Iran War | ఇరాన్‌ విద్యుత్తు ప్లాంట్లు, చమురు బావులను పేల్చేస్తాం.. : మరోసారి ట్రంప్‌ వార్నింగ్‌

ఇరాన్‌కు వరుస వార్నింగ్‌లు ఇస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. హర్మూజ్‌ జలసంధి తెరవాలని, యుద్ధం ముగించేందుకు ఒప్పందానికి రావాలన్న ట్రంప్‌.. లేని పక్షంలో ఇరాన్‌లోని చమురు బావులను, విద్యుత్తు ప్లాంట్లను పేల్చివేస్తామని హెచ్చరించారు.

Donald Trump Iran warning

Iran War | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఇరాన్‌కు సోమవారం (మార్చి 30, 2026) గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. సాయుధ ఘర్షణకు ముగింపు పలికేలా, హార్మూజ్‌ జలసంధిని తెరిచేలా ఒప్పందం కుదుర్చుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఇరాన్‌లోని విద్యుత్తు ప్లాంట్లను, చమురు బావులను, ఖార్గ్‌ దీవిని పేల్చివేస్తామని, వాటి రూపురేఖలు కూడా కనబడనీయకుండా చూస్తామని తేల్చి చెప్పారు. ఇరాన్‌లోని చమురును తాము తీసుకుంటామని ట్రంప్‌ ప్రకటించారు. ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ చమురును నియంత్రించడం తమకు కీలక ప్రాధాన్యమని చెప్పారు. ‘మీకు నిజాయితీగా చెప్పాలంటే.. నా ఫేవరెట్‌ అంశం.. ఇరాన్‌ నుంచి చమురును తీసుకోవడం’ అని ఆయన స్పష్టంచేశారు. దీనిని తప్పుపట్టేవారు మూర్ఖులేనని వ్యాఖ్యానించారు.

ఖార్గ్‌ దీవి విషయంలో అమెరికాకు మల్టిపుల్‌ ఆప్షన్స్‌ ఉన్నాయని ట్రంప్‌ పేర్కొన్నారు. మేం ఖార్గ్‌ ఐలాండ్‌ను తీసుకోవచ్చు.. తీసుకోకపోవచ్చు. మాకు చాలా ఆప్షన్స్‌ ఉన్నాయి’ అని తెలిపారు. ఆ ఆపరేషన్‌ పెద్ద కష్టమేమీ కాదని చెప్పారు. ‘ఏమైనా ప్రతిఘటన ఉంటుందని నేను అనుకోవడం లేదు. దానిని మేం చాలా సులభంగా స్వాధీనం చేసుకోగలం’ అని బీరాలు పలికారు. అదే సమయంలో.. చర్చలు కొనసాగుతున్నాయని, ఒక డీల్‌ కుదిరేందుకు అవకాశం ఉన్నదని చెప్పారు.

అంతకు ముందు ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్‌ బఘాయీ మాట్లాడుతూ.. అమెరికాతో ఇంత వరకూ తాము నేరుగా సంప్రదింపులు చేయలేదని అన్నారు. ఇరాన్‌కు తెలియజేసిన ప్రతిపాదనల్లో చాలా వరకూ అవాస్తవికంగా, అవివేకంగా, అతిశయోక్తులతో ఉన్నాయని అన్నారు. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధాన్ని ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా సాగిస్తున్న యుద్ధంతో ముడిపెట్టడం ‘విపత్కర తప్పిదం’గా ఆయన అభివర్ణించారు.

Latest News