విధాత, హైదరాబాద్ : ఈ ఏడాది ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ కోసం కొత్త ఇందిరమ్మ చీరలను తెలంగాణ ప్రభుత్వం సిద్దం చేస్తుంది. గతంలో నీలం రంగు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయగా… వాటి స్థానంలో ఈ సారి కుప్పడం చిలకపచ్చ రంగు, ఎరుపు జరీ బోర్డర్ ఉన్న చీరల డిజైన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపిక చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఒక కోటి ఉచిత చీరల తయారీ కోసం టెస్కో సంస్థకు రూ. 450 కోట్ల ఆర్డర్‌ను సెర్ఫ్ ఇచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి గత ఏడాది 86 లక్షల మందికి చీరలను తయారు చేయించి నవంబరు 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పంపిణీ చేపట్టింది. అయితే యూనిఫామ్ మాదిరిగా ఏటా ఒకటే రంగు కాకుండా డిజైన్ లో మార్పులు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, సెర్ప్, మెప్మాల సీఈవో దివ్యాదేవరాజన్‌లు పలు నమూనాలను సిద్ధం చేయించారు. వాటిలో కుప్పడం చిలకపచ్చ రంగు, ఎరుపు జరీ బోర్డర్ డిజైన్‌తో గల చీరను సీఎం ఎంపిక చేశారు.
గతంలో మాదిరిగా విడివిడిగా గాకుండా ఈ ఏడాది గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారికి ఒకే దఫాలో పంపిణీ చేయాలని నిర్దేశించారు. టెస్కో.. సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని సుమారు 11 ప్రాంతాల్లోని నేత కార్మికులకు పనులను అప్పగించింది. అక్టోబరు నాటికి చీరలను సిద్ధం చేస్తే నవంబరు 19న తిరిగి ఇందిరాగాంధీ జయంతికి పంపిణీ చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.
