పాయింట్ చూడకపోతే 2000 కాస్త రెండు లక్షలు అవుతాయి

2 వేల రూపాయలు అనుకొని పొరబడిన ఒక మహిళ రూ.2 లక్షల విలువైన మద్యం ఆర్డర్‌ ఇచ్చింది.. దీంతో ఆమె భర్తను ఆమెను బార్‌లోనే వదిలి వెళ్లిపోయాడు..మరి బిల్లు ఎవరు కట్టారు?

పాయింట్ చూడకపోతే 2000 కాస్త రెండు లక్షలు అవుతాయి

లండన్‌ : ఒక్కోసారి పాయింట్‌ మర్చిపోతే దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తుంది. పాయింట్‌ అంటే రెండు అంకెల మధ్య ఉండే పాయింట్‌. ఒక మహిళ ఆ పాయింట్‌ను మిస్‌ అయి.. రెండువేలే అనుకుని.. ఏకంగా రెండు లక్షల రూపాయల విలువచేసే డ్రింక్స్‌ ఆర్డర్‌ చేసింది. చక్కగా ఎంజాయ్‌ చేసింది. కానీ.. వెయిటర్‌ బిల్లు తీసుకు వచ్చినప్పుడు చుక్కలు కనిపించాయి. ఎందుకంటే.. ఆమె తాగిన రెండు డ్రింక్స్‌ విలువ ఏకంగా రెండు లక్షలు. దీంతో శివాలెత్తిన భర్త.. ఆమెను బార్‌లోనే వదిలేసి వెళ్లిపోయాడు. మరి బిల్లెవరు కట్టాలి? నిజానికి లిన్సే అనే మహిళ ఆర్డర్‌ చేసిన కాక్‌టైల్‌ డ్రింక్‌ ఖరీదు.. 1,890 పౌండ్లు. భారతీయ కరెన్సీలో సుమారు రెండు లక్షల రూపాయలు. కానీ.. ఆమె 18.90 పౌండ్లే అనుకున్నది. అంటే.. భారతీయ కరెన్సీలో సుమారు రెండు వేల రూపాయలు. అంత ఈజీగా ఎలా పొరబడింది? ఈ విషయాన్ని ఒక వీడియోలో లిన్సే స్వయంగా వివరించింది.


నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఒక బార్‌కు భార్యాభర్తలు వెళ్లారు. తాను మెనూ సరిగ్గా చూడలేదని, ఒక కాక్‌టైల్‌ నచ్చగానే అది ఆర్డర్‌ చేశానని, కానీ.. తీరా డ్రింక్స్‌ తాగిన తర్వాత ఇచ్చిన బిల్లులో దాని ఖరీదు 1,890 పౌండ్లుగా చూపారు. దీంతో బిత్తరబోయిన లిన్సే.. దానిని తన భర్తకు ఇచ్చింది. బిల్లు చూసి గుభేల్మనడంతో ఆమె భర్త ఆమెపై ఇంతెత్తున ఎగిరాడు. డై యువర్‌ ఓన్‌ డెత్‌.. అంటూ ఆమెను అక్కడే బార్‌లో వదిలేసి వెళ్లిపోయాడు. ‘బాబ్బాబు.. ప్లీజ్‌.. సారీ.. మెనూలో 18 90 అని అంకెల మధ్య స్పేస్‌ ఉండటంతో అది 18.90 పౌండ్లు అనుకున్నా’ అంటూ వెయిటర్‌తో మొరపెట్టుకుంది. మిగిలిన ఐటమ్స్‌కు కొన్నింటికి మధ్యలో డాట్‌ ఉన్నది. కానీ.. దీనికి లేదు. ఇది తన తప్పేనని, రెండు డ్రింక్స్‌ కోసం అంత పెద్ద మొత్తం చెల్లించలేనంటూ బిక్కమొహం వేసింది.


దీంతో మేనేజర్‌ రంగంలోకి దిగాడు. ఈ సమస్యను తాను పరిష్కరిస్తానని, మీరు వెళ్లి నూతన సంవత్సర వేడుకల ట్రిప్‌ను ఎంజాయ్‌ చేయండని సూచించాడు. కానీ.. నెత్తి మీద అంత భారీ బిల్లు ఉంటే.. ఇంక ఎంజాయ్‌మెంట్‌ ఏముంటుంది? అలా బాధపడుతూనే నాలుగు రోజులు గడిపేసింది. ఆ నాలుగు రోజుల్లో ఒక్కసారి కూడా బార్‌ ముఖం చూడటానికి భయపడింది. చివరికి బార్‌కు వెళ్లినప్పుడు ఆమెకు అనుకోని రీతిలో స్వాగతం ఎదురైంది. కానీ.. ఇక్కడ మెలిక ఆమెను మళ్లీ ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఈ ఘటన తర్వాత వెయిటర్‌ను పనిలోంచి పీకేశామని మేనేజర్‌ చెప్పడంతో ఆమె విస్తుబోయింది. ఒక్కసారిగా భోరుమన్నది. తన వల్ల వేరొకరు ఇబ్బంది పడకూడదని.. అది అతని పొరపాటు కాదని చెబుతూ బిల్లు మొత్తం చెల్లించేందుకు సిద్ధపడింది.


అయితే.. నవ్వేసిన మేనేజర్‌.. తాను జోక్‌ చేశానని, వాస్తవానికి అతనిని జాబ్‌ నుంచి తొలగించలేదని తెలిపాడు. తమ బార్‌లో మొట్టమొదటిసారి ఇటువంటి ఘటన జరిగిందని, తాము తీసుకున్న డ్రింక్‌ విలువ ఎంతో ముందుగా ఆర్డర్‌ ఇచ్చినవారికి చెప్పాల్సని బాధ్యత ఉన్నదని చెబుతూ.. అతడిని మళ్లీ శిక్షణ నిమిత్తం పంపామని అసలు విషయం చెప్పాడు. దీంతో ఆమె ఊపిరి పీల్చుకున్నది. ఇకపై పాయింట్‌ విషయంలో ఆమె చాలా కరెక్ట్‌గా ఉండటం ఖాయం! కాదా?