Warangal Politics | కలహమేదైనా కడియమే సూత్రధారి! సురేఖ మంత్రి పదవికి ఎసరు?

కొండా సురేఖ మంత్రి పదవిపై కడియం శ్రీహరి కన్నేశారంటూ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య చేసిన ఆరోపణలు ఇప్పుడు వరంగల్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.

Warangal Politics | కలహమేదైనా కడియమే సూత్రధారి! సురేఖ మంత్రి పదవికి ఎసరు?
  • బీఆర్ఎస్ నేత రాజయ్య సంచలన ఆరోపణ
  • టీడీపీ పాత కాపులంతా కలిసి కుట్ర
  • గతంలో కడియం నల్లికుట్లోడన్న సురేఖ
  • రెడ్డివర్గం నేతల కుట్రన్న సురేఖ కుమార్తె
  • కడియాన్ని టార్గెట్ చేసిన నాయకులు

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

Warangal Politics | కలహమేదైనా…అది స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరియే సూత్రధారి అంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ రాజకీయ పరిణామం, పంచాయితీ జరిగినా దానికి కడియం శ్రీహరే కీలక భాగస్వామి అంటూ ఆరోపిస్తున్నారు. సంఘటన ఏదైనా ఆయనకు అంటగట్టడం ఇటీవల సాధారణంగా మారింది. ప్రస్తుతం తానున్న కాంగ్రెస్ పార్టీ, గతంలో తాను పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కడియాన్ని టార్గెట్ చేస్తున్నారు. దీనికి పూర్వంలో తాను పనిచేసిన టీడీపీ బ్యాక్ గ్రౌండ్ ను, ఆ నాయకుల రెడ్డి సామాజిక వర్గాన్ని తేవనెత్తుతున్నారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి సురేఖ ఈ ఆరోపణ చేయగా, మొన్న అమె కుమార్తె ఇదే ఆరోపణ చేశారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ నేత రాజయ్య కూడా ఆరోపించడం, బీసీ మంత్రులకు అన్యాయం జరిగితే సహించమంటూ ఈటల వ్యాఖ్యానించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజకీయ వర్గాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది.

సంఘటన ఏదైనా కడియానికి కలర్

ఎక్కడ ఏ సంఘటన, రాజకీయ పరిణామం జరిగినా దానికి కడియం శ్రీహరిని బాధ్యులుగా చేయడం రివాజుగా మారిందని అంటున్నారు. ఇక తన జీవితకాల ప్రత్యర్ధిగా భావించే కడియం పై రాజయ్య తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంగా కడియం పార్టీ మారిన తర్వాత రాజయ్య ఈ దాడిని మరింత తీవ్రం చేశారు. ఫిరాయింపుల పర్వం పై సుప్రీం కోర్టు ఆదేశాల తర్వాత ఉప ఎన్నికలొస్తాయనే ఆశ రాజయ్యలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈ కారణంగా రాజయ్య కడియాన్ని లక్ష్యంగా ఎంచుకున్నారని భావిస్తున్నారు.

కడియం సూత్రధారి?

దక్కన్ సిమెంట్ యాజమాన్యాన్ని బెదిరించిన కేసులో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తాజా మాజీ ఓఎస్టీ సుమంత్ కేంద్రంగా తీవ్ర వివాదం రేగిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో సీఎం రేవంత్ సహా సురేఖను టార్గెట్ చేసిన వారిలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, మేయర్ పాత్ర ఉందంటూ సురేఖ కుమార్తె సుస్మిత ఆరోపించడం సంచలనం సృష్టించింది. తాజాగా ఈ కుట్రకు కడియం సూత్రధారి అంటూ బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు రాజయ్య ఆరోపణలు హాట్ హాట్ గా మారాయి.

సురేఖ మంత్రి పదవికి ఎసరు?

