50 ఏండ్ల పీడీఎస్‌యూకు విప్లవ జేజేలు

రెండు PDSU సంస్థల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కార్యవర్గాలు ఐక్యంగా అక్టోబర్ 24 ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో ఈ సభను నిర్వహిస్తున్నాయి. దీనిని జయప్రదం చేయవలసిందిగా PDSU పూర్వ విద్యార్థులను, ప్రజాస్వామిక వాదులను, మేధావులను, అన్ని వర్గాల ప్రజలకు విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాము.

50 ఏండ్ల పీడీఎస్‌యూకు విప్లవ జేజేలు

శాస్త్రీయ విద్యా, కామన్ విద్యా విధానం,సమసమాజం, నూతన ప్రజాస్వామిక విప్లవం లాంటి ఉన్నతమైన ఆశయాలతో ఏర్పడిన సంస్థ PDSU. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఏర్పడి అక్టోబర్ 12, 2024 నాటికి 50 ఏళ్ళు నిండుతుంది. ఈ 50 ఏళ్ల విప్లవ ప్రస్థానంలో PDSU విద్యార్థుల పక్షాన బాధ్యతగా కొట్లాడుతూనే విద్యా ప్రవేటీకరణ, కార్పొరేటీకరణ కు వ్యతిరేకంగా పోరాడింది. సాంప్రదాయ, సంస్కరణవాద విద్యార్థి సంఘాలను తుత్తినీయలు చేస్తూ విద్యార్థులందరికీ విప్లవ చైతన్యాన్ని అందించింది, వారందరినీ ఉద్యమాల బాట పట్టించింది. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఇచ్చిన స్ఫూర్తితో విద్యార్థులు తమ హక్కుల సాధన కోసం సమస్యల పరిష్కారం కోసం నిత్యం సమరశీల పోరాటాలు నిర్వహిస్తూనే సమాజ మార్పు కోసం సాగే ఉద్యమాలు భాగస్వామ్యం అవుతున్నారు.
PDSU కేవలం విద్యారంగ సమస్యల పరిష్కార సాధనకి మాత్రమే పరిమితం కాలేదు. ఆరంభం నుండి నేటి వరకు అనేక పౌర, ప్రజాస్వామిక ఉద్యమాల్లో పాల్గొంటుంది. తెలుగు నాట సాగిన భూమి,బుక్తి,విముక్తి కోసం సాగిన శ్రీకాకుళం, గోదావరిలోయ పోరాటాలకు తన క్రియాశీలక మద్దతునిచ్చింది. అంతేకాదు 1974లో ప్రతిష్టాత్మక రైల్వే కార్మికుల సమ్మెకు మద్దతిచ్చింది. అధిక ధరలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొన్నది.రమేజాభి ఘటనకి వ్యతిరేకంగా కొట్లాడింది. దివిసీమ ఉప్పెనలో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులై, ప్రాణాలను కోల్పోతే వారికి అండగా నిలిచి గుండె ధైర్యాన్ని ఇచ్చింది. రైతాంగ ఉద్యమ నాయకులు భూమయ్య, కిష్టాగౌడ్ ల ఉరిశిక్షకు వ్యతిరేకంగా పోరాడింది.క్యాపిటేషన్,అధిక డొనేషన్లు, ఫీజులకు వ్యతిరేకంగా పోరాడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బిగిపిడికి ఎత్తింది. ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రతిఘటిస్తుంది. ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటాలు చేస్తుంది. అంతేకాదు ప్రతి సంవత్సరం వేసవిలో విద్యార్థులారా “గ్రామాలకు తరలండి” అనే కార్యక్రమంతో ప్రజల జీవన విధానాన్ని, వారు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంది. సామాజిక, సాంస్కృతిక,ఆర్థిక అంతరాలు లేని సమాజం కోసం పోరాడాలని ప్రజలను చైతన్యం చేస్తుంది. ఇలా PDSU అనేక సంచలనాలకు కేంద్రమైంది.

