Thribhanadhari Barbaric Movie| చెప్పిన మాట కోసం..చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు!

Thribhanadhari Barbaric Movie| చెప్పిన మాట కోసం..చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు!

విధాత : `సినిమా న‌చ్చ‌క‌పోతే.. నా చెప్పుతో నేనే కొట్టుకొంటా` అని చెప్పిన ఓ దర్శకుడు నిజంగానే అన్నంత పని చేయడం వైరల్ గా మారింది. త్రిభాణదారి బార్బరిక్ (Thribhanadhari Barbaric  Movie)సినిమా దర్శకుడు మోహన్ శ్రీవత్స(Director Mohan Srivatsa) తన సినిమా విడుదలకు ముందు ప్రెస్ మీట్ లలో చెప్పిన మాట మేరకు తనను తాను చెప్పుతో(Shoe Slap) కొట్టుకున్నాడు. తన ఆవేదనను ఓ వీడియోలో సోషల్ మీడియాలో పంచుకున్నాడు. వినాయక చవితికి విడుదలైన త్రిభాణదారి బార్బరిక్ సినిమా ప్రేక్షకులకు ఎందుకు నచ్చలేదో అర్ధం కావడం లేదన్నారు. తాను థియేటర్ కు ఓ మాములు వ్యక్తిగా వెళితే అందులో కేవలం 15మంది మాత్రమే ఉన్నారని..వారిని సినిమా ఎలా ఉందని ప్రశ్నిస్తే చాల బాగుందని చెప్పారని.. నిజం చెప్పండని నేను సినిమా దర్శకుడిని అని అడిగితే కూడా బాగుందనే చెప్పారన్నారు. అలానే శనివారం సాయంత్రం నా భార్యతో మూవీ చూసేందుకు వెళ్లానని…మనసు ఏం బాగోలేక అరగంటలోనే ఇంటికి తిరిగొచ్చేశాను. నేను ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటానో అని భయపడి నా భార్య కూడా నాతో పాటు వచ్చేసింది. ఇంత మంచి సినిమా తీస్తే జనాలు ఎందుకు రావట్లేదో నాకు అసలు ఇది అర్థం కావట్లేదని వాపోయాడు. రెండున్నర ఏండ్లు ఓ తపస్సులా సినిమా తీశానని చివరకు ప్రేక్షకుల ఆదరణ లభించలేదని మనస్తాపానికి గురయ్యాడు.

సినిమాకు జనం రాకపోతే అది బాగుందో లేదో ఎలా తెలుస్తుందని..జనం థియేటర్ కు వచ్చేందుకు ఏం చేయాలో అర్ధం కావడం లేదన్నారు. మ‌ల‌యాళం నుంచి సినిమాలు తీస్తే.. అక్క‌డి నుంచి మంచి కంటెంట్ వ‌స్తే, థియేట‌ర్ల‌కు వెళ్తున్నారు క‌దా అని..అలాంట‌ప్పుడు ఇక్క‌డి సినిమాలు ఎందుకు చూడ‌రని శ్రీవాత్సవ ప్రశ్నించారు. తెలుగోడు సినిమా తీస్తే ఎందుకిలా అని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే నేను ఓ నిర్ణ‌యానికి వ‌చ్చానని.. ఇక మ‌ల‌యాళంలోనే సినిమా తీస్తా..అక్క‌డ హిట్ కొట్టి నిరూపించుకొంటా” అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ ఓ సెల్ఫీ వీడియోని పోస్ట్ చేశారు. అంతే కాదు.. ”ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌క‌పోతే నా చెప్పుతో నేను కొట్టుకొంటా అన్నాను. ఇప్పుడు అదే ప‌ని చేస్తా” అని ఆవేశంతో త‌న చెప్పు తీసుకొని తానే కొట్టుకొన్నారు. వినాయక చవితికి సుందరకాండ, అర్జున్ చక్రవర్తి, త్రిభాణదారి బార్బరిక్ లాంటి తెలుగు సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి. మలయాళ డబ్బింగ్ మూవీ ‘కొత్త లోక’ కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. వీటిలో ‘కొత్త లోక’ చిత్రం పాజిటివ్ టాక్ దక్కింది. దీంతో ‘త్రిభాణధారి బార్బరిక్’ దర్శకుడు తన సినిమాకు ప్రేక్షకాదరణ దక్కకపోవడంతో ఆవేదనకు గురయ్యాడు.