Malegaon Blast Case| మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసు.. ప్రత్యేక కోర్టు కీలక తీర్పు

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Jul 31, 2025, 2:41 pm IST
Read Time: 5 mins
Malegaon Blast Case| మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసు.. ప్రత్యేక కోర్టు కీలక తీర్పు

విధాత: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 నాటి మాలేగావ్‌ బాంబు పేలుళ్ల కేసు(Malegaon Blast Case)లోపేలుడు కేసులో ముంబైలోని ప్రత్యేక కోర్టు కీలక తీర్పు(NIA court verdict) వెలువరించింది. ఈ కేసు లో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ (Pragya Thakur), లెఫ్టినెంట్‌ కర్నల్‌ ప్రసాద్‌ పురోహిత్‌(Purohit) సహా మొత్తం ఏడుగురు నిందితులను ఎన్‌ఐఏ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. ఈ మేరకు గురువారం తీర్పు వెలువరించింది. ఈ కేసు దర్యాప్తు, ప్రాసిక్యూషన్ వాదనలో చాలా లోపాలు ఉన్నాయని.. దీనికి ఉపా చట్టం వర్తించదని కోర్టు స్పష్టం చేసింది. పేలుడులో ఉపయోగించిన వాహనం.. ప్రజ్ఞా ఠాకూర్ పేరుపై రిజిస్టర్ అయ్యిందని చెప్పడానికి ఆధారాలు లేవని..బైక్‌కు అమర్చిన బాంబు వల్లే పేలుడు సంభవించిందని చెప్పేందుకు కూడా ఆధారాల్లేని పేర్కొంది. ఉగ్రవాదానికి మతం లేదని.. ఎందుకంటే ఏ మతం కూడా హింసను ప్రోత్సహించదన్నారు. అయితే కేవలం ఊహాగానాలు, నైతిక ఆధారాలతో ఎవరినీ కోర్టులు శిక్షించవని తెలిపారు. బెనిఫిట్ ఆఫ్ డౌన్ మినహాయిస్తే ఈ కేసులో బలమైన ఆధారాలు లేవని పేర్కొన్న కోర్టు ఏడుగురు నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటించింది.

ఈ కేసులో పేలుళ్లలో చనిపోయిన 6గురు మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్థిక సాయం ఇవ్వాలని కోర్టు సూచించింది. మరోవైపు, ఈ తీర్పును తాము హైకోర్టులో సవాల్‌ చేయనున్నట్లు బాధిత కుటుంబాలు వెల్లడించాయి. తీర్పుపై మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ హర్షం వ్యక్తంచేశారు. ఈ కేసు కారణంగా గత 17 ఏళ్ల పాటు తన జీవితం నాశనం అయ్యిందన్నారు. తనను బాధ పెట్టిన వారిని దేవుడే శిక్షిస్తారని అన్నారు.

17ఏండ్లకు వెలువడిన తీర్పు
మహారాష్ట్ర లోని మాలేగావ్‌ ప్రాంతంలో 2008 సెప్టెంబరు 29న పేలుడు సంభవించింది. ఓ మసీదు సమీపంలో మోటార్‌ సైకిల్‌కు అమర్చిన బాంబు పేలడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. అప్పట్లో ఈ కేసు పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ప్రజ్ఞా ఠాకూర్‌, పురోహిత్‌తో పాటు రమేశ్‌ ఉపాధ్యాయ్‌, అజయ్‌ రహీర్‌కార్‌, సుధాకర్‌ ద్వివేది, సుధాకర్‌ చతుర్వేది, సమీర్‌ కులకర్ణి ప్రధాన నిందితులుగా కేసు నమోదైంది. ఈ కేసులో తొలుత దర్యాప్తు ప్రారంభించిన ఏటీఎస్‌ విచారణలో పలువురి వాంగ్మూలాలను అప్పట్లో నమోదుచేసింది. అనంతరం కేసు దర్యాప్తు బాధ్యతలను ఎన్‌ఐఏ స్వీకరించింది. ఈ కేసులో 220 మంది సాక్షులను విచారించగా.. వారిలో 15 మంది అంతకుముందు తాము ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మాట్లాడారు.