BUS Journey | మీరు బస్సుల్లో ప్రయాణిస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి

ప్రజలు ఒకచోటు నుంచి మరో చోటుకి.. లేదా ఒక ఊరు నుంచి మరో ఊరికి, నగరానికి వెళ్లాలంటే ప్రధాన సాధనం బస్సు. ముఖ్యంగా మధ్యతరగతికి చెందిన వారికి బస్సు ప్రయాణం జీవితంలో భాగంగా మారింది. కాగా, ప్రస్తుతం రహదారులపై ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో బస్సుల్లో సురక్షిత ప్రయాణం కోసం ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

BUS Journey | మీరు బస్సుల్లో ప్రయాణిస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి

విధాత, హైదరాబాద్ :

ప్రజలు ఒకచోటు నుంచి మరో చోటుకి.. లేదా ఒక ఊరు నుంచి మరో ఊరికి, నగరానికి వెళ్లాలంటే ప్రధాన సాధనం బస్సు. ముఖ్యంగా మధ్యతరగతికి చెందిన వారికి బస్సు ప్రయాణం జీవితంలో భాగంగా మారింది. కాగా, ప్రస్తుతం రహదారులపై ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో బస్సుల్లో సురక్షిత ప్రయాణం కోసం ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తరచూ సుదూర ప్రయాణాలు చేసేవారు నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం పెద్ద ముప్పుగా మారే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో నిపుణులు, రవాణా శాఖ అధికారులు కొన్ని భద్రతా చర్యలు సూచిస్తున్నారు.

ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు ఎల్లప్పుడూ ప్రభుత్వ రంగ రవాణా సంస్థల బస్సులకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు ఎంచుకోవాలని చెబుతున్నారు. ప్రభుత్వ బస్సులు నిర్ణీత వేగ పరిమితులను కచ్చితంగా పాటిస్తాయి. డ్రైవర్ల పని వేళలు నిబంధనల ప్రకారం ఉంటాయి. ఈ కారణంగా డ్రైవర్‌ అలసట, అతి వేగం వంటి ప్రమాదకర పరిస్థితులు తక్కువగా ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే సమయంలో ప్రైవేట్ బస్సులు కొన్నిసార్లు సమయపాలన కోసం అతి వేగంతో నడుస్తాయి. ఇది ప్రమాదం జరిగితే ప్రాణనష్ట తీవ్రతను మరింత పెంచుతుంది.

వీలైనంత వరకు రాత్రి సమయాల్లో సుదూర ప్రయాణాలను మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో ప్రమాదం జరిగితే సమీప గ్రామాలు, పట్టణాల నుంచి సహాయం అందటానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. సహాయం కోసం ఆంబులెన్స్ చేరుకోవడంలో ఆలస్యం అవుతుంది. దీని వల్ల ప్రాణనష్టానికి దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అవసరం అయితేనే రాత్రి వేళల్లో బస్సు ప్రయాణం చేయకూడదని చెబుతున్నారు. ప్రయాణికులు ముందుగా టికెట్‌ బుక్ చేసుకునేటప్పుడు సీటు ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి. బస్సు మధ్య భాగంలో కూర్చోవడం ప్రమాదం జరిగినా సురక్షితంగా ఉంటుందని చెబుతున్నారు. ముందు లేదా వెనుక భాగాల్లో కూర్చోవడం ప్రమాద తీవ్రతను పెంచవచ్చు. అలాగే, విండ్లో సీట్ల దగ్గర కూర్చుంటే అద్దాలు పగిలి గాయాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి లోపల వైపు సీటు ఎంచుకోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు.

ఆన్‌లైన్ లేదా యాప్‌ల ద్వారా టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ‘ట్రావెల్ ఇన్సూరెన్స్‌’ ఆప్షన్‌ను తప్పక ఎంచుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల తక్కువ మొత్తంలో లభించే ఈ బీమా ప్రమాదం జరిగినప్పుడు వైద్య ఖర్చులు, నష్టపరిహారం రూపంలో ఆర్థికంగా ఉపయోగపడుతుంది. తరచుగా ప్రయాణించే వారు నిపుణుల సలహాతో వ్యక్తిగత ప్రమాద పాలసీ (పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ) తీసుకోవడం ఉత్తమమైన పని. అయితే, రహదారిపై ప్రమాదాలను పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా, ప్రతి ప్రయాణికుడు కనీస భద్రతా చర్యలు తీసుకుంటే ప్రాణనష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని..ప్రయాణం ముందు తీసుకున్న చిన్న జాగ్రత్త ఒక పెద్ద ప్రమాదం నుంచి రక్షిస్తుంది అని నిపుణులు సూచిస్తున్నారు.