠంగా 300 బిలియన్‌ డాలర్ల నుంచి గరిష్ఠంగా లక్ష కోట్ల డాలర్ల వరకూ నష్టం వాటిల్లిందని కొన్ని అంచనాలు చెబుతున్నాయి. దీనికి పరిహారంగా అమెరికా మద్దతుతో అంతర్జాతీయ పెట్టుబడుల ద్వారా ఇరాన్‌లో మౌలిక సదుపాయాలు, చమురు రంగం, ఇండస్ట్రీస్‌ పునర్నిర్మాణానికి భారీ పెట్టుబడులు తీసుకురావడం అనే అంశం చర్చల్లో కీలక ప్రతిపాదనగా ఉన్నది. ఆంక్షలు ఎత్తివేసే క్రమంలో అమెరికా చమురు, ఇంధన కంపెనీలు తమ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతిస్తామని ఇరాన్‌ ప్రతినిధులు చెబుతున్నారు. విదేశాల్లోని బ్యాంకుల్లో ఉన్న ఇరాన్‌కు చెందిన సుమారు 24 బిలియన్‌ డాలర్ల నిధుల విడుదలపైనా ప్రతినిధులు చర్చిస్తున్నారు. వాటిలో కనీసం 20 బిలియన్‌ డాలర్లు విడుదల చేసుకునేందుకు అవకాశం ఇస్తే వాటితో తమ దేశ పునర్నిర్మాణం, ఆర్థిక స్థిరీకరణ, మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు ఉపయోగించుకుంటామని ఇరాన్‌ ప్రతినిధులు ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే.. నేరుగా నిధులు విడుదల చేయడం కాకుండా.. ఖతార్‌ వంటి మూడో దేశం ద్వారా, అది కూడా విడతలవారీగా విడుదల చేయాలని అమెరికా ప్రతిపాదిస్తున్నదని తెలుస్తున్నది.

అత్యంత కీలకం హార్మూజ్‌ జల సంధి..

ప్రపంచ దేశాలకు ఇంధనాన్ని రవాణా చేసే మార్గమైన హార్మూజ్‌ జల సంధి అంశం చర్చల్లో ప్రధాన అడ్డంకిగా మారిందని చెబుతున్నారు. ప్రపంచ దేశాలకు చమురు, గ్యాస్‌ సరఫరాల్లో దాదాపు ఐదో వంతు ఈ మార్గం ద్వారానే రవాణా అవుతూ ఉంటుంది. అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్‌ ఈ మార్గాన్ని మూసివేసింది. దీనితో ప్రపంచ దేశాల ఇంధన మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. అనేక దేశాల్లో చమురు ధరలు అమాంతం పెరిగిపోయాయి. హార్మూజ్‌ను వెంటనే తెరిచి, వాణిజ్య నౌకల రాకపోకలకు మార్గం సుగమం చేయాలని పట్టుబడుతున్న అమెరికా… ఇరాన్‌ పోర్టుపై అమెరికా నౌకాదళం విధించిన నిర్బంధాలను దశలవారీగా మాత్రమే తొలగిస్తామని చెబుతోంది. కానీ.. ఇరాన్‌ మాత్రం 30 రోజుల వ్యవధిలో అన్ని పోర్టులపై నిర్బంధాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నది. భవిష్యత్తులో ఈ మార్గం ద్వారా వెళ్లే నౌకల నుంచి ఇరాన్‌తోపాటు ఒమన్‌ సైతం సర్వీస్‌ ట్యాక్స్‌ వసూలు చేసుకునేందుకు హక్కు ఉండాలని ఇరాన్‌ పట్టుబడుతున్నది. ఈ ప్రతిపాదనను ట్రంప్‌ బహిరంగంగానే కొట్టిపారేశారు.

తర్వాతి దశలో అణు కార్యక్రమంపై చర్చలు

ఇరాన్‌ అణు కార్యక్రమం అనేది అత్యంత కీలక అంశంగా ఉన్న నేపథ్యంలో దీనిని ప్రస్తుత చర్చల్లో కాకుండా.. తదుపరి చర్చల్లో తీసుకోవాలని తాజా ప్రతిపాదనలు పేర్కొంటున్నట్టు సమాచారం. చర్చలు కొనసాగుతున్న సమయంలో కొత్త ఆంక్షలు విధించరాదని ఇరాన్‌ డిమాండ్‌ చేస్తున్నది.

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం..

అమెరికా–ఇరాన్‌ మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న చర్చలు.. ఆ రెండు దేశాల సంబంధాలనే కాకుండా.. మొత్తం మధ్య ఆసియా, ప్రపంచ చమురు ధరలతోపాటు మొత్తంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలనే ప్రభావితం చేయనున్నాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ చర్చల విజయవంతంపైనే కేంద్రీకృతమైంది.

Latest News