Flood politics on funds । మీవద్దే రూ.1345 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులు.. వాడుకోండని చేతులు దులుపుకొన్న కేంద్రం
వాస్తవంగా ప్రతి రాష్ట్రంలో ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఉంటాయి. ఈ విషయం రాష్ట్ర సీఎంకు తెలియనిది కాదు. ఈ నిధులు ఎన్డీఆర్ఎఫ్ చేపట్టే కార్యక్రమాలకే సరిపోవడం కష్టం.

Flood politics on funds । తెలంగాణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వరద రాజకీయం మొదలైంది. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చి ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు పడిన గండి.. ఆ నష్టాన్ని మరింత పెంచింది. దాదాపు రాష్ట్రంలో 5 వేల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు పర్యటించారు. పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాలు క్షేత్ర స్థాయిలోనే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను రాష్ట్రానికి తక్షణ సహాయం కింద రూ. 2 వేల కోట్లు విడుదల చేయాలని కోరారు.
రేవంత్ రెడ్డి అడిగిన ఆర్థిక సహాయం రాష్ట్రానికి చేయడానికి మనసు అంగీకరించని కేంద్రం, రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు దీనికి భిన్నంగా స్పందించారు. రాష్ట్రంలో మీ వద్ద రూ.1345 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఉన్నాయి.. వాటిని వాడుకోండంటూ ఉచిత సలహా పడేశారు. వాస్తవంగా ప్రతి రాష్ట్రంలో ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఉంటాయి. ఈ విషయం రాష్ట్ర సీఎంకు తెలియనిది కాదు. ఈ నిధులు ఎన్డీఆర్ఎఫ్ చేపట్టే కార్యక్రమాలకే సరిపోవడం కష్టం. అందుకే జరిగిన నష్టాన్ని కొంతలో కొంత పూడ్చుకోవడానికి అదనంగా రూ.2 వేల కోట్లు అడిగితే.. తాంబూలాలు ఇచ్చాం… తన్నుకు చావండన్న చందంగా మీ వద్దే డబ్బులున్నాయి… వాడుకొని సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పడమే విడ్డూరంగా ఉంది.
అదనంగా రూ. 2 వేల కోట్ల నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరగానే హడావిడిగా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణలో ఎస్డీఆర్ఎఫ్ నిధుల వినియోగం, మంజూరుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని చెప్పడం.. దీనికి సానుకూలంగా స్పందించిన అమిత్ షా మీవద్దే నిధులు ఉన్నాయి.. వాడుకోండని చెప్పారనడం విడ్డూరంగా ఉంది.
పైగా అమిత్ షా ఆదేశాలతో కేంద్ర హోంశాఖ (జాతీయ విపత్తుల విభాగం) డైరెక్టర్ ఆశిష్ గవాయ్ ఉత్తర్వులు జారీ చేశారని తెలుపడం గమనార్హం. అకౌంటెంట్ జనరల్ నివేదిక ప్రకారం రాష్ట్రం వద్ద రూ.1345 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులున్నట్లు కేంద్రం ఉత్తర్వుల్లో వెల్లడించింది. జాతీయ విపత్తుల నిధికి సంబంధించి కేంద్రం ఎప్పటికప్పుడు తన వాటాను విడుదల చేస్తోందని తెలిపింది. రాష్ట్రం వద్ద ఉన్న ఎస్డీఆర్ఎఫ్ నిధులను వాడుకోవాలని సూచించిన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నిధుల వినియోగంపై యుటిలైజేషన్ సర్టిఫికెట్ సమర్పించకపోవడంవల్ల ఈ ఏడాది జూన్‌లో రావాల్సిన రూ.208.40 కోట్లను విడుదల చేయలేదని తెలుపడం గమనార్హం. పైగా యుటిలైజేషన్ సర్టిఫికెట్ సమర్పించిన వెంటనే నిధులు విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించడం వింతల్లో కెల్ల వింత అని పరిశీలకులు అంటున్నారు.
వరదలు వచ్చి చస్తున్నాం బాబో అంటే.. ఆదుకోకుండా సర్టిఫికెట్ ఇవ్వలేదు. కాబట్టి నిధులు విడుదల చేయలేదని చెప్పడమే బీజేపీ మార్క్ రాజకీయమా? అని రాజకీయ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. పైగా కేంద్రం నుంచి వచ్చిన ఈ సమాధానంలో మన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సంకలు గుద్దుకొని ఆనందంలో పరవశమవుతున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.