వేల మంది గుడిసెలు కూల్చిన టర్క్‌మెన్‌ గేట్‌ పార్టీ వారసుడు రేవంత్‌రెడ్డి : ఈటల ఫైర్‌

మారుతి కార్ల తయారీ పరిశ్రమ కోసం ఆనాడు ఓల్డ్‌ ఢిల్లీలో పేదల ఇళ్లను నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలగొట్టిన అంశాన్ని ప్రస్తావించిన ఈటల.. టర్క్‌మెన్‌ గేట్‌ వద్ద పేదల ఇళ్లను కూలగొట్టి, అడ్డుకున్నవారిని చంపిన నీచపు చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి రేవంత్‌రెడ్డి వారసుడని దుయ్యబట్టారు.

వేల మంది గుడిసెలు కూల్చిన టర్క్‌మెన్‌ గేట్‌ పార్టీ వారసుడు రేవంత్‌రెడ్డి : ఈటల ఫైర్‌
  • నేడు హైడ్రా పేరుతో తెలంగాణలో సీఎం డ్రామా
  • బీజేపీ నేత, మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల‌ ఫైర్‌

హైడ్రా పేరిట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆడుతున్నది డ్రామా తప్ప సమాజ హితం కోసం కాదని బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ విమర్శించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇప్పుడే ఏర్పడినట్టు, తానే తొలి సీఎం అయినట్టు రేవంత్‌రెడ్డి పోజు కొడుతున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలపై దృష్టిపెట్టకుండా సర్వరోగ నివారిణి హైడ్రా అంటూ వార్తల్లో ఉంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎవరికీ వ్యతిరేకం కాదన్న ఈట‌ల రాజేంద‌ర్ పేదల ఇళ్లను కూలిస్తే ఖబర్ధార్ అని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలకు కారకులకులైన‌వారికి శిక్ష వేయాలని, వారి నుంచే రికవరీ చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ ప్రజల పక్షాన ఉండి, న్యాయపోరాటం కూడా చేస్తుందన్నారు. మారుతి కార్ల తయారీ పరిశ్రమ కోసం ఆనాడు ఓల్డ్‌ ఢిల్లీలో పేదల ఇళ్లను నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలగొట్టిన అంశాన్ని ప్రస్తావించిన ఈటల.. టర్క్‌మెన్‌ గేట్‌ వద్ద పేదల ఇళ్లను కూలగొట్టి, అడ్డుకున్నవారిని చంపిన నీచపు చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి రేవంత్‌రెడ్డి వారసుడని దుయ్యబట్టారు. అలాంటి రేవంత్‌రెడ్డి శ్రీకృష్ణుడు తనకు ఆదర్శం అంటున్నాడని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలతో, అధికారులు ఇచ్చిన అనుమతులతో కట్టుకున్న ఇళ్లకు హైడ్రా నోటీసులు ఇస్తున్నదని రాజేందర్‌ మండిపడ్డారు. ఒకటో అరో కూలగొట్టి.. దాని వెనుక జరుగుతున్న దుర్మార్గం ప్రజలకు తెలియనివ్వడం లేదన్నారు. పేదల పక్షాన మాట్లాడే వారి పట్ల వారి సోషల్  మీడియాలో నెగెటివ్ గా చేసి చూపిస్తూ, దాడి చేస్తున్నార‌న్నారు.
అల్వాల్ లో 1968లో 200 మంది లే ఔట్లలో కొనుక్కొని ఇళ్లు కట్టుకొని ఉంటున్నారని, 17 ఎకరాల చెరువు అని అప్పుడే ఫెన్సింగ్ వేశారని ఈటల రాజేందర్‌ చెప్పారు. ఒకప్పుడు మంచి నీళ్ళు ఉన్న చెరువు ఇప్పుడు మురికి కోపంగా మారిందన్నారు. ఇప్పుడు 48 ఎకరాల చెరువు అంటూ రెండు వందల మందికి నోటీసులు ఇచ్చి హైడ్రా వారి బతుకులో చిచ్చు పెట్టింద‌ని ఆరోపించారు. దాని కింద ఉన్న హాస్మత్ పేట చెరువు పక్కన 200 మంది 60 గజాల జాగాలో 1982 నుండి ఇళ్లు కట్టుకొని ఉంటున్నారని, అందరూ పేదవారేన‌న్నారు. ఎలాంటి వసతులు లేకపోయినా ఒక తరం అక్కడ బతుకీడ్చిందని చెప్పారు. వారి బాధలు చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని అన్నారు. పీర్జాదిగూడలో 160 మందికి, అల్లాపూర్ డివిజన్ లో రాజీవ్ గాంధీ నగర్, సర్ధార్ నగర్, గాయత్రి నగర్ లో 310 మందికి నోటీసులు ఇచ్చారన్నారు. స్మశాన వాటికకు, గుడికి, కమ్యూనిటీ హాల్‌కు కూడా నోటీసులు ఇచ్చారంటూ రేవంత్‌రెడ్డి తెలివి ఎంత ఉన్నదో అర్థమవుతున్నదని ఎద్దేవా చేశారు. అధికారులు రాజ్యాంగబద్ధంగా పని చేయాల‌ని హిత‌వు ప‌లికారు. 72 ఏళ్లలో ఎక్కువకాలం పాలించింది కాంగ్రెస్‌ పార్టీయేనన్న రాజేందర్‌.. తమ ముఖ్యమంత్రులు, తమ అధికారులు తప్పు చేశారని రేవంత్‌రెడ్డి ఒప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. వారిని శిక్షించి, వారి నుంచి నష్టాన్ని రికవరీ చేయాలని అన్నారు.