50 ఏళ్ల PDSU విప్లవ ప్రస్థానంలో అనేకమంది విద్యార్థి రత్నాలు బిగి పిడికిలి జండా కొరకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. కామ్రేడ్ జార్జి రెడ్డి మతోన్మాద విచ్చుకత్తులకు ఉస్మానియా యూనివర్సిటీలో నేల కోరిగాడు. కామ్రేడ్ జంపాల చంద్రశేఖర ప్రసాద్, శ్రీపాద శ్రీహరి ఎమర్జెన్సీ చీకట్లో నాటి నియంతృత్వ పాలకుల దోపిడీ తూటాలకు తమ ప్రాణాలను అర్పించారు. కోలా శంకర్, చేరాలు,రంగవల్లి, స్నేహలత, మారోజు వీరన్న, మధుసూదన్ రాజు యాదవ్, యానాల వీరారెడ్డి, రమణయ్య, సాంబన్నలు తమ విలువైన ప్రాణాలను ప్రగతిశీల విద్యార్థి ఉద్యమానికి ఇచ్చి ఈ సంస్థను సమున్నతంగా నిలబెట్టారు. రాజ్యం, దోపిడీ వర్గాలు ప్రయోగిస్తున్న అణచివేత నిర్బంధాలను ఎప్పటికప్పుడు తట్టుకుంటూ, కత్తుల వంతెన పై కవాతు చేస్తూ నిత్యం పాలకవర్గాలకు సవాలను విసురుతూనే ఉంది.

నేడు ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్య మేఘాలు కమ్ముకొస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ ను ఇంకా డాలర్ శాసిస్తుంది. గుత్త పెట్టుబడి భారతదేశ గ్రామాల్లో కూడా ప్రవేశించి ప్రజల జీవన విధానాన్ని అతలాకుతలం చేస్తుంది. దేశంలో రోజురోజుకు అన్ని రంగాల్లో అసమానతలు పెరిగిపోతున్నాయి. అనేక దేశాల్లో విద్యార్థులు, ప్రజలు విద్యా, వైద్యం, ఉపాధి అందించాలని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక లో విద్యార్థుల పోరాటానికి ప్రభుత్వాలే కూలిపోయాయి. ప్రపంచ దేశాల్లో నిరుద్యోగం,ఆర్థిక అసమానతలను పరిష్కరించలేని పెట్టుబడిదారీ దేశాలు యుద్ధాలకు తెగబడుతున్నాయి. ఇజ్రాయుల్ కు వ్యతిరేకంగా గాజా ప్రజలు చేస్తున్న ఆత్మగౌరవ జాతీయ పోరాటంలో లక్షలాదిమంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు. జాతి హననానికి గురవుతున్నారు. అమెరికా,బ్రిటన్, జపాన్ లాంటి అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల్లో కూడా విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున వస్తుంది. సామ్రాజ్యవాదం ఇంకా వెర్రి తలలు వేస్తూ గాజా, ఉక్రెయిన్ లాంటి దేశాలను కబలిస్తుంది.

