MLA`s Rammohan and yadaiah | అప్పా టూ మన్నెగూడ రోడ్డు పనులు ప్రారంభం

టీజీ పోలీసు అకాడెమీ (అప్పా) జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నిర్మించనున్న నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు.

MLA`s Rammohan and yadaiah | అప్పా టూ మన్నెగూడ రోడ్డు పనులు ప్రారంభం

హైదరాబాద్, విధాత

టీజీ పోలీసు అకాడెమీ (అప్పా) జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నిర్మించనున్న నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు. ఇవాళ చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో వారిద్దరూ మీడియాతో మాట్లాడుతూ, రూ.1,000 కోట్లతో ప్రభుత్వం మంజూరు చేసిన నాలుగు లెన్ల రోడ్డుపై చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు నడుస్తున్నదన్నారు. టీజీ పోలీసు అకాడెమీ (అప్పా) జంక్షన్ నుండి మన్నెగూడ వరకు విస్తరిస్తున్న రోడ్డు కు ఇరువైపులా ఉన్న చెట్లు తొలగిస్తున్నారని పర్యావరణ ప్రేమికులు కేసు వేశారన్నారు. ఈ కేసుపై చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారించి స్టే ఆర్డర్ ఎత్తివేశారన్నారు. నేషనల్ హైవే అథారిటీ వారు రోడ్డుకు ఇరువైపు గల 950 చెట్లను కాకుండా కేవలం 150 చెట్లను మాత్రమే తొలగించి వేరే ప్రాంతంలో నాటడానికి నిర్ణయించినట్టు తెలిపారన్నారు. ఇరువైపులా వాదనలు విన్న తరువాత రోడ్డు పనులను ప్రారంభించడానికి అనుమతి ఇచ్చిందన్నారు. ఈ తీర్పు విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే నేషనల్ హైవే అథారిటీ అధికారులతో మాట్లాడారన్నారు. రేవంత్ రెడ్డి ఆదేశంతో ఇవాళ రోడ్డు పనులు ప్రారంభించారన్నారు. ఇక నుంచి నిర్విరామంగా నాలుగు లేన్ల రోడ్డు పనులు కొనసాగుతాయని, సాధ్యమైనంత త్వరగా రోడ్డు పనులు పూర్తి చేసి ప్రమాదాలు జరగకుండా అరికడతామని వారు తెలిపారు. గత కొన్ని సంవత్సరాల నుండి జరుగుతున్న ప్రమాదాలతో సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయారని ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, యాదయ్య వివరించారు.