మంత్రి కొండా సురేఖ పదవిని లాక్కొనేందుకు కడియం శ్రీహరి కుట్రచేస్తున్నారని తాటికొండ రాజయ్య తాజాగా విమర్శించి సంచలనానికి తెరతీశారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారితో జతకట్టి ఈ కుట్రలు చేస్తున్నారంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి, మంత్రి పొంగులేటితో కలిసి సురేఖ మంత్రి పదవికి ఎసరు తెస్తున్నారని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ లో కూడా ఇలాంటి గ్రూపు రాజకీయాలు చేశాడని విమర్శించారు. రెడ్డివర్గం నాయకులు కుట్రలు చేస్తున్నారని రాజయ్య ఆరోపించారు. ఇప్పటికే ఇదే అంశాన్ని సురేఖ కుమార్తె సుస్మిత లేవనెత్తారు. ఇప్పుడు దీనికి రాజయ్య తోడుకావడం గమనార్హం. ఇదిలా ఉండగా కేబినేట్లో బీసీ మంత్రులుగా ఉన్న పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలిద్దరూ ఇటీవల వివాదాల్లో చిక్కుకున్నారు. దీనిపై బీజేపీ నేత, ఎంపీ ఈటల స్పందిస్తూ బీసీ మంత్రులను తొలగిస్తే సహించేది లేదంటూ ఆయన కూడా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

కడియం నల్లికుట్లోడన్న సురేఖ

రాజయ్య ఆరోపణలకు ముందు కొద్ది రోజుల క్రితం మంత్రి కొండా సురేఖ సైతం కడియం శ్రీహరి నల్లికుట్లోడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మంత్రిగా ఉంటే కడియం భరించలేక పోతున్నారని అన్నారు. తన ముందు కూర్చోవడానికి కడియం నామోషీగా భావిస్తున్నారని, అందుకే ఉన్నవి లేనివి కల్పించి చెబుతూ పొంగులేటిని రెచ్చగొడుతున్నారని అన్నారు. టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల్లో చక్రం తిప్పినట్లు కాంగ్రెస్ లోనూ చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారని, ఈ పార్టీలో ఆ పప్పులుడకవని అన్నారు. అదృష్టం కొద్దీ తాను మంత్రినయ్యానని, గతంలో ఆయనను అదృష్టం వరించిందని అన్నారు. కడియం కుమార్తె కావ్య ఎంపీ అయ్యారని గుర్తు చేస్తూ కడియంపై అప్పట్లో సురేఖ చేసిన విమర్శలు కాంగ్రెస్ లో కలకలం సృష్టించాయి. ఇప్పుడు రాజయ్య వ్యాఖ్యలు జతగూడాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, మరొకరు అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన కడియం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన చేరినప్పటి నుంచి కాంగ్రెస్ లో కలహాలకు కారణమవుతున్నారని కొండా సురేఖ గతంలో ఆరోపించారు. కడియానికి నైతికత లేదని దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరాలంటూ సురేఖ భర్త మురళి బహిరంగంగా విమర్శించారు. వ్యక్తిగతంగా హేళన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భద్రకాళి దేవస్థానంలో బోనాలు ప్రారంభించాలనే అంశం పై స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో గొడవ ప్రారంభమైంది. ఆ తర్వాత పరస్పర విమర్శల నేపథ్యంలో వివాదం తీవ్రమైంది. తాజాగా తన ప్రైవేటు ఓఎస్డీ సుమంత్ వ్యవహారంతో సురేఖ మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సురేఖ కుమార్తె సుస్మిత కూడా రెడ్డి సామాజిక వర్గం నాయకులతో పాటు కడియం శ్రీహరిని టార్గెట్ చేయడం గమనార్హం.

టీడీపీ బ్యాక్ గ్రౌండ్ నేతలు?

టీడీపీ ముఖ్య నేతగా ఉన్న రేవంత్ రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న సీతక్క, వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీతక్క మంత్రికాగా, వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా రేవంత్ సన్నిహితునిగా గుర్తింపు పొందారు. బీఆర్ఎస్ నేతగా ఉన్న పొంగులేటి కాంగ్రెస్ లో చేరి ఇప్పుడు జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవూరి ప్రకాశ్ రెడ్డి పరకాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు కడియం సైతం కాంగ్రెస్ తీర్ధంపుచ్చుకున్నారు. ఇందులో సీతక్క మినహా అందరితో సురేఖకు విభేదాలు నెలకొన్నాయి. చివరికి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయిని రాజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పాత కాపు బస్వరాజుతో కూడా వివాదాలున్నాయి. సీతక్క, కడియం, బస్వరాజు మినహా మిగిలిన వారంతా రెడ్డి సామాజిక వర్గం కావడం గమనార్హం.