విధాత,హైదరాబాద్ : అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మరోసారి దిగివచ్చాయి. వరుసగా మూడో రోజులుగా పెరిగిన బంగారం, వెండి ధరలు శనివారం తగ్గుముఖం పట్టాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 1,860 తగ్గి రూ.1,54,800 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,700 తగ్గి రూ. 1,41,900 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 100 తగ్గి రూ.2,54,900వద్ద నిలిచింది.
గ్లోబల్ మార్కెట్‌లో అమెరికన్ డాలర్ సూచీ మళ్లీ బలం పుంజుకోవడం, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ పెరగడంతో పసిడికి డిమాండ్ తగ్గింది. సాధారణంగా డాలర్ విలువ పెరిగినప్పుడు విదేశీ ఇన్వెస్టర్లకు బంగారం కొనుగోలు ఖరీదైనదిగా మారి డిమాండ్ క్షీణిస్తుంది. దీనికి తోడు గడిచిన రోజుల్లో పసిడి ధరలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలకు చేరుకోవడంతో పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు, ట్రేడర్లు తమ లాభాలను స్వీకరించేందుకు (ప్రాఫిట్ బుకింగ్) బంగారాన్ని విక్రయించారు.
ఈ భారీ అమ్మకాల ఒత్తిడి వల్ల మార్కెట్లో పసిడి ధరలు మరోసారి పతనమయ్యాయి. అయితే పసిడి, వెండి ధరలలో హెచ్చుతగ్గులు సాధారణమైనప్పటికి..దీర్ఘకాలికంగా పుంజుకునే అవకాశాలు ఎక్కువని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
