Bihar Elections 2025 | బీహార్‌ ఎన్నికల బరిలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కజిన్‌.. పోటీ చేసే పార్టీ.. ఇంట్రెస్టింగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌!

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో దివ్య గౌతం పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. సీపీఐ ఎంఎల్‌ లిబరేషన్‌ తరఫున దిఘా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న ఈమె.. బాలీవుడ్‌ దివంగత హీరో సుశాంత్‌ రాజ్‌పుత్‌ కజిన్‌ కావడం విశేషం.

  • By: TAAZ |    national |    Published on : Oct 22, 2025 9:19 PM IST
Bihar Elections 2025 | బీహార్‌ ఎన్నికల బరిలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కజిన్‌.. పోటీ చేసే పార్టీ.. ఇంట్రెస్టింగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌!

Bihar Elections 2025 | బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచినవారిలో కొన్ని పేర్లు ప్రముఖంగా చర్చల్లో ఉంటున్నాయి. అలాంటివారిలో ఒకరు దివ్యా గౌతం. దివంగత సినీ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌కు కజిన్‌ అవుతారు. దివ్యను ‘కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్ట్‌ – లెనినిస్ట్‌) లిబరేషన్‌’ తన అభ్యర్థిగా బరిలో నిలిపింది. దిఘా నియోజకవర్గం నుంచి ఆమె బుధవారం తన నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. దివ్య రంగస్థల కళాకారిణి. వామపక్ష ఆలిండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (ఏఐఎస్‌ఏ) మాజీ నాయకురాలు కూడా. మహాఘట్‌ బంధన్‌లో సీపీఐ ఎంఎల్‌ లిబరేషన్‌ కూడా భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.

పాట్నా కాలేజీ నుంచి జర్నలిజం, మాస్‌ కమ్యూనికేషన్‌లో ఆమె బ్యాచిలర్‌ డిగ్రీ పొందారు. ఇదే విభాగంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కూడా పూర్తి చేశారు. గతంలో ఆమె పాట్నా విమెన్స్‌ కాలేజీలో దాదాపు మూడేళ్లపాటు ప్రొఫెసర్‌గా పనిచేశారు. బీహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలో ఉత్తీర్ణురాలై.. ప్రభుత్వ ఫుడ్‌ అండ్‌ కన్స్యూమర్‌ ప్రొటెక్షన్‌ విభాగంలో సప్లై ఇన్‌స్పెక్టర్‌గా కూడా విధులు నిర్వహించినట్టు తెలుస్తున్నది.

దివ్య తన కాలేజీ రోజుల నుంచే విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించేవారు. సీపీఐ ఎంఎల్‌ లిబరేషన్‌ విద్యార్థి విభాగం ఏఐఎస్‌ఏలో కీలక పాత్ర పోషించారు. 2012లో ఆమె పాట్నా యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏఐఎస్‌ఏ అభ్యర్థిగా అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆమె జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌) క్వాలిఫైడ్‌ పీహెచ్‌డీ స్కాలర్‌. మహాఘట్‌ బంధన్‌లో కీలక పార్టీలైన కాంగ్రెస్‌, ఆర్జేడీ మధ్య సీట్ల పంపకం ఇంకా కొలిక్కి రానప్పటికీ.. సీపీఐ ఎంఎల్‌ లిబరేషన్‌ వంటి చిన్న పార్టీలు కొన్ని నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను ప్రకటించాయి. రెండు దశల్లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి దశ పోలింగ్‌ నవంబర్‌ 6న, మలి దశ నవంబర్‌ 11న ఉంటుంది. ఫలితాలను నవంబర్‌ 14న వెల్లడిస్తారు.