‘Mayasabha’ Web Series| చంద్రబాబు..వైఎస్సార్ ‘మ‌య‌స‌భ‌’ వైరల్

‘Mayasabha’ Web Series| చంద్రబాబు..వైఎస్సార్ ‘మ‌య‌స‌భ‌’ వైరల్

స్నేహితులే రాజకీయ ప్రత్యర్ధులైన వాస్తవిక కథా నేపథ్యం

విధాత : తెలుగులో ఓ వెబ్ సిరీస్ టీజర్ వైరల్ గా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్.రాజశేఖర్ రెడ్డిల జీవితాల్లో జరిగిన అంశాల అధారంగా రూపొందించిన ‘మ‌య‌స‌భ‌’ వెబ్ సిరీస్(‘రైజ్ ఆఫ్ ది టైటాన్స్’ ట్యాగ్ లైన్) తెలుగు రాష్ట్రాలలో అలజడి రేపింది. వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. చంద్ర‌బాబు నాయుడు, వైఎస్ఆర్‌ల కళాశాల రోజుల్లో..యూత్ కాంగ్రెస్ లో ఉన్న స్నేహాన్ని..జీవితంలో ఎదుగాలన్న ఆలోచన..ప్రజాసేవ చేయాలన్న సంకల్పంతో ఆ ఇద్దరు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విధానం..రాజకీయ చదరంగంలో వారు ప్రత్యర్థులుగా మారిపోవడం వంటి అంశాలతో ఊహించని మలుపులు..భావోద్వేగ ఘటనలతో మయసభ వెబ్ సిరీస్ రూపుదిద్దుకుంది.

రాజకీయాల్లో పైచేయి సాధించే క్రమంలో ఇద్దరు మిత్రులు ప్రత్యర్థులుగా పరస్పరం వేసిన ఎత్తుకు పైఎత్తులతో కూడిన సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయంటున్నారు. టీజ‌ర్ చూస్తుంటే.. ఎన్టీఆర్‌ని ఎదిరించి ఎమ్మెల్యేలంద‌రినీ హోట‌ల్‌కి ర‌ప్పించుకున్న చంద్ర‌బాబు వైఎస్‌కి ఫోన్ చేసి నీ స‌హాయం కావాల‌ని కోర‌డం చూడ‌వ‌చ్చు. అయితే ఈ వెబ్ సిరీస్ లో చంద్రబాబు, వైఎస్సార్ సహా ఇతరుల పేర్లను మార్చేశారు. ఇందులో కాకర్ల కృష్ణమ నాయుడు పాత్రలో ఆది పినిశెట్టి, ఎం.ఎస్.రామిరెడ్డి పాత్రలో చైతన్య రావు, ఐరావతి బసు పాత్రలో దివ్య దత్తా నటించారు. ‘మయసభ’ వెబ్ సిరీస్ సోనీ లివ్‌లో ఆగస్ట్ 7 నుంచి తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. దీని ట్రైలర్ కు మంచి ఆదరణ లభిస్తుంది. టీజర్ లో ఒక‌వైపు చంద్ర‌బాబు, మ‌రోవైపు వైఎస్సార్‌.. ఇద్ద‌రికీ స‌రిప‌డా ఎలివేష‌న్లు ఇచ్చారు. డైలాగులు కొన్ని న‌ర్మ‌గ‌ర్భంగా ఉన్నా, చాలా వ‌ర‌కూ చెప్పాల్సిన విష‌యాన్ని సూటిగానే చెప్పేశారనిపిస్తుంది. మొత్తంగా చూస్తే.. ఈ సిరీస్ తెలుగు రాష్ట్రాలలో ఏదో సంచ‌ల‌నం సృష్టించేలానే వుందంటున్నారు విశ్లేషకులు.