Silver, Gold Prices| భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు

నెల రోజులుగా సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ పైపైకి వెలుతున్న వెండి, బంగారం ధరలు వరుసగా రెండు రోజులు తగ్గుదలను నమోదు చేసి మార్కెట్ నిపుణులను అశ్చర్యపరిచాయి. మంగళవారం కిలో వెండి ధర రూ.23,000తగ్గిపోగా రూ.2,58,000వద్ద నిలిచింది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.3,050తగ్గి రూ.1,36,200వద్ద నిలిచింది. వెండి..బంగారం ధరల పతనం వాటి భవిష్యత్తు ఏమిటన్నదానిపై ఆసక్తి రేపాయి.

Silver, Gold Prices| భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు

విధాత, హైదరాబాద్ : నెల రోజులుగా సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ పైపైకి వెలుతున్న వెండి, బంగారం ధరలు( Silver, Gold Prices) వరుసగా రెండు రోజులు తగ్గుదల(price fall)ను నమోదు చేసి మార్కెట్ నిపుణులను అశ్చర్యపరిచాయి. వెండి కిలో ధర రెండు రోజుల్లో రూ.27వేలు తగ్గడం గమనార్హం. కిలో వెండి ధర మంగళవారం భారీ తగ్గుదలను నమోదు చేసింది. ఏకంగా రూ.23,000తగ్గిపోగా రూ.2,58,000వద్ద నిలిచింది. గణనీయంగా పెరిగిన ధరలతో లాభాలను ఆర్జించేందుకు ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేయడంతో పాటు రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు నివారణ వాతావారణం ఏర్పడటంతో వెండి, బంగారం ధరల తగ్గుదలకు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 8 శాతం మేర పడిపోయి 72.93 డాలర్ల స్థాయికి దిగిరావడంతో ధరలు తగ్గాయి.

తగ్గిన బంగారం ధరలు

వెండి దారిలోనే బంగారం ధర కూడా మంగళవారం గణనీయంగా తగ్గుదలను నమోదు చేసింది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.3,050తగ్గి రూ.1,36,200వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,800తగ్గి రూ.1,24,850వద్ద నిలచింది. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సు పై ఏకంగా 195 డాలర్ల మేర పడిపోవడంతో ధరలు క్షీణించాయి. గోల్డ్, సిల్వర్, కాపర్ ధరలు భారీగా పెరిన క్రమంలో..ఈ ధర వద్ద అమ్మితే తాము వచ్చిన లాభాలను కాపాడుకోవచ్చు అని ఇన్వెస్టర్లు భావించారు. దీంతో పెద్ద మొత్తంలో గోల్డ్, సిల్వర్, కాపర్ వంటి మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఫలితంగా 2026 సంవత్సరం కన్నా ముందే లాభాలను బుక్ చేసుకున్నారు. దీంతో రిటైల్ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గినట్లుగా నిపుణులు చెబుతున్నారు.

అటు ప్లాటినం ధరలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. 10గ్రాముల ప్లాటినం ధర రూ.7,710తగ్గి రూ.61,800వద్ద కొనసాగుతుంది.

వెండి కొనుగోలు సురక్షితమేనా…?

ప్రపంచ వెండి సరఫరాలో సుమారు 60 నుంచి 70 శాతం వరకు చైనా ఆధిపత్యం ఉంది. జనవరి 1, 2026 నుంచి చైనా వెండి ఎగుమతులపై కొత్త ఆంక్షలు అమల్లోకి తీసుకొస్తుండటంతో ఇటీవల వెండి ధరల పెరుగుదలకు కారణమైంది. అదే సమయంలో అంతర్జాతీయంగా రాజకీయ ఉద్రిక్తతలు, వెండి, బంగారంపై పెరిగినపెట్టుబడులు, ఫెడ్ విధానాలు, డాలర్ హెచ్చతగ్గులు, పారిశ్రామిక అవసరాల్లో వెండి వినియోగం పెరుగుదల, డిమాండ్ కు ఉత్పత్తికి మధ్య లోటు వెండి ధరలను పైకి లేపింది.

వెండి ఉత్పత్తి ప్రధానంగా రాగి, జింక్ గనుల ఉప ఉత్పత్తిగా జరుగుతుంది. చైనా ఎగుమతి ఆంక్షలు, తగ్గుతున్న నిల్వలు, పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్ కలిసి వెండి ధరలు డిసెంబర్ నెలలో అసాధారణంగా పెరిగాయి. బాక్సింగ్ డే నాడు బంగారం, ప్లాటినం కూడా రికార్డు స్థాయిలను తాకడంతో విలువైన లోహాలన్నింటిలో భారీ ర్యాలీ కనిపించింది. మరి ఈ ధరలు మునుముందు పెరుతాయా?..వెండి కొనుగోలు సురక్షితమేనా? అన్న ప్రశ్నలు ఇప్పుడు కొనుగోలుదారులను టెన్షన్ పెడుతుంది.

పెరుగుదలపైనే అంచనాలు

వెండి ధరల హెచ్చుతగ్గుల రికార్డులను గమనిస్తే..1979-80లో వెండి ధరలు అతి వేగంగా పెరిగి, కొన్ని నెలల్లోనే 90 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. 2011లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో 48 డాలర్లని తాకిన వెండి ధరలు ఆ తర్వాత 75 శాతం కంటే ఎక్కువగా క్షీణించాయి. ఈ రెండు సందర్భాల్లోనూ, ధరలు గరిష్ట స్థాయికి చేరిన తర్వాత తీవ్రంగా పడిపోయాయి. కరోనా కాలంలో కనిష్ట స్థాయి నుంచి ఇప్పటివరకు వెండి ధరలు ఆరు రెట్లు పెరిగాయి. కేవలం గత ఏడాదిలోనే మూడు రెట్లు పెరిగింది.

మరి గతంలో మాదిరిగా అనూహ్య ధరల పతనం సాధ్యమా? అంటే..అలాంటి భయం అక్కరలేదన్న వాదన వినిపిస్తుంది. ఎందుకంటే 1979 లేదా 2011తో పోలిస్తే ఈసారి వెండికి పారిశ్రామిక డిమాండ్ మరింత బలంగా ఉందని..ఇదే వెండి ధరలను నిలబెడుతుందని..అదే సమయంలో కొత్తగా ఉత్పత్తి పెరుగడం లేదని..ఈ నేపధ్యంలో వెండి పెట్టబడులపై ఆందోళన అక్కరలేదంటున్నారు నిపుణులు.