అలా బతికేవారిని బట్టబయలు చేసేది సోషల్ మీడియానే: ఈటల
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటానికి సమాచారం తెలిసి ఉండాలి, వెంటనే స్పందించే నైపుణ్యం, క్రియేటివిటీ ఉండాలి. తక్కువ సమయంలో, తక్కువ లైన్లలో ఎక్కువ కంటెంట్ సృష్టించగలిగే వారే సమర్థవంతమైన యోధులని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు

హైదరాబాద్, ఆగస్ట్ 24 (విధాత): సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటానికి సమాచారం తెలిసి ఉండాలి, వెంటనే స్పందించే నైపుణ్యం, క్రియేటివిటీ ఉండాలి. తక్కువ సమయంలో, తక్కువ లైన్లలో ఎక్కువ కంటెంట్ సృష్టించగలిగే వారే సమర్థవంతమైన యోధులని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల బీజేపీ సోషల్ మీడియా, ఐటీ, సోషల్ మీడియా వర్క్ షాప్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. సోషల్ మీడియా డబుల్ ఎడ్జ్ స్వోర్డ్ లాంటిది. అది శత్రువుపై ప్రయోగించాలి తప్ప, మనలో మనమే విభజన చేసుకోవడానికి వాడకూడదన్నారు. సోషల్ మీడియా వారియర్ల చేతిలోని మొబైల్ ఫోన్, వారి మెదడు ఎఫెక్టివ్‌గా పనిచేస్తేనే ఫలితం వస్తుందన్నారు.
అసెంబ్లీ, జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీలు ఇవన్నీ సమగ్రంగా పనిచేస్తేనే నిజమైన గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందని ఈటల పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 73, 74 ప్రకారం స్థానిక సంస్థల అభివృద్ధి కొనసాగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓటమి భయంతో జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు.
రాష్ట్రంలో మొన్నటిదాకా పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలోని చీకటి అధ్యాయం ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు. ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ చౌరస్తాలో ఉన్నారు. వారికి మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత సోషల్ మీడియా, మీడియా మీదే ఉందని వెల్లడించారు. గ్రామాల్లో రోడ్లు, శ్మశానవాటికలు, అంగన్‌వాడీ భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు, రైతు వేదికలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నిధులతోనే నిర్మాణమయ్యాయని ఎంపీ ఈటల వెల్లడించారు. కానీ “సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది” అన్నట్లు, కేంద్రం ఇచ్చిన నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ తమవిగా చెప్పుకుంటున్నాయని విమర్శించారు.
స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయి. అందుకే అభివృద్ధి కొనసాగాలంటే, రానున్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేయాలనీ మీరందరూ గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరుతున్నానని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.