భూకబ్జాలు చేసిన వారిమీద ఎలాంటి చర్యలు లేవన్న ఈటల రాజేందర్‌.. శనివారం, ఆదివారం కోర్టులు ఉండవని దొంగల్లాగా, గూండాల్లాగ విధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. 77 ఏళ్ల అక్రమాలు, రుగ్మతలు ఒక్క రోజులో ఎలా పోతాయని ప్రశ్నించారు. ఒక ప్రణాళిక పెట్టుకుని, చట్ట ప్రకారం చేయాలని సూచించారు. అంతేకానీ ఇష్టం వచ్చినట్టు చేయొద్దని హితవు పలికారు. పైసా పైసా కూడబెట్టుకుని ఇళ్లు కట్టుకున్న పేదలు హైడ్రాకు బలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గగన్ పహాడ్ లో 75 కోట్ల అక్రమ ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం అని రాస్తున్నారని, కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి తండ్రి 1978 లో మెట్టభూమి కొనగా, 1980 లో రిజిస్ట్రేషన్ అయ్యిందని ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. అక్కడ ఫ్యాక్టరీ పెట్టుకొని నడుపుకుంటున్నారని, ఏనాడు ఇది బఫర్ లో ఉంది అని నోటీసు ఇవ్వకుండా ఒక్క‌సారిగా వ‌చ్చి కూలగొట్టడాన్ని ప్ర‌శ్నించారు. అందులో చాలా విలువైన మిషనరీ ఉంది దాన్ని తీసుకొనివ్వండి అని అడిగినా కూడా కనికరం లేకుండా కూల్చారని ఆరోపించారు. నీళ్ళ ప్యాకెట్లు అమ్ముకొనే సాధారణ మహిళకూ ఉపాధి లేకుండా చేశారని ఆరోపించారు. కొడుకుకి కేన్సర్ ఉంది కొంచం సమయం ఇవ్వండి అన్నా వినలేదన్నారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసేవారు, రాబిన్ ఉడ్ అని పొగిడే కుహనా మేధావులు వీరి బాధ వినండన్నారు. ‘ఉరి తీసేటప్పుడు కూడా చివరి కోరిక అడుగుతారు. కానీ బందిపోట్లలాగా పేదల ఉపాధిని పోగొట్టి వారి బ్రతుకులో మట్టిపోసిన దుర్మార్గపు ప్రభుత్వం ఇది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సరూర్ నగర్ లో సింగరేణి కాలనీ పేరుతో 1981 లో ప్రభుత్వమే లే అవుట్ చేసి పేదలకు అమ్మిందని, ఇప్పుడు దీనికి బాధ్యులు ఎవరు? అని ఈట‌ల ప్ర‌శ్నించారు. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం, కమలాపూర్ ఎంపీడీవో కార్యాలయం కుంటలో కట్టారని తెలిపారు. బతుకమ్మకుంటను ప్రభుత్వమే పూడ్చిందని గుర్తు చేశారు. ఇమ్లిబన్ బస్టాండ్, మెట్రో స్టేషన్ మూసీనదిలో ఉందని గుర్తు చేశారు.
అయ్యప్ప సొసైటీలో కూలగొట్టినప్పుడు 40 శాతం కట్టడాలు ఉంటే, ఇప్పుడు 80 శాతం కట్టడాలు ఎలా వచ్చాయని ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌శ్నించారు. శంకరపల్లి మండలం కొండకల్ తండాలో అసైన్డ్ భూములను అపర్ణ రియల్ ఎస్టేట్ వారు కబ్జా పెడుతున్నారని, అడ్డంగా గోడ కడుతున్నారని, అలాంటి వాటిమీద చర్యలు తీసుకోవాల‌న్నారు. ఈ స‌మావేశంలో రాష్ట్ర ఎస్సీ మోర్చ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, గ్రేటర్ పరిధిలో ఉన్న జిల్లాల అధ్యక్షులు బొక్క నరసింహరెడ్డి, సామ రంగారెడ్డి, గౌతం రావు, శ్యాంసుందర్ గౌడ్, పాండు యాదవ్, సురేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కన్వీనర్ మల్లారెడ్డి, వనపర్తి జిల్లా ఇంచార్జీ బోసుపల్లి ప్రతాప్, అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి లు పాల్గొన్నారు.