Intra Party Fights | స్వపక్షాల్లో విపక్షాలు!.. తెలంగాణ పొలిటికల్ గేమ్స్
సాధారణంగా రాజకీయాల్లో అధికారపక్షం, ప్రతిపక్షం ఉంటాయి. కానీ.. తెలంగాణ రాజకీయాల్లో మరో స్పెషల్ కూడా ఉన్నది. అదే స్వపక్షంలో విపక్షం. పార్టీలో ఆధిపత్యం కోసం ఆరాటం. ప్రత్యర్థి పార్టీలతో పోరాడుతున్న రాజకీయ పార్టీలు.. అంతర్గత తలనొప్పులపైనా దృష్టిసారిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇది తాడో పేడో తేల్చుకునే స్థాయికి వెళుతున్నాయి.

Intra Party Fights | హైదరాబాద్ జూలై 21 (విధాత) : సాధారణంగా రాజకీయాల్లో అధికారపక్షం, ప్రతిపక్షం ఉంటాయి. కానీ.. తెలంగాణ రాజకీయాల్లో మరో స్పెషల్ కూడా ఉన్నది. అదే స్వపక్షంలో విపక్షం. పార్టీలో ఆధిపత్యం కోసం ఆరాటం. ప్రత్యర్థి పార్టీలతో పోరాడుతున్న రాజకీయ పార్టీలు.. అంతర్గత తలనొప్పులపైనా దృష్టిసారిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇది తాడో పేడో తేల్చుకునే స్థాయికి వెళుతున్నాయి. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీల్లో ఈ ధోరణి బలంగానే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఆ యా పార్టీల అధిష్ఠానాలకు తలనొప్పిగా తయారైంది. ఇప్పటి వరకూ పార్టీ వేదికలు, నాయకుల సమావేశాలకు పరిమితమైన ఆధిపత్యపోరు.. ఇప్పుడు రోడ్డున పడుతున్నది. ఎవరి బలం ఎంతో చాటుకునేందుకు సిద్దం అవుతున్నారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. పదేళ్లు తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పుబట్టి హాట్ టాపిక్ అయ్యారు. ఇక బీఆర్ఎస్‌లో కవిత ఎపిసోడ్ కొనసాగుతోంది. తెలంగాణ జాగృతి కార్యక్రమాలను ఆమె విస్తృతం చేస్తున్నారు. పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారు. మరో వైపు కమలం పార్టీ కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాటల యుద్ధం సాగుతోంది. ఇంతకాలం వీరిద్దరి మధ్య ఉన్న అంతర్గతపోరు బయటకు వచ్చింది. సై అంటే సై ఈ ఇద్దరు నాయకులు తేల్చుకునేందుకు సిద్దమయ్యారు.
రేవంత్ కు షాకిచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఎక్కువ అంటుంటారు. కొన్ని సమయాల్లో ఇవే ఆ పార్టీ నాయకత్వానికి తలనొప్పులు కలిగిస్తున్నాయి. జూలై 18న నాగర్ కర్నూల్ జిల్లా జటప్రోలులో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో చర్చకు కారణమయ్యాయి. వచ్చే పదేళ్లు తానే తెలంగాణ సీఎంగా ఉంటానని ఆయన ప్రకటించుకున్నారు. గత ఎన్నికల అనంతరం సీనియర్‌లు ఆఖరు నిమిషం వరకూ ప్రయత్నాలు చేసినా.. సీఎం పీఠాన్ని అధిష్ఠానం రేవంత్‌రెడ్డికే అప్పగించింది. సీఎం ఎంపిక విషయంలో కాంగ్రెస్ నాయకత్వానిదే తుది నిర్ణయం. అయితే వచ్చే పదేళ్లు తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. కాంగ్రెస్‌ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాజగోపాల్ పోస్టులో కాంగ్రెస్‌లో చర్చకు దారితీసింది. క్యాబినెట్‌లో చోటు దక్కని కారణంగా రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో క్యాబినెట్‌లో రాజగోపాల్ రెడ్డికి చోటు దక్కని విషయాన్ని కాంగ్రెస్ నాయకత్వం వివరించింది. క్యాబినెట్ విస్తరణ జరిగిన రెండు మూడు రోజులకు ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. పదవి రాకపోయినా కార్యకర్తగానే పనిచేస్తానని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో పార్టీలో నంబర్ వన్ పొజిషన్‌లో ఉన్న సీఎంనే సవాలు చేయడం ద్వారా రానున్న రోజుల్లో చాలా పరిణామాలే చోటు చేసుకుంటాయనే సంకేతాలు రాజగోపాల్ ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
బీజేపీలో బండితో ఢీ అంటే ఢీ అంటున్న ఈటల
