ఇంప్లాంట్స్‌కు విద్యుత్‌ను అందించేందుకు శ‌రీరంలోనే చిప్‌.. శాస్త్రవేత్త‌ల ఆవిష్క‌ర‌ణ‌

ఇంప్లాంట్స్‌కు విద్యుత్‌ను అందించేందుకు శ‌రీరంలోనే చిప్‌.. శాస్త్రవేత్త‌ల ఆవిష్క‌ర‌ణ‌

ఏదైనా అవ‌యవం చెడిపోయిన‌ప్పుడు.. శ‌స్త్రచికిత్స ద్వారా చిన్న చిన్న సెన్స‌ర్‌లు, ఇంప్లాట్‌ (Implants) లను రోగి శ‌రీరంలో పెట్టి ప్రాణాలు ద‌క్కేలా చేస్తారు. ఆ సెన్స‌ర్‌లు ప‌నిచేయ‌డానికి విద్యుత్ అవ‌స‌రం కావ‌డంతో బ్యాట‌రీలను కూడా శ‌రీరంలో పెట్టాల్సి వ‌స్తోంది. లేదా బ‌య‌టి నుంచి ఇవ్వాల్సి వ‌స్తోంది. ఈ ప‌ద్ధ‌తుల్లో ఎక్కువ ప్ర‌దేశాన్ని ఆక్ర‌మించ‌డ‌మే కాకుండా ఇన్ఫెక్ష‌న్‌ల‌కూ కార‌ణ‌మ‌వుతున్నాయి. దీనికి ప్ర‌త్యామ్నాయంగా శాస్త్రవేత్త‌లు వైర్‌లెస్ ఛార్జింగ్ (Wireless Charging Chip) ప‌రిక‌రాన్ని క‌నిపెట్టారు.

దీనిని చ‌ర్మం కింద పెడితే చాలు దానిక‌దే విద్యుత్‌ను ఉత్ప‌త్తి చేసుకుని మ‌న శ‌రీరంలో అమ‌ర్చిన ఇంప్లాంట్స్‌కు అందిస్తుంది. వీటిని ఇప్ప‌టికే రూపొందించిన శాస్త్రవేత్త‌లు.. ఆ చిప్‌ల‌ను ఎల‌క‌ల‌కు అమ‌ర్చి అధ్య‌య‌నం కూడా చేశారు. ఆ వివ‌రాలు సైన్స్ అడ్వాన్సెస్‌ జ‌ర్న‌ల్లో ప్ర‌చురిత‌మ‌య్యాయి. అందులోని వివ‌రాల ప్ర‌కారం..ఈ చిప్‌లు బయోడీగ్రేడ‌బుల్ అని అవి మ‌నం పెట్టిన చోట సంబంధిత అవ‌యంలో క‌లిసిపోతాయ‌ని ప‌రిశోధ‌కులు పేర్కొన్నారు. ఈ చిప్‌లు ఎలా ప‌నిచేస్తాయ‌నేదానిపై అధ్య‌య‌న‌క‌ర్త, చైనాలోని లాంజావ్ యూనివ‌ర్సిటీ సంబంధిత ఎల‌క్ట్రానిక్స్ ఇన్ ద స్కూల్ ఆఫ్ ఫిజిక‌ల్ సైన్స్‌, టెక్నాల‌జీలో ప్రొఫెస‌ర్ వీ లాన్ వివ‌రించారు. సాధార‌ణంగా ఇప్పుడు వాడుతున్న బ్యాట‌రీలు విద్యుత్‌ను ర‌సాయ‌న శ‌క్తి రూపంలో నిల్వ చేసుకుంటాయ‌ని.. కానీ తాము రూపొందించిన చిప్ కెపాసిట‌న్స్ అనే నియమం ఆధారంగా ప‌ని చేస్తుంద‌ని పేర్కొన్నారు. ఇందులో విద్యుత్ అదే రూపంలో నిల్వ అవుతుంద‌ని తెలిపారు. బ్యాట‌రీల‌తో పోలిస్తే కూడా ఎక్కువ‌, నాణ్య‌మైన విద్యుత్‌ను డిశ్చార్జ్ చేయ‌గ‌ల‌వ‌న్నారు. ఈ చిప్‌ను ఎల‌క‌ల్లో పెట్టి చూశాం.

మేము పెట్టిన చిప్ 10 రోజుల పాటు ఎల‌క‌లో ఉన్న ఇంప్లాంట్‌కు విద్యుత్ స‌ర‌ఫరా చేసింది. రెండు నెలల్లో ఆ శ‌రీరంలో అంత‌ర్భాగంగా మారిపోయింది అని వీ లాన్ వెల్ల‌డించారు. ఇప్పుడున్న చిప్‌ల‌కే పాలీమ‌ర్‌, వ్యాక్స్ పొర‌ల‌ను అద‌నంగా చేరిస్తే చిప్‌లను మ‌రింత మ‌న్నిక‌గా రూపొందించొచ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. మ‌నుషుల‌పై చిప్ ప్రొటోటైప్‌ను ప‌రీక్షించ‌డానికి అనుమ‌తులు రావాల్సి ఉంద‌ని.. త్వ‌ర‌లోనే ప్ర‌యోగాలు మొద‌లుపెడ‌తామ‌ని తెలిపారు.