CP Sajjanar | ఏఐతో అవినీతి, నేరాలను నియంత్రించొచ్చు : సీపీ సజ్జనార్
అవినీతి అక్రమాలు, నేరాలను నియంత్రించే క్రమంలో విజిలెన్స్ శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తే పారదర్శకత, ఉత్పాదకత రెండూ గణనీయంగా పెరుగుతాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు.
విధాత, హైదరాబాద్ :
అవినీతి అక్రమాలు, నేరాలను నియంత్రించే క్రమంలో విజిలెన్స్ శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తే పారదర్శకత, ఉత్పాదకత రెండూ గణనీయంగా పెరుగుతాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్ లో శుక్రవారం నిర్వహించిన విజిలెన్స్ అవగాహన వారోత్సవాల ఐదో రోజు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశానికి సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ, “అవినీతి, అక్రమాలు తగ్గాలంటే వ్యవస్థల్లో మౌలిక మార్పులు అవసరం. లోపభూయిష్టమైన విధానాలు అక్రమాలకు దారితీస్తాయి. కాబట్టి వ్యవస్థను పటిష్టపరచి, మంచి అలవాట్లు, పద్ధతులను అమల్లోకి తేవాలి,” అని పేర్కొన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని తెలిపారు.
సింగరేణి సంస్థతో తనకు 25 సంవత్సరాల అనుబంధం ఉందని పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు. నేడు దేశ జీడీపీ పెరుగుదలలో ప్రభుత్వ రంగ సంస్థల పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరామ్ సారథ్యంలో పలు వ్యాపార విస్తరణ చర్యల ద్వారా గ్లోబల్ కంపెనీగా రూపుదిద్దుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ దిశగా మరింత వేగంగా ఎదగాలి అని ఆకాంక్షించారు. అలాగే, మార్పు స్వీకరించడంలో వెనుకబడ్డ అనేక కంపెనీలు మూతపడ్డాయని గుర్తుచేసి, సింగరేణి ఉద్యోగులు సవాళ్లను స్వీకరించి, తమ నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవాలని సూచించారు. విజిలెన్స్ విభాగం ఇతర సంస్థల్లో అమలు చేస్తున్న మంచి పద్ధతులను స్వీకరించడం ద్వారా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని సజ్జనార్ తెలిపారు.
అనంతరం సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ చేపడుతున్న వ్యాపార విస్తరణ చర్యలను వివరించారు. ఉద్యోగుల్లో క్రమశిక్షణ తీసుకురావడం కోసం, పని గంటల సద్వినియోగం కోసం ప్రత్యేక చొరవ చూపుతున్నామని, వ్యవస్థలను మరింత పటిష్ట పరిచేందుకు ఈసారి విజిలెన్స్ వారోత్సవాలలో ప్రముఖులను ఆహ్వానించి అవగాహన కల్పిస్తున్నామని బలరామ్ తెలిపారు. రానున్న రోజుల్లో దేశంలోని 10 రాష్ట్రాల్లోనూ కార్యకలాపాలు నిర్వహించేలా, అలాగే అంతర్జాతీయంగా ఖనిజ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేలా విస్తరణ ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram