ARI Movie | భగవద్గీతలోని అరిషడ్వర్గాలను ఆధునికంగా చూపించాలనుకున్నా – జయశంకర్
‘అరి’ చిత్ర దర్శకుడు జయశంకర్ అరిషడ్వర్గాల తాత్విక కాన్సెప్ట్‌ని ఆధునిక టెక్నాలజీతో కలిపి తెరకెక్కించినట్లు తెలిపారు. ఏఐతో విఎఫ్ఎక్స్ చేసి కొత్త ప్రయోగం చేశారు.

“Ari is my modern Bhagavad Gita” – Director Jayashankarr on blending philosophy and AI in filmmaking
ARI Movie | “సినిమా కేవలం వినోదానికి కాదు, మనిషి లోపాలను అద్దంలా చూపించడానికి కూడా ఒక సాధనం” అంటున్నారు దర్శకుడు జయశంకర్. పేపర్ బాయ్తో మంచి పేరు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు తన రెండో చిత్రమైన ‘అరి – మై నేమ్ ఈజ్ నోబడి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అరి విశేషాలు పంచుకునేందుకు ఆయన విలేకరులతో మాట్లాడారు.
‘అరి’ కథ వెనకున్న ఆలోచన గురించి మాట్లాడుతూ, పురాణాలు, ఇతిహాసాల మీద చిన్నప్పటినుండీ నాకు ఎనలేని ఆసక్తి. మనిషి జీవితంలో అరిషడ్వర్గాలు — కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య — ఇవే అన్ని సమస్యల మూలం. వాటిని జయించాలని చెబుతారు కానీ ఎలా జయించాలో ఎవరూ చెప్పలేదు. నేను ఆ సమాధానం వెతికాను. ఆ ఆలోచనే ఈ సినిమా పుట్టుకకు కారణం అని జయశంకర్ అన్నారు.
వినోద్ వర్మ హీరోగా, అనసూయ భరద్వాజ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది. ఇందులో సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, హర్ష చెముడు కీలక పాత్రల్లో కనిపిస్తారు. “ఇది తాత్విక కథ అయినా ప్రేక్షకులకు సులభంగా అర్థమయ్యేలా తెరకెక్కించాం. క్లిష్టమైన భావాల్ని భావోద్వేగాల ద్వారా సింపుల్‌గా చెప్పే ప్రయత్నం చేశాం,” అని ఆయన చెప్పారు.
తక్కువ బడ్జెట్‌లో కూడా క్వాలిటీ విజువల్స్ ఇవ్వడం సవాల్‌గా అనిపించింది. అందుకే మేము ఏఐ టెక్నాలజీని ఉపయోగించాం. కొంత భాగం ఏఐ ఆధారంగా సిమ్యులేషన్ షాట్స్ చేశాం. ఫలితం అద్భుతంగా వచ్చింది. మనం టెక్నాలజీని సరిగ్గా ఉపయోగిస్తే, తాత్విక కథకూ కొత్త రూపం ఇవ్వవచ్చు అని నిరూపించామంటూ జయశంకర్ ‘అరి’ చిత్రంలో విఎఫ్ఎక్స్ వర్క్ గురించి తెలిపారు. ఈ సినిమా చూసిన మల్లాది, యండమూరి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వంటి ప్రముఖులు ప్రశంసించారని ఆయన చెప్పారు. వెంకయ్య గారు సినిమా చూసి ‘ఇది ఆధునిక భగవద్గీత’ అన్నారు. ఆ మాట నాకు జీవితంలో పెద్ద గౌరవం. ఇది కేవలం సినిమా కాదు, ఆధ్యాత్మికంగా ఆలోచింపజేసే అనుభవం. ‘అరి’ కథలోని ప్రతి పాత్రకూ అర్థం ఉంది. హీరో, విలన్ అనే విభజన రేఖలు లేవు. ప్రతి మనిషి తనలోని లోపాలతో చేసే యుద్ధమే ఈ కథ. యాక్షన్, థ్రిల్, ఫిలాసఫీ అన్నీ కలిపి ఈ సినిమా రూపుదిద్దుకుంది. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి,” అన్నారు.
విజయం సాధిస్తే ఈ కాన్సెప్ట్‌ని ఇతర భాషల్లో కూడా తీసుకెళ్లాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. “బాలీవుడ్, కన్నడ ఇండస్ట్రీల నుండి ఆసక్తి వ్యక్తమైంది. అన్నీ కుదిరితే రీమేక్ చేసే అవకాశం ఉంది. ఇక నా తదుపరి ప్రాజెక్ట్‌లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇది మిస్టరీ–యాక్షన్ థ్రిల్లర్. డిసెంబర్‌లో షూటింగ్ ప్రారంభమవుతుంది,” అని ఆయన వెల్లడించారు.
జయశంకర్ మాటల్లో చెప్పాలంటే — “సినిమా అంటే నాకు ఒక సాధన. మనసును ప్రశ్నించే, మనిషిని అర్థం చేసుకునే ఆత్మయాత్ర. ‘అరి’ ఆ యాత్రలో మొదటి అడుగు.”