Etala Rajender| నాకు స్ట్రెయిట్ ఫైట్ తప్పా… స్ట్రీట్ ఫైట్ రాదు: ఈటల రాజేందర్

Etala Rajender| నాకు స్ట్రెయిట్ ఫైట్ తప్పా… స్ట్రీట్ ఫైట్ రాదు: ఈటల రాజేందర్

అంతా హైకమాండ్ కు పంపిస్తా..
బీ కేర్ ఫుల్ కొడుకా
కడుపులో కత్తులు పెట్టుకుని కొట్లాడే సంస్కృతి నాది కాదు
శత్రువుతో నేరుగా కోట్లాడతా
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని గ్రామంలేదు
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్

విధాత :

ఉమ్మడి కరీంనగర్ బీజేపీ పార్టీ రాజకీయాలు అనూహ్యంగా వేడెక్కాయి. హుజురాబాద్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తమను అణిచివేస్తున్నారంటూ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వర్గీయులు శనివారం హైదరాబాద్ లోని ఈటల నివాసానికి వచ్చి ఫిర్యాదు అయ్యారు. పార్టీలో మా పరిస్థితి ఏమిటని..మాకు మార్గదర్శకం చేయాలంటూ ఈటలకు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఈటల తన వర్గీయులను ఉద్దేశించి మాట్లాడుతూ పరోక్షంగా బండి సంజయ్ పై నిప్పులు చెరిగారు. నాకు స్ట్రెయిట్ ఫైట్ తప్పా… స్ట్రీట్ ఫైట్ రాదు అని.. మీదికి ఒక మాట.. లోపల ఒక మాట మాట్లాడటం రాదన్నారు. కాలం చాలా గొప్పదని..బాజప్తా మాట్లాడతా.. బేజాప్తా మాట్లాడటం రాదన్నారు. హుజురాబాద్ చైతన్యానికి మారుపేరు..మనకు మనంగా బీఆర్ఎస్ నుంచి బయటకు రాలేదని.. వెళ్లగొట్టారని గుర్తు చేశారు. ఆనాటి సీఎం కేసీఆర్ విధానాలను ప్రశ్నించినందుకు నాపై కుట్ర చేశారన్నారు. రాజకీయాల్లో అవమానాలు, అవహేళనలు ఉంటాయి.. తట్టుకున్నాం అన్నారు. 2021 నుండి బీఆర్ఎస్ లో నరకం అనుభవించానని, ప్రజలు ఎప్పుడూ మోసం చేయరన్నారు. ఎన్ని డబ్బులు పారించినా..నిర్భంధాలు చేసినా.. హుజురాబాద్ జనం నాకు ఓటేసి గెలిపించి కేసీఆర్ చెంప చెల్లు మనిపించారని…తెలంగాణ ఆత్మగౌరవం చాటారన్నారు. ఆ ఫలితాన్ని ప్రపంచం కీర్తించిందన్నారు.

వర్గ పోరును అణిచివేయకపోతే పార్టీకే నష్టం
శామీర్ పేట బీజేపీ అడ్డా అని..ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం చేసిన అడ్డా అని..రేపటి గెలుపుకు దారులు వేసే అడ్డా అని ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ప్రాంతంలో వాడెవడో సైకో, శాడిస్ట్, మనిషా..పశువా..వాడు ఏ పార్టీలో ఉన్నాడూ.. ఎవరి అండతో ధైర్యం చేశాడో గాని..నా వర్గీయులను అణిచివేయాలనుకుని తప్పు చేశాడని మండిపడ్డారు. బీ కేర్ ఫుల్ కొడుకా..శత్రువుతో నేరుగా కోట్లాడతానని..మీలా కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే సంస్కృతి మా రక్తంలో లేదన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నింటిని హైకమాండ్ కు పంపిస్తానని..ఇలాంటి వాటిని అరికట్టకపోతే నష్టం నాకు కాదన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని పల్లె లేదని..నా చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసని..నీకు చాల తక్కువ తెలుసని ఘాటుగా హెచ్చరించారు. ధీరుడు వెనుదిరగడు.. ఎంత వరకు ఓపిక పట్టాలో తెలుసు అన్నారు. హుజురాబాద్ లో గత 20 ఏళ్లుగా ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోలేదన్నారు. హుజురాబాద్ లో 2019 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 53 వేల మెజార్టీ వచ్చిందన్నారు. వ్యక్తులు ఎదకుండా పార్టీ బలపడలేదన్నారు.

కార్యకర్తలకు అండగా ఉండి గెలిపిస్తా

కార్యకర్తల ఆవేదన అర్ధం అయ్యిందని.. కార్యకర్తలకు రాజకీయా అవసరాలు తీర్చలేనంత నిస్సహాయంగా లేను అని ఈటల స్పష్టం చేశారు. నా అనుభవం వాడుకుంటే పార్టీకి ఉపయోగపడుతుందన్నారు. పదవులే పరవధిగా భావించే వాడిని కాదు అన్నారు. ఏ పార్టీలో పనిచేస్తే ఆ పార్టీకి అంకితభావంతో పనిచేస్తానన్నారు. కురుచ స్వభావులు.. మిమ్మల్ని చూసి నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదన్నారు. కొత్త, పాత వాళ్ళు అనే భావన లేదని..ఎవరి దయాదక్షిణ్యాలు అవసరం లేదన్నారు. కోవర్టులు రాజకీయాల్లోనే కాదు అన్నింట్లో ఉంటారని..వారి గురించి బాధపడకండి అన్నారు. సంస్కారంతో మౌనంగా ఉన్నవాళ్లను బలహీనులుగా భావించవద్ధని..మా జోలికి రావద్ధని హెచ్చరించారు. హుజురాబాద్ వస్తా.. మీ వెంటే ఉంటా.. మిమ్మల్ని స్థానిక ఎన్నికల్లో గెలిపించుకుంటానన్నారు. పదిరోజులకు ఒకసారి హుజురాబాద్ వస్తానని..నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో ఆఫీస్ ఉంటుందన్నారు. కార్యకర్తలు కుంగిపోవద్దన్నారు. మల్కాజిగిరి లోక్ సభ పరిధిలో స్థానిక ఎన్నికలు లేవని..హుజురాబాద్ స్థానిక ఎన్నికలే నాకు ఉన్నాయన్నారు.