Vande Bharat sleeper train । వచ్చేస్తున్నది.. దేశపు తొలి వందేభారత్ స్లీపర్ పట్టాలెక్కేది ఎప్పటినుంచి.. ఫీచర్లేంటి..
వందేభారత్ సిరీస్‌లో రైళ్లు ఇప్పటికే సూపర్ సక్సెస్ అయ్యాయి. ఈ క్రమంలోనూ మూడో విడతలో స్లీపర్ కోచ్‌లతో కూడిన రైలు పట్టాలెక్కేందుకు సర్వం సిద్ధమైంది.

Vande Bharat sleeper train । వందేభారత్ సిరీస్‌లో రైళ్లు ఇప్పటికే సూపర్ సక్సెస్ అయ్యాయి. ఈ క్రమంలోనూ మూడో విడతలో స్లీపర్ కోచ్‌లతో కూడిన రైలు పట్టాలెక్కేందుకు సర్వం సిద్ధమైంది. 2019లో తొలిసారి వందేభారత్ చైర్ కార్ ట్రైన్‌ను ప్రారంభించారు. అనంతరం గుజరాత్‌లో వందే మెట్రో (first Vande Metro) కూడా సిద్ధమవుతున్నది. ఈ క్రమంలో ఇప్పుడు స్లీపర్ కోచ్‌లపై రైల్వే శాఖ దృష్టిసారించింది. కోచ్‌లను భారత్ ఎర్త్‌మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్) బెంగళూరు ప్లాంటులో తయారు చేస్తున్నారు. తొలి రైలు అక్కడి నుంచి సెప్టెంబర్ 20 నాటికి డిస్పాచ్ అవుతుందని భావిస్తున్నట్టు ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) చెన్నై జనరల్ మేనేజర్ యూ సుబ్బారావు మనీకంట్రోల్‌కు చెప్పారు. ప్రస్తుతం ఇంటిగ్రేషన్ వర్క్‌ను బీఈఎంఎల్ చేస్తున్నది.
కోచ్‌లు ఐసీఎఫ్‌కు రాగానే రేక్ ఫార్మేషన్, తుది పరీక్షలు, కమిషనింగ్ వంటివాటిపై దృష్టిపెడతామని సుబ్బారావు తెలిపారు. అందుకు ఎంతలేదన్నా 15 నుంచి 20 రోజులు పడుతుందని చెప్పారు. తదుపరి మెయిన్‌లైన్‌లో పరీక్ష ఉంటుందని తెలిపారు. ఇందులో ఆసిలేషన్ ట్రయల్స్‌కు (oscillation trials) నెల లేదా రెండు నెలలు పట్టవచ్చని చెప్పారు. ఈ పరీక్షను లక్నోకు చెందిన రైల్వే డిజైన్ అండ్ స్ట్రాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) పర్యవేక్షణలో నిర్వహిస్తామన్నారు. హైస్పీడ్ టెస్టింగ్ కోసం వాయవ్య రైల్వే జోన్‌లో ట్రయల్ రన్స్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
యూరప్‌లో నైట్‌జెట్ స్లీపర్ ట్రైన్స్ (Nightjet sleeper trains in Europe) తరహాలో వందేభారత్ స్లీపర్ రైళ్లలో ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాలను భారత రైల్వే అందించనున్నది. ‘రాత్రిపూట రైళ్లలో లైట్లన్నీ ఆర్పివేసిన తర్వాత ప్రయాణికులు వాష్‌రూమ్‌కు వెళ్లాల్సి వస్తే.. ఇబ్బంది లేకుండా ఫ్లోర్‌పై ఎల్‌ఈడీ బల్బులు ఉంటాయి. రైలు అటెండెంట్స్‌కు కూడా ప్రత్యేకంగా బెర్తులు ఉంటాయి’ అని తెలుస్తున్నది.
పదహారు వందేభారత్ స్లీపర్ టైన్ సెట్లలోని పది డిజైన్, తయారీకి 2023, మే నెలలో చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ బీఈఎంఎల్‌కు ఆర్డర్ ఇచ్చింది. వీటి గరిష్ఠ ఆపరేషనల్ వేగం గంటకు 160 కిలోమీటర్లు. ‘ఇది మొట్టమొదటి వందేభారత్ స్లీపర్ ట్రైన్. దీనికి ఇంకొంత సమయం పడుతుంది. యూరోపియన్ ప్రమాణాలకు అనుగుణంగా దీనిని తయారు చేస్తున్నాం. అన్ని రకాల పరీక్షలు, ట్రయల్ రన్స్ పూర్తి చేసుకుని 2024 డిసెంబర్‌కల్లా ఇది ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది’ అని యూ సుబ్బారావు తెలిపారు.
16 కోచ్‌లు ఉండే వందేభారత్ స్లీపర్ ట్రైన్‌లో 823 బెర్తులు ఉంటాయి. వీటిలోనే 11 3ఏసీ కోచ్‌లు (611 బెర్తులు), 2ఏసీ కోచ్‌లు నాలుగు (188 బెర్తులు), ఒక 1ఏసీ కోచ్ (24 బెర్తులు) ఉంటాయి. ప్రతి స్లీపర్ బెర్తుకు రీడింగ్ లైట్స్, చార్జింగ్ సాకెట్లు, మొబైల్, మ్యాగజైన్ హోల్డర్, స్నాక్ టేబుల్ ఉంటాయి. కవచ్ రక్షణ వ్యవస్థను కూడా ఈ ట్రైన్ కలిగి ఉంటుంది.