Disadvantages with Data centers | డాటా సెంటర్లతో ఇంత వినాశమా? ఐర్లాండ్, చిలీ అనుభవాలేంటి?
విశాఖపట్టణానికి గూగుల్ డాటా సెంటర్ తీసుకువచ్చామని ఏపీ కూటమి ప్రభుత్వం భుజాలు చరుచుకుంటున్నా.. నిజానికి విశాఖపట్నానికి.. ఆ మాటకొస్తే యావత్ ఆంధ్రప్రదేశ్‌కు అదొక గుదిబండగా మారిపోతుందని ప్రపంచ దేశాల అనుభవాలు తేల్చి చెబుతున్నాయి. ఐర్లాండ్, చిలీ, దక్షిణాఫ్రికా, మెక్సికో తదితర అనేక దేశాలు ఏఐ ఆలింగనానికి అంగీకరించి.. ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాయి.

Disadvantages with Data centers | డాటా సెంటర్! అసలేంటిది? డిజిటల్ సమాచారాన్ని పెద్ద ఎత్తున నిల్వ చేయడానికి, ఆ సమాచారాన్ని ప్రాసెస్ చేసి, పంపిణీ చేయడానికి ఉపయోగించే సాంకేతిక కేంద్రమే డాటా సెంటర్! ఇంటర్నెట్ సర్వీసెస్, సోషల్ మీడియా, క్లౌడ్ కంప్యూటింగ్, బ్యాంకింగ్ వంటి అనేక రంగాలకు ఇవి అత్యంత కీలకం. అదే సమయంలో పర్యావరణ పరంగా ఇవి సృష్టించే విధ్వంసం కూడా సామాన్యమైనదేమీకాదు. గూగుల్, ఓపెన్‌ఏఐ, అమెజాన్, మైక్రోసాఫ్ట్ తదితర కంపెనీలు కృత్రిమ మేధస్సును అభివృద్ధి చేసే పేరుతో వందల బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ క్రమంలో నిర్మాణ కష్టాలను ఇతర దేశాలపై యథేచ్ఛగా మోపుతున్నాయి.
డాటా సెంటర్లు పెరిగిన కొద్దీ ఆయా ప్రాంతాలకు పెద్ద మొత్తంలో విద్యుత్తు అవసరం ఉంటుంది. అదే సమయంలో కంప్యూటర్లను చల్లగా ఉంచేందుకు నీటిని కూడా అధికమొత్తంలో వినియోగించాల్సి ఉంటుంది. ఈ ప్రయాస ఒక్క మెక్సికోలో మాత్రమే కాదు.. పది పన్నెండు ఇతర దేశాలను సైతం తీవ్ర ఇబ్బందుల పాలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంటున్నది.
ఐర్లాండ్‌లో డాటా సెంటర్లు దేశం మొత్తంలో ఉత్పత్తయ్యే విద్యుచ్ఛక్తిలో 20 శాతాన్ని వినియోగిస్తున్నాయి. చిలీలో పెద్ద మొత్తంలో సముద్ర జీవజాలం అంతరించిపోయే ముప్పు బారిన పడింది. దక్షిణాఫ్రికాలో సహజంగానే దీర్ఘకాలంగా కరెంటు కోతలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిలో డాటా సెంటర్లు గ్రిడ్ నుంచి కరెంటును యథేచ్ఛగా గుంజేస్తున్నాయి. బ్రెజిల్, బ్రిటన్, భారత్, మలేషియా, నెదర్లాండ్స్, సింగపూర్, స్పెయిన్ వంటి దేశాల్లో కూడా పరిస్థితి దాదాపు ఇదేలా ఉంది.
ఈ సంక్షోభానికి పాదర్శకత లోపించడమే ప్రధాన కారణమన్న అభిప్రాయాలు ఉన్నాయి. తమ డాటా సెంటర్లు నిర్మించడానికి గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు సబ్సిడరీలు, సర్వీస్ ప్రొవైడర్లను ఎంచుకుంటాయి. ఈ క్రమంలో తమ సొంత ఉనికిని కాపాడుకుంటాయి. డాటా సెంటర్ సౌకర్యాలకు వినియోగించే వనరుల గురించి చాలా తక్కువగా మాత్రమే బయటకు తెలిసేలా జాగ్రత్త పడతాయి. మెక్సికోలో డాటా సెంటర్ కారణంగా తలెత్తిన విద్యుత్, నీటి సంక్షోభం గురించి తమకు తెలియదని గూగుల్ చెబుతున్నది. అక్కడ విద్యుత్తు స్థిరంగా లేదని పేర్కొంటున్నది. తాము 12.6 మెగవాట్ల విద్యుత్తు లోడును, కనీస స్థాయిలోనే నీటిని వినియోగిస్తున్నామని చెబుతున్నది. అంటే.. మెక్సిలోని సుమారు 50వేల గృహాలకు ఏడాది పొడవునా అందించే విద్యుత్తుతో డాటా సెంటర్ వాడిన విద్యుత్తు సమానం.
అయితే.. స్థానికంగా ఏర్పడే నీటి లేదా విద్యుత్తు సంక్షోభానికి డాటా సెంటర్‌లను నేరుగా లింకు చేయలేమని నిపుణులు అంటున్నారు. కానీ.. విద్యుత్తు, నీటి వనరులు తక్కువగా ఉన్న చోట డాటా సెంటర్లు నిర్మించడం అప్పటికే అక్కడ ఉన్న పరిస్థితిని మరింత ఒత్తిడిలోకి నెడుతుందని అంటున్నారు. దాని వల్ల దీర్ఘకాలిక నష్టాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
డాటా సెంటర్లతో కలిగే నష్టాలపై ఒక దేశం తర్వాత మరో దేశం, పర్యావరణ కార్యకర్తలు, స్థానికులు, స్వచ్ఛద సంస్థల కార్యకర్తలు ఆందోళనలకు దిగుతున్నారు. కొన్ని చోట్ల ఇటువంటి ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నాలు కూడా సాగాయి. కొన్ని డాటా సెంటర్ల యాజమాన్యాలు పారదర్శకతను పాటించేలా కూడా ఈ నిరసన కార్యక్రమాలు ఉపయోగపడ్డాయి. ఐర్లాండ్‌లో అధికారులు కొత్త డాటా సెంటర్లను డబ్లిన్ నగరానికి పరిమితం చేశారు. విద్యుత్తు సరఫరాలో ఇతర ఇబ్బందులు తలెత్తకుండా ఈ చర్య తీసుకున్నారు. చిలీలో కార్యకర్తలు ఆందోళన నేపథ్యంలో కొత్త డాటా సెంటర్ నిర్మాణ ప్రతిపాదనలను గూగుల్ ఉపసంహరించుకున్నది. నెదర్లాండ్స్‌లో పర్యావరణ ఆందోళనలతో కొన్ని డాటా సెంటర్ల నిర్మాణాలను నిలిపివేశారు.
‘పర్యావరణ, సామాజిక అంశాలను డాటా సెంటర్లు అధిగమించాల్సి ఉన్నది’అని ఫ్రెండ్స్ ఆఫ్ ఎర్త్ ఐర్లాండ్‌కు చెందిన పర్యావరణవేత్త రోసీ లియోనార్డ్ చెప్పారు. డాటా సెంటర్లు చాలా అవసరమని, అవి మనల్ని ధనవంతులను చేస్తాయనే అపోహ ఉన్నది. కానీ.. అవి నిజమైన సంక్షోభాలను సృష్టిస్తాయి’ అని ఆమె స్పష్టం చేశారు. పశ్చిమ ఐర్లాండ్‌లోని ఎన్నీస్ పట్టణంలో గుర్రాలు విహరించే సుమారు 150 ఎకరాల భూములలో నాలుగు వందల కోట్ల యూరోలతో డాటా సెంటర్‌ను నిర్మించేందుకు ఒక సంస్థ ఐదేళ్ల క్రితం ప్రయత్నించగా.. స్థానికులు కోర్టుల్లో కేసులు వేశారు. దానిని నిరోధించాలని విన్నవించారు.
ఈ ఏడాది జూన్ నాటికి ఏర్పాటు చేసే 1244 అతిపెద్ద డాటా సెంటర్లలో సుమారు 60 శాతం అమెరికా వెలుపలే ఉండనున్నాయని ఈ రంగాన్ని అధ్యయనం చేసిన సినర్జీ రిసెర్చ్ గ్రూప్ విశ్లేషణ పేర్కొంటున్నది. ఇవే కాదు.. రానున్న రోజుల్లో టెన్సెంట్, మెటా, అలీబాబా వంటి కంపెనీలు మరో 575 డాటా సెంటర్ ప్రాజెక్టులు వివిధ దేశాల్లో నెలకొల్పనున్నాయి.