student suicide rate । దేశంలో గుబులుపుట్టిస్తున్న విద్యార్థుల ఆత్మహత్యల రేటు

‘గత రెండు దశాబ్దాల కాలంలో విద్యార్థుల ఆత్మహత్యల పెరుగుదల రేటు 4 శాతంగా ఉన్నది. ఇది జాతీయ సగటు కంటే రెట్టింపు’ అని నివేదిక తెలిపింది. 2022లో చోటు చేసుకున్న మొత్తం ఆత్మహత్యల్లో పురుష విద్యార్థుల ఆత్మహత్యలు 53శాతం ఉన్నాయి. 2021, 2022 మధ్య పురుష విద్యార్థుల ఆత్మహత్యలు ఆరు శాతం తగ్గాయి. మరోవైపు విద్యార్థినీల ఆత్మహత్యలు ఇదే కాలంలో ఏడు శాతం పెరిగాయి’ అని ఆ నివేదిక వెల్లడించింది.

Reported by: Jagan Mohan Talluri | Latest News | Aug 28, 2024, 7:05 pm IST
Read Time: 5 mins
student suicide rate । దేశంలో గుబులుపుట్టిస్తున్న విద్యార్థుల ఆత్మహత్యల రేటు

student suicide rate । దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్న తీరు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నదని తాజాగా ఒక నివేదిక పేర్కొన్నది. జనాభా పెరుగుదల రేటును మించి విద్యార్థుల ఆత్మహత్యల రేటు ఉన్నదని తెలిపింది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) వివరాలను ఆధారం చేసుకుని ‘స్టూడెంట్ సూసైడ్స్‌: యాన్‌ ఎపిడమిక్‌ స్వీపింగ్‌ ఇండియా’ పేరుతో ఒక నివేదికను బుధవారం వార్షిక ఐసీ3 కాన్ఫరెన్స్‌ అండ్‌ ఎక్స్‌పో 2024 సందర్భంగా విడుదల చేశారు. మొత్తంగా ఆత్మహత్యల వార్షిక పెరుగుదల రేటు 2 శాతం ఉంటే.. విద్యార్థుల ఆత్మహత్యల రేటు 4 శాతంగా ఉన్నదని ఆ నివేదిక తెలిపింది. ఇవి రికార్డయిన ఘటనలు మాత్రమేనని పేర్కొన్నది.

‘గత రెండు దశాబ్దాల కాలంలో విద్యార్థుల ఆత్మహత్యల పెరుగుదల రేటు 4 శాతంగా ఉన్నది. ఇది జాతీయ సగటు కంటే రెట్టింపు’ అని నివేదిక తెలిపింది. 2022లో  చోటు చేసుకున్న మొత్తం ఆత్మహత్యల్లో పురుష విద్యార్థుల ఆత్మహత్యలు 53శాతం ఉన్నాయి. 2021, 2022 మధ్య పురుష విద్యార్థుల ఆత్మహత్యలు ఆరు శాతం తగ్గాయి. మరోవైపు విద్యార్థినీల ఆత్మహత్యలు ఇదే కాలంలో ఏడు శాతం పెరిగాయి’ అని ఆ నివేదిక వెల్లడించింది.

మొత్తం ఆత్మహత్యల రేటును, ఓవరాల్‌ జనాభా పెరుగుదల రేటును విద్యార్థుల ఆత్మహత్యల రేటు దాటిపోయింది. గడిచిన దశాబ్ద కాలంలో 0 నుంచి 24 ఏళ్లలోపు వయస్కుల జనాభా 58.2 కోట్ల నుంచి 58.1 కోటికి తగ్గిపోయింది. ఈ కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు 6,654 నుంచి 13,044కి పెరిగాయి’ అని నివేదిక వెల్లడించింది. ఐసీ3 ఇన్‌స్టిట్యూట్‌ అనేది స్వచ్ఛంద సంస్థ. ప్రపంచ వ్యాప్తంగా పాఠశాలలకు మార్గదర్శనం, రిసోర్స్‌ పర్సన్లకు, టీచర్లకు శిక్షణ వంటివాటిలో సహకారం అందిస్తున్నది.

విద్యార్థుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ టాప్‌లో ఉన్నాయని ఐసీ3 నివేదిక తెలిపింది. దేశం మొత్తంలో జరిగే విద్యార్థి ఆత్మహత్యల్లో మూడింట ఒక వంతు ఈ మూడు రాష్ట్రాల్లోనే ఉన్నