Farmers Suffering | రైతులకు కన్నీటి గాయాలు.. తడిసి ముద్దవుతోన్న పంటలు!

రైతులను క‘న్నీటి’ గాయాలు వెంటాడుతున్నాయి. ఈ సీజన్ మొత్తం రైతులతో వానలు చెలగాటమాడుతున్నాయి. పూత, కాత దశలో కురిసిన వర్షాలతో పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం కనబరిచాయి. పత్తి పంట రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో దెబ్బతిన్నది. వరి పంట పొట్ట దశలో ఒకసారి, కోత దశలో మరోసారి, పంట కోసిన తర్వాత విక్రయించే దశలో పడరాని పాట్లుపడుతున్నారు.

Farmers Suffering | రైతులకు కన్నీటి గాయాలు.. తడిసి ముద్దవుతోన్న పంటలు!
  • ధాన్యం ఆరబోసుకుంటున్న అన్నదాత
  • ఉత్పత్తులతో వానల దొంగాట
  • అకాల వర్షాలతో ఆగమాగం
  • వెన్నువిరిసిన మొంథా తుఫాన్
  • కొనుగోళ్ళలో విపరీత జాప్యం

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

రైతులను క‘న్నీటి’ గాయాలు వెంటాడుతున్నాయి. ఈ సీజన్ మొత్తం రైతులతో వానలు చెలగాటమాడుతున్నాయి. పూత, కాత దశలో కురిసిన వర్షాలతో పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం కనబరిచాయి. పత్తి పంట రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో దెబ్బతిన్నది. వరి పంట పొట్ట దశలో ఒకసారి, కోత దశలో మరోసారి, పంట కోసిన తర్వాత విక్రయించే దశలో పడరాని పాట్లుపడుతున్నారు. మొక్కజొన్న పరిస్థితి కూడా ఇదే స్థితిలో ఉంది. ఇప్పటికే పలుమార్లు తడిసిన పంట ఉత్పత్తులను పదేపదే ఆరబోసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అయితే, ఆరబోసుకునేందుకు రైతులు పడుతున్న అగచాట్లు అన్నీఇన్నీకావు. ఒక్కో రైతుది ఒక్కో పరిస్థితి. కదిలిస్తే కన్నీటి గాథలు కల్లల్లోంచి ఉబికి వస్తున్నాయి. ఆఖరికి అమ్ముకునేందుకు మార్కెట్ కు తెచ్చిన తర్వాత కూడా ఆగమాగమవుతున్నారు.

మొన్ననే మొంథా తుఫాన్ దెబ్బకు తల్లడిల్లి డీలాపడిన రైతులు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండుగా.. సోమ, మంగళవారాల్లో కురిసిన అకాల వర్షాలతో కోలుకోలేని పరిస్థితి తలెత్తింది. వరంగల్, కరీంనగర్, హుజురాబాద్, నల్లగొండతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితిని రైతులు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉండగా కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో తేమ పేరుతో కొనుగోళ్లు ఆలస్యం కావడంతో రైతులకు శాపంగా మారుతోంది. ఒక్కో రైతు ధాన్యం, మక్కలు ఇప్పటికే రెండు మూడు పర్యాయాల తడిసిపోవడం, ఆరబెట్టడం, మళ్ళీ అకాల వర్షాలబారిన పడి తడిసిపోవడంతో రైతుల్లో అసహనం నెలకొంటోంది. ఇంటికి తీసుకపోలేక, ఇతరులకు అమ్మలేక నానాయాతనకు గురవుతున్నారు.

వానపాలైతున్న పంట ఉత్పత్తులు

తడిసిన మొక్కజొన్న, ధాన్యం ఆరబోసుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరగానే అమ్ముకునేందుకు అవకాశం ఉంటోందని ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాల్లో కొందరురైతులు, మార్కెట్లలో మరికొందరు ఆరబోస్తున్నారు. విక్రయానికి ముందు ఇళ్ల వద్ద స్థలం లేని రైతులు రోడ్లపై, చెరువు కట్టలపై ఆరబోస్తున్నారు. ఆకస్మికంగా వర్షాలు కురిసినపుడు టార్ఫారిన్లు తదితర వాటితో పంట రక్షణకు ప్రయత్నిస్తున్నప్పటికీ కింది నుంచి వర్షం నీటి ప్రవాహం పెరిగి ధాన్యం, మక్కలు నీటిపాలవుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఉత్పత్తులు కండ్ల ముందే కాల్వల్లో కలిసిపోతుంటే కంటనీరు పెట్టడం తప్ప రైతులు ఏమీ చేయలేని దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నీట కలుస్తున్న పంట ఉత్పత్తులను చూసి రైతులు లబోదిబో మంటున్నారు. విక్రయించేందుకు మార్కెట్కు తెచ్చిన పత్తి కూడా అకాల వర్షాలతో తడిసిపోవడంతో రైతుల పరిస్థితి ఎంత అధ్యాన్నంగా మారిందో తెలుస్తోంది. వరంగల్ మార్కెట్లో మంగళవారం పత్తి, మక్కలు తడిసి రైతులు ఇబ్బందులపాలయ్యారు. ఇప్పటికైనా రైతుల పరిస్థితిని గుర్తించి సకాలంలో పంట ఉత్పత్తుల కొనుగోలుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.