Mohanlal resigned । మలయాళం మూవీ ఆర్టిస్ట్ బాడీ ‘అమ్మ’ చీఫ్ పదవికి మోహన్‌లాల్ రాజీనామా
అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ యాక్టర్స్ (AMMA) అధ్యక్ష పదవికి సీనియర్ నటుడు మోహన్‌లాల్ రాజీనామా చేశారు. ఆయనతోపాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులందరూ రాజీనామాలు సమర్పించారు.

Mohanlal resigned । మలయాళ సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపు విషయంలో జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది. ప్రత్యేకించి మలయాళ సినీ ఇండస్ట్రీని తీవ్రంగా కుదిపేస్తున్నది. సీనియర్ నటుడు, అమ్మా ప్రధాన కార్యదర్శి సిద్దిఖీ, దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ సహా పలువురు ప్రముఖులపై వస్తున్న లైంగికదాడుల ఆరోపణల నేపథ్యంలో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ యాక్టర్స్ (AMMA) అధ్యక్ష పదవికి సీనియర్ నటుడు మోహన్‌లాల్ (Mohanlal) రాజీనామా చేశారు. ఆయనతోపాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులందరూ రాజీనామాలు సమర్పించారు. ఈ మేరకు అమ్మా నుంచి ఒక ప్రకటన విడుదలైంది. కమిటీలోని కొందరిపై కొందరు నటులు చేసిన ఆరోపణల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ కమిటీని రద్దు చేయాలని ఉన్నత నిర్ణాయక కమిటీ నిర్ణయించిదని అందులో తెలిపారు. రెండు నెలల్లో కొత్త కమిటీని ఏర్పాటు చేసేందుకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఆ ప్రకటన పేర్కొన్నది.
గతవారం జస్టిస్ హేమ కమిటీ నివేదికను బహిర్గతం చేయడంతో మలయాళ సినీ పరిశ్రమలోని సీనియర్ నటులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అనేక దిగ్భ్రాంతికర అంశాలతో కూడిన ఆ నివేదికను 2019లోనే కేరళ ప్రభుత్వానికి సమర్పించినా.. పలు న్యాయ అంశాల కారణంగా అది అటకెక్కింది. సినీ పరిశ్రమ సభ్యుల సవాళ్లను ఎదుర్కొంటూ.. న్యాయపరమైన చిక్కులన్నీ అధిగమించిన తర్వాత ఇటీవలే అది బహిర్గతమైంది. తనను లైంగికంగా వేధించడంతోపాటు భౌతికంగా, మానసికంగా హింసించాడంటూ రేవతి సంపత్ చేసిన ఫిర్యాదు నేపథ్యంలో గత వారమే సిద్ధిఖీ అమ్మా ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశాడు. మరోవైపు ప్రముఖ నటులు ఎం ముకేశ్, జయసూర్య మరో ఇద్దరిపై ఇవే తరహా ఆరోపణలను నటి మను మునీర్ చేశారు. వారు 2013లో ఒక సినిమా సెట్‌లో భౌతికంగా హింసించారని, దుర్భాషలాడరని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘షూటింగ్ సమయంలో చేదు అనుభవం ఎదుర్కొన్నా. రెస్ట్ రూమ్‌కు వెళ్లి బయటకు వచ్చాక జయ సూర్య నా అనుమతి లేకుండా నన్ను హత్తుకుని, మద్దు పెట్టాడు. భయంతో నేను అక్కడి నుంచి బయటకు పరుగు తీశాను’ అని ఆమె తన అనుభవాన్ని ఎన్డీటీవీతో పంచుకున్నారు.