పసిడి ప్రియులకు ఊరటనిస్తూ బంగారం ధరలు మరోసారి తగ్గుదలను నమోదు చేశాయి. బుధవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 660 తగ్గి రూ. 1,43,510 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 600 తగ్గి రూ. 1,31,550 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ.2,35,000 వద్ద స్థిరంగా నిలిచింది.
మరింత తగ్గుదలపై అంచనాలు..
ఆల్టైమ్ గరిష్ఠ స్థాయిలకు చేరిన బంగారం ధరలు పశ్చిమాసియా యుద్ద ఉద్రిక్తతల క్రమంలో గత కొన్ని నెలలుగా వరుసగా హెచ్చుతగ్గులను నమోదు చేస్తూ వచ్చాయి. రూ.2లక్షల మార్కు నుంచి ప్రస్తుతం రూ. 1,43,510కి పసిడి ధరలు పడిపోయాయి. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో పాటు విదేశీ పెట్టుబడిదారులు బంగారం కంటే డాలర్, అమెరికా ప్రభుత్వ బాండ్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపారు.సెంట్రల్ బ్యాంకులు భారీగా పసిడి కొనుగోలు చేశాయి. పెట్టుబడిదారులు, ట్రేడర్లు లాభాల స్వీకరణలో పడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.
గత ఆరు నెలలుగా పుత్తడిలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. చాలా మంది బంగారం ధరలు మరింతగా తగ్గుతాయా అని ఎదురు చూస్తున్నారు. గత రెండేళ్లుగా బంగారం ధర భారీగా పెరిగింది. ఒక స్థాయిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2లక్షల మార్కును చేరింది. తర్వాత క్రమంగా తగ్గి.. ప్రస్తుతం తులం రూ.1,40,000 నుంచి రూ. 1,50, 000 మధ్య ట్రేడవుతోంది. అయితే బంగారం ధర ఇప్పటికీ ఎక్కువగానే ఉందని నిపుణులు భావిస్తున్నారు. త్వరలోనే బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బంగారం ధరలపై అత్యధిక ప్రభావం చూపుతున్న అంశాలను వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వివరించింది.
అమెరికా ఆర్థిక వ్యవస్థ. యూఎస్ డాలర్ విలువ పెరగడం, ప్రభుత్వ బాండ్లపై వడ్డీ రాబడులు అధికంగా ఉండటం వల్ల పెట్టుబడిదారులు బంగారం కంటే బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని అంచనా వేసింది. దీంతో బంగారానికి డిమాండ్ తగ్గి, ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. అయితే మరికొన్ని రీసెర్చ్ నివేదికలు బంగారం ధర పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.అయితే ఒక వేళ బంగారం ధర తగ్గినా భారీగా తగ్గే అవకాశం లేదని చెబుతున్నారు. పసిడి ధరలు 10 శాతం నుంచి 15 శాతం వరకు తగ్గితే తగ్గొచ్చని.. తప్పనిసరైతే కాదని పేర్కొంటున్నారు.