కమలం పార్టీలో కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య ఢీ అంటే ఢీ అంటున్నారు. గత కొంతకాలంగా వీరిమధ్య ఉన్న అంతర్గత పోరు బహిరంగమైంది. ఒకే పార్టీలో ఉన్న వీరిద్దరికీ పొసగడం లేదు. పార్టీలో పట్టుకోసం ఈటల ప్రయత్నిస్తున్నారు. ఇద్దరూ బీసీ సామాజికవర్గానికి చెందినవారే. ఇద్దరిదీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా. బండి సంజయ్ మొదటి నుంచి బీజేపీలో ఉన్నారు. విద్యార్థి దశలో ఈటల రాజేందర్ లెఫ్ట్ పార్టీలకు అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘంలో కీలకంగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సాధనలో భాగంగా బీఆర్ఎస్‌లో చేరి.. ఆ పార్టీలో కీలక స్థానానికి ఎదిగారు. అయితే ఆ పార్టీలో కేసీఆర్‌తో ఏర్పడిన గ్యాప్.. ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేయడానికి కారణమైంది. దీంతో బీజేపీలో చేరారు. బీజేపీలో అమిత్ షా వంటి నాయకులతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. అయితే రాష్ట్రంలోని కొందరు నాయకులతో ఆయన ఇటీవల గ్యాప్ ఏర్పడినట్టుగా ప్రచారం సాగుతోంది. బండి సంజయ్‌తో చాలాకాలంగా ఈ గ్యాప్ ఉందనే ప్రచారం పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నది. ఈ ఇద్దరు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర మంత్రి అమిత్ షా గతంలోనే సూచించినట్టుగా కూడా చెబుతారు. మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్ ఎంపీగా గెలవడంతో హుజూరాబాద్ కు ఆయన వెళ్లడం తగ్గించారు. అయితే హుజూరాబాద్ పై పట్టుపెంచుకొనేందుకు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారు. ఈటల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన సమయంలో ఆయన అనుచరులంతా బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. సంస్థాగత ఎన్నికల్లో తన అనుచరులకు ప్రాధాన్యం లేకపోవడం మొదలుకుని.. అప్పటికే రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కకపోవడం, అంతకు ముందు కేంద్ర క్యాబినెట్‌లో చోటు లభించకపోవడం వంటి అంశాలతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో చేసిన వ్యాఖ్యలతో ఈ అసంతృప్తి బహిరంగంగా మారింది. బండి సంజయ్ నుంచి తన అనుచరులకు ఎదురౌతున్న ఇబ్బందుల నేపథ్యంలో తాడో పేడో తేల్చుకోవాలని ఈటల డిసైడ్ అయ్యారని ఆయన మాటలను బట్టి అర్ధమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
గులాబీ పార్టీలో కొనసాగుతున్న కవిత ఎపిసోడ్
బీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ గురించి ఫీడ్ బ్యాక్ఇస్తూ కేసీఆర్‌కు కవిత లేఖ రాశారన్న విషయం తొలుత బయటకు పొక్కగా.. ఆ తర్వాత ఏకంగా ఆ లేఖ సామాజిక మాధ్యమాలకు ఎక్కడంతో రచ్చ రోడ్డున పడింది. ఈ లీక్ పై కవిత అనుమానాలు వ్యక్తం చేశారు. కేసీఆర్ దేవుడంటూ ఆయన చుట్టూ దయ్యాలున్నాయని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా ఆమె కేటీఆర్ పై విమర్శలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బీఆర్ఎస్‌లో కేసీఆర్ తనకు నాయకుడిని చెబుతూనే.. ఏ ప్రజా సంఘంలో లేని విధంగా ప్రజాసంఘంలో అనుబంధ సంఘాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దాని ద్వారా తన కార్యకలాపాలను నడిపిస్తున్నారు. ఒకప్పుడు కవిత వస్తే స్వాగతించే బీఆరెస్ నాయకులు ఇప్పుడు కనిపించడం లేదు. ఇప్పుడు జాగృతి శ్రేణులు మాత్రమే ఉంటున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం కోసం ఆర్డినెన్స్ తేవాలని రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కవిత స్వాగతించారు. ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తప్పుబట్టింది. కవితపై తీన్మార్ మల్లన్న చేసి వ్యాఖ్యల విషయంలో బీఆర్ఎస్ స్పందించలేదు. శాసనమండలిలో విపక్షనాయకుడు మధుసూదనాచారి మాత్రమే కవితపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను తప్పుబట్టారు. అంతేకానీ.. కేసీఆర్, కేటీఆర్ సహా ఇతరులెవరూ నోరు మెదపలేదు. దీంతో దీనిపై స్పందించే అంశాన్ని పార్టీ విజ్ఞతకు వదిలేస్తున్నానని కవిత వ్యాఖ్యానించడం ఆమెతో పార్టీకి పెరిగిన గ్యాప్‌ను స్పష్టంగా చెబుతున్నది. మరో వైపు బీసీ రిజర్వేషన్ల విషయంలో తమ దారికే బీఆర్ఎస్ రావాల్సి ఉంటుందని చెప్పడంతో తాను వేరు, బీఆరెస్ వేరు అనే సంకేతాలు ఇచ్చినట్టయిందని విశ్లేషకులు చెబుతున్నారు. సింగరేణి బాధ్యతల నుంచి కవితను తప్పించడం పార్టీలో ఆమెకు ప్రాధాన్యం తగ్గించిన తొలి బహిరంగ చర్యగా నిలుస్తున్నది. బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా జాగృతి ద్వారా కవిత ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అవి గులాబీ పార్టీకి రాజకీయంగా ఇబ్బందిగా మారుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అంటూనే జాగృతి ద్వారా రాజకీయ పార్టీ తరహాలో కవిత కార్యక్రమాలు నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమయ్యాయి.