మంజీరా ఉగ్రరూపం.. ఏడుపాయ‌ల వ‌న దుర్గామాత ఆల‌యం మూసివేత‌

మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఘనపూర్ ప్రాజెక్టు పొంగిపొర్లుతున్నది. దుర్గామాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వనదుర్గ ప్రాజెక్టు పరవళ్ళు తొక్కుతున్నది.

మంజీరా ఉగ్రరూపం.. ఏడుపాయ‌ల వ‌న దుర్గామాత ఆల‌యం మూసివేత‌

విధాత; మెదక్ ప్రత్యేక ప్రతినిధి: శనివారం రాత్రి నుండి మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఘనపూర్ ప్రాజెక్టు పొంగిపొర్లుతున్నది. దుర్గామాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వనదుర్గ ప్రాజెక్టు పరవళ్ళు తొక్కుతున్నది. దుర్గామాత ఆలయం ముందు నుండి నిజాంసాగర్ వైపు పరుగులిడుతోంది. ముందు జాగ్రత్త చర్యగా ఆదివారం మధ్యాహ్నం ఏడుపాయల వన దుర్గ మాత ఆలయాన్ని మూసివేశారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు నిర్వహిస్తున్నారు. వర్షాలు ఇలాగే కురిస్తే ఆలయం ముందు ఉన్న బ్రిడ్జి పై నుండి మంజీరా పొంగిపొర్లే అవకాశం ఉంది. ఆదివారం సాయంత్రానికి బ్రిడ్జి కింద నుండి మాత్రమే నీళ్లు వెళుతున్నాయి. వర్షాలు తగ్గి మంజీరా శాంతించే వరకు రాజగోపురంలోనే పూజ నిర్వహిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, డిఎస్పి తో సహా తమ పోలీసు సిబ్బందితో ఏడుపాయలకు చేరుకున్నారు. ఈవో చంద్రశేఖర్ తో పాటు సిబ్బందితో సమీక్షించారు. భక్తులెవరు రాజగోపురం ముందుగా భారీకేడ్లు దాటి ఆలయం దిక్కు వెళ్ళొద్దని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

పొంగిపొర్లుతున్న ప్రాజెక్టులు
జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలకు ఘనపూర్ ప్రాజక్టుతోపాటు, హల్ది, పోచారం, రాయిన్ పల్లి ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని చెరువులు కుంటలు నిండి అలుగు పారుతున్నాయి. హవేలీ ఘనపూర్ మండలం రాజీపేట్ వాగు ఉదృతంగా ప్రవహించడంతో దోప్సింగ్ తండాకు రాకపోకలు బంద్ అయ్యాయి. ల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.