Pandav Falls tiger| పాండవ జలపాతంలో పెద్దపులి !

నిత్యం భక్తులు.. పర్యాటకులు సందడి చేసే పాండవ జలపాతంలో పెద్దపులి సంచారం భయపెడుతుంది. పన్నా వనంలోని ఆ పురాతన ఇతిహాస సందర్శన ప్రాంతంలో పెద్ద పులి సంచారం వీడియో వైరల్ గా మారింది.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Apr 05, 2026, 3:27 pm IST
Read Time: 4 mins
Pandav Falls tiger| పాండవ జలపాతంలో పెద్దపులి !

విధాత : నిత్యం భక్తులు.. పర్యాటకులు సందడి చేసే పాండవ జలపాతంలో పెద్దపులి సంచారం భయపెడుతుంది. పన్నా వనంలోని ఆ పురాతన ఇతిహాస సందర్శన ప్రాంతంలో పెద్ద పులి సంచారం వీడియో వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖజురహో-పన్నా జాతీయ రహదారికి సమీపంలో ఉన్న పాండవ జలపాతం పర్యాటక, దర్శనీయ స్థలంగా కొనసాగుతుంది.

పాండవ జలపాతం మధ్యప్రదేశ్‌లోని కేన నది యొక్క ఉపనది నుండి ఉద్భవించే ఒక నిత్య జలధార.  సుమారు 30 మీటర్ల ఎత్తు నుండి హృదయాకారపు కొలనులోకి దిగువకు జాలువారుతూ కనిపించే అద్భుత సుందర దృశ్యంగా పాండవ జలపాతం కనువిందు చేస్తుంది. పాండవులు తమ వనవాస సమయంలో ఈ అడవులలో ఆశ్రయం పొందారని, ఒక పెద్ద కొలనుకు అభిముఖంగా ఉన్న గుహలలో వారు ఇక్కడ బస చేశారని పురాణ కథనం.

ఉదయం నుండి సాయంత్రం వరకు జనసందోహం అధికంగా ఉండే పాండవ జలపాతం ప్రదేశం చాలా చల్లగా, దట్టమైన అడవులు, పర్వాతాలు, లోయలు, సెలయేళ్ల మధ్య ప్రకృతి రమణీయతో పర్యాటక కేంద్రంగా సందర్శకులను ఆకర్షిస్తుంది. మండే వేసవి నెలల్లో కూడా ఏడాది పొడవునా కొండలపై నుంచి జలపాతం నీరు కిందకు దూకుతూ కనువిందు చేస్తుంది. ఖజురహో నుండి 35 కిలోమీటర్ల దూరంలో పన్నా అభయారణ్యం మడ్ల గేట్ సమీపంలో 7కిలోమీటర్ల దూరంలో ఉన్న పాండవ జలపాతంలో పెద్ద పులి సంచారం ఇప్పుడు పర్యాటకులకు భయపెడుతుంది. పెద్దపులి రాకతో ఒక్కసారిగా సందర్శకుల తాకిడి తగ్గిపోయింది. పెద్దపులి ఉనికి లేదని నిర్ధారణ అయ్యాకే మళ్లీ పాండవ జలపాతం పర్యాటక సందడి నెలకొనే పరిస్థితి నెలకొంది. అటవీ శాఖ అధికారులు పెద్దపులి జాడను తెలుసుకుని దానిని దూర ప్రాంతానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.