Anil Ambani| ఈడీ విచారణకు హాజరైన అనిల్ అంబానీ

న్యూఢిల్లీ: బ్యాంకులను మోసగించి(Banking Fraud) మనీలాండరింగ్ (Money Laundering)కు పాల్పడిన కేసులో రిలయన్స్ గ్రూప్(Reliance Group) ఛైర్మన్ అనిల్ అంబానీ(Anil Ambani), మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఎదుట హాజరయ్యారు. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో అనిల్ అంబానీని రూ.17వేల కోట్ల రుణ మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఆయన వాంగ్మూలాన్ని ఈడీ నమోదు చేయనుంది.ఇదే కేసులో రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన పలువురు ఎగ్జిక్యూటివ్‌లకు కూడా సమన్లు జారీ అయ్యాయి. అమితాబ్ ఝున్‌ఝున్‌వాలా, సతీశ్ సేథ్ సహా గ్రూప్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు ఈడీ సమన్లు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇటీవల రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన 50 కంపెనీలకు చెందిన 35 ప్రాంతాల్లో, 25 మంది వ్యక్తులపై ఈడీ సోదాలు నిర్వహించిన అనంతరం.. అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసింది. సోదాలలో కీలక దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రిలయన్స్ ఇన్‌ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు రూ.17,000 కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇందులో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ రూ.5,901 కోట్లు, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ రూ.8,226 కోట్లు, రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు సంబంధించి రూ.4,105 కోట్ల రుణాలు ఉన్నాయి. ఇప్పటికే అనిల్ అంబానీ దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ సర్క్యులర్ (ఎల్‌ఓసీ)ను కూడా ఇచ్చింది. మరోవైపు బ్యాంకుల కూడా అనిల్ అంబానీని మోసాగాడిగా ప్రకటించాయి.