భారతీయ సినీ చరిత్రలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ‘రామాయణ’ మూవీ ట్రైలర్ విడుదల అనూహ్యంగా వాయిదా పడింది. నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేస్తామని ఇంతకుముందు మేకర్స్ ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. త్వరలోనే ట్రైలర్ విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత నమిత్ మల్హోత్రా పోస్టు పెట్టారు.
‘రామాయణ’ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాలనే నా కల ఇప్పుడు ‘సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్’ భాగస్వామ్యంతో నిజం కానుందని, సినిమాను అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలని భావించి చివరి నిమిషంలో ట్రైలర్‌ను వాయిదా వేస్తున్నాం. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తాం అని నమిత్ మల్హోత్రా వెల్లడించారు. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన భారతీయ సినీ రంగంలో ఈ సినిమా గర్వకారణంగా నిలుస్తుందన్నారు. హాలీవుడ్ సినిమాలకు దీటుగా ‘రామాయణ’ ప్రపంచ నలుమూలలకు వెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు.
సుమారు రూ.4000 కోట్లతో రూపొందిస్తున్న ‘రామాయణ’ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడి పాత్రలో యశ్ నటించారు. మొదటి భాగాన్ని ఈఏడాది దీపావళికి, రెండోభాగాన్ని వచ్చే సంవత్సరం దీపావళికి విడుదల చేయనున్నారు.
