Congress Leader Marelli Anil| మెదక్ కాంగ్రెస్ నేత అనుమానాస్పద మృతి

ఒంటిపై బుల్లెట్ గాయాలు..ఘటన స్థలంలో నాలుగు బుల్లెట్ల లభ్యం
విధాత, హైదరాబాద్ : మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామ శివారులో కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా సెక్రటరీ మారెల్లి అనిల్ (35) అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు.
ఘటనా స్థలంలో నాలుగు బుల్లెట్ లు లభ్యమయ్యాయి. మృతుడి ఒంటిపై బుల్లెట్ గాయాలున్నాయి. మెదక్- హైదరాబాద్ రోడ్డు పక్కన అదుపు తప్పినట్టుగా ఉన్న కారులో అనిల్ ప్రమాదానికి గురయ్యాడు. తొలుత రోడ్డు ప్రమాదంగా పోలీసులు భావించారు. అయితే ఘటనా స్థలంలో బుల్లెట్లు లభ్యం కావడంతో పాటు, అనిల్ ఒంటిపై కూడా బుల్లెట్ గాయాలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో అతడిని ఎవరైనా కాల్చి చంపారా లేక తనే కాల్చుకుని చనిపోయాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కడప జిల్లాకి చెందిన ఓ ఎమ్మెల్యే కుటుంబానికి, మృతుడు అనిల్ కి గత కొద్దిరోజులుగా ఓ భూమి విషయంలో వివాదం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల వద్ద నుంచి అనిల్ రూ.80 లక్షలు, బెంజ్ కారు తీసుకున్నట్లుగా సమాచారం.
ఎస్సై గౌస్ తెలిపిన వివరాల ప్రకారం.. పెట్రోలు బంక్ నిర్వహిస్తున్న అనిల్.. సోమవారం రాత్రి మెదక్ నుంచి స్వగ్రామానికి కారులో బయల్దేరాడు. ఇదే మండలం చిన్నఘనపూర్ విద్యుత్తు సబ్ స్టేషన్ వద్ధ కారు అదుపు తప్పి కల్వర్టుకు ఢీకొట్టి పొలాల్లోకి దూసుకెళ్లింది. అనిల్‌కు తీవ్రగాయాలు కావడంతో అక్కడున్న వారు గమనించి మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. అయితే పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించగా బుల్లెట్ల విషయం వెలుగులోకి వచ్చింది. అతని కుడి భుజం నుంచి రెండు బుల్లెట్లు దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.