భారతదేశంలో 3వసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాలను అమలు చేయడానికి పూనుకుంటుంది. పదేండ్ల పాలనలో బిజేపి కార్పొరేట్లకు ఊడిగం చేసింది. దేశ సహజ సంపదనంత అంబానీ, ఆదాని లాంటి కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టింది. దేశంలో రోజురోజుకు ఆకలి,నిరుద్యోగం, అసమానతలు పెరిగిపోతున్నాయి. ఆక్స్ ఫామ్ లాంటి సంస్థలు దేశంలో అసమానతలు పెరిగిపోతున్నాయని, ప్రజలు ఆందోళనలో ఉన్నారని రిపోర్ట్ ఇస్తున్నాయి. మోడీ ప్రభుత్వ హాయంలో నూతనంగా ఏ ఒక్క యూనివర్సిటీని గానీ, రీసెర్చ్ సెంటర్ ను గానీ ఏర్పాటు చేసింది లేదు. విద్యార్థులకు న్యాయంగా రావాల్సిన ఫెలోషిప్స్,స్కాలర్షిప్ లపై కోతలు విధించి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేసింది. నూతన జాతీయ విద్యా విధానం 2020 తో దేశ ఉన్నత విద్యారంగాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టింది. విద్యార్థుల మెదడులను మెదళ్లను కలుషితం చేసి వారిని ఆలోచించనివ్వకుండా చేస్తుంది. మహిళలపై అమ్మాయిలపై లైంగిక వేధింపులు దాడులు పెరుగుతున్నాయి. బిజెపి కి సంబంధించిన ప్రజాప్రతినిధులు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ వేదికలో పాల్గొని దేశం కోసం ఆడి బంగారు పతకాలు గెలిచిన వీనేష్ పొగట్ తదితర కుస్తీ ఆటగాళ్లు లైంగిక దాడి జరిగిందని దేశ రాజధానిలో ఆందోళన చేశారు. మహిళలపై లైంగిక వేధింపులు చేస్తున్న దొంగ బాబాలకు స్వామీజీలకు, బీజేపీ పార్టీ ప్రజాప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతుంది. సంవత్సర కాలం పాటు మహత్తరంగ సాగిన రైతు ఉద్యమం సందర్భంగా బిజెపి పార్టీ అనేక హామీలు ఇచ్చింది. ఇప్పుడు వాటిని అమలు చేయడం లేదు. కనీస మద్దతు ధర చట్టం చేయమని ఉద్యమిస్తున్న రైతులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది. బిజెపి కార్పొరేట్ అనుకూల విధానాలను ప్రశ్నించిన అనేకమంది మేధావులపై కేసులు పెట్టి జైలుకు పంపించింది మరి కొంతమందిని భౌతికంగా హతమార్చింది. అనేక మంది కవులు, కళాకారులు, ప్రొఫెసర్స్, లాయర్స్ పై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించింది.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చింది. ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేస్తామన్నది. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలను నియంత్రిస్తామన్నది. విద్యకు నిధులు పెంచుతామని హామీలు ఇచ్చింది. కానీ ఈ 10 నెలల కాలంలో ఆ వైపుగా అడుగులు పడలేదు. కనీసం విద్యాశాఖకు మంత్రిని కేటాయించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
నేడు విద్యార్థులు జాతీయ అంతర్జాతీయంగా స్థానికంగా వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై ఉక్కు పిడికిళ్ళు ఎత్తాలి. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్య ఉపాధి వైద్యం అవకాశాల కోసం పోరు సల్పాల్సిన అవసరం ఉంది.

PDSU 50 ఏళ్ల ప్రస్థానంలో అనేక పోరాటాలు నిర్వహించింది. ఎన్నో హక్కులను సాధించింది. ఉద్యమ నిర్మాణ క్రమంలో అనేకమంది పోరాట యోధులను కోల్పోయింది. PDSU పోరాట స్ఫూర్తిని వివరిస్తూ, అమరవీరుల స్ఫూర్తిని ఎత్తిపడుతూ రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 15 నుండి 23 వరకు పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు జరుగుతున్నాయి. పోరాట స్ఫూర్తితో ధ్వంసం అవుతున్న ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకొనుటకు, విద్యా కార్పొరేటీకరణ వ్యతిరేకంగా పోరాట జ్వాలలను రగిలించాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం 2020 ను ప్రతిఘటించాలి. అందరికీ సమానమైన శాస్త్రీయమైన విద్య కోసం, సమానమైన అవకాశాల కోసం సమరశీల పోరాటాలను నిర్వహించాలి. దీనికోసం కలిసి వచ్చే అన్ని విప్లవ విద్యార్థి సంఘాలను ఐక్యం చేసుకోవాలి. తద్వారా నూతన ప్రజాస్వామిక విప్లవ స్ఫూర్తితో విద్యార్థులంతా తమ సమాజం కోసం పోరు సల్పాలి. అందుకే రెండు PDSU సంస్థల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కార్యవర్గాలు ఐక్యంగా అక్టోబర్ 24 ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో ఈ సభను నిర్వహిస్తున్నాయి. దీనిని జయప్రదం చేయవలసిందిగా PDSU పూర్వ విద్యార్థులను, ప్రజాస్వామిక వాదులను, మేధావులను, అన్ని వర్గాల ప్రజలకు విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాము.

వ్యాసకర్త: P. మహేష్
PDSU రాష్ట్ర అధ్యక్షులు.
సెల్: 9700346942