Jubilee Hills Bye Poll | జూబ్లీహిల్స్ ఉపఎన్నిక : నామినేషన్ల పరిశీలన పూర్తి..బరిలో ఎంతమంది ఉన్నారంటే!
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ బుధవారం ముగిసింది. 69 మందికి చెందిన 131 నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఇందులో 30 మంది అభ్యర్థులకు సంబంధించిన 59 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అలాగే, 39 మంది దాఖలు చేసిన 72 నామినేషన్లను నిబంధనల మేరకు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.

విధాత, హైదరాబాద్ :
Jubilee Hills Bye Poll | జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ బుధవారం ముగిసింది. 69 మందికి చెందిన 131 నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఇందులో 30 మంది అభ్యర్థులకు సంబంధించిన 59 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అలాగే, 39 మంది దాఖలు చేసిన 72 నామినేషన్లను నిబంధనల మేరకు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ మంగళవారం అర్థరాత్రి వరకు కొనసాగగా మొత్తం 321 నామినేషన్లు దాఖలయిన విషయం తెలిసిందే. అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో అధికారులు బుధవారం పరిశీలన ప్రక్రియను పూర్తి చేశారు. కాగా, 24వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నారు. 14వ తేదీన కౌంటింగ్ జరగనుండగా.. అదే రోజు ఎన్నికల ఫలితం వెలువడనుంది.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమయింది. ఈ క్రమంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు జూబ్లీహిల్స్ స్థానాన్ని దక్కించుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. ఆయా పార్టీలు తమ తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. ప్రధాన అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీలో ఉండగా.. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునిత బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అలాగే, లంకల దీపక్ రెడ్డిని బీజేపీ బరిలో నిలిపింది. దీంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రసవత్తరంగా మారింది. అయితే, అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, బీజేపీలు గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రచారంలో ఆయా పార్టీలు దూసుకుపోతూ.. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ విజయమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్నాయి.