container school । పాఠశాల భవన నిర్మాణానికి అనుమతి లేక కంటైనర్‌ స్కూలు

అటవీ ప్రాంతంలో పాఠశాల భవన నిర్మాణానికి అనుమతి లేకపోవడంతో కంటెయినర్‌ స్కూలు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని మంత్రి ధనసరి అనసూయ సీతక్క చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు అటవీ అనుమతులు ఇబ్బందిగా పరిణమించాయని తెలిపారు.

container school । పాఠశాల భవన నిర్మాణానికి అనుమతి లేక కంటైనర్‌ స్కూలు

container school । గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అట‌వీ శాఖ అనుమతులు అడ్డంకిగా మారుతున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. పెసా చ‌ట్టం జ‌రిగిన జాతీయ స‌ద‌స్సులో పాల్గొన్న అనంత‌రం ఢిల్లీ తెలంగాణ భ‌వ‌న్‌ వద్ద త‌న‌ను క‌లిసిన మీడియా ప్రతినిధుల‌తో మాట్లాడుతూ  గిరిజన ప్రాంతాల్లో కనీస వసతులు కల్పించడానికి సైతం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు.  ఈ మధ్య పాఠశాల భవనానికి అనుమతి లేకపోవడంతో కంటైనర్ పాఠశాలను ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు.   గనులు, భారీ ప్రాజెక్టులకు అనుమతులు వేగంగా మంజూరు అవుతున్నాయి కానీ, అడవి పుత్రులకు కనీస సదుపాయాలు కల్పించే విషయంలో మాత్రం అనుమతులు రావడం లేదని బాధ పడ్డారు.   కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాల ద్వారా నిధులు ఇస్తున్నప్పటికీ వాటిని వినియోగించలేని పరిస్థితి ఉందన్నారు.  ఇదే విషయాన్ని పెసా చట్టం పై ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో ప్రస్తావించానని తెలిపారు.  ఇతర రాష్ట్రాల మంత్రుల సైతం ఇలాగే సమస్యను ఎదుర్కొంటున్నామని చెప్పారన్నారు.  గ్రామ సభలకు అనుమతుల అధికారాన్ని కట్టబెట్టాలని మంత్రి సీతక్క డిమాండ్  చేశారు.  అనేక గిరిజన గ్రామాలకు నేటికీ సరైన రోడ్డు సదుపాయం, విద్యుత్తు సదుపాయం ఇతర మౌలిక వసతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.  అటవీ, పర్యావరణ అనుమతుల్లో ఆటంకాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతోందన్నారు.

అమృత్ పథకం కేంద్ర ప్రభుత్వానిదని, అందులో ఏమైనా తప్పిదాలు జరిగితే కేంద్రమే చర్యలు తీసుకుంటుందని సీతక్క  తెలిపారు.  సృజన్ రెడ్డిని రేవంత్ రెడ్డి బంధువుగా పేర్కొంటూ విమర్శలు చేస్తున్నారని, అదే సృజన్ రెడ్డితో మీ ఇంటి ఆడపడుచు లిక్కర్  వ్యాపారాలు చేసినట్టు, కుంభకోణంలో పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి కదా అని ప్రశ్నించారు.  ఆయన మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే అల్లుడే నని గుర్తు చేశారు.  ఇవన్నీ దాచిపెట్టి దురుద్దేశాలతో సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారన్నారు.   కావాలని ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కావాలని  ప్రభుత్వం పై విషం చిమ్ముతున్నారన్నారు.

హైడ్రా పేరుతో కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ హయాంలో చెరువులు విధ్వంసం అయ్యాయని, వాటిని పునరుద్ధరిస్తామని చెప్పారు… ఇప్పటివరకు ఎన్ని చెరువులను పునరుద్ధరించారు? అని ప్రశ్నించారు.  మీరు చేయని  ఆ పని మేము చేస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారు.  అనేక మంది 8 కోట్లు,3 కోట్లు విల్లాలు కొన్నామని అంటున్నారు.. నీళ్లు వచ్చాయి మునిగిపోయాయి అంటున్నారు… అలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.  పేద వాళ్ళకు న్యాయం చేస్తామని సిఎం చెప్పారని,  వారికి వేరే చోట డబుల్ బెడ్ రూమ్స్ ఇండ్లు కేటాయింపులు కూడా చేస్తున్నామన్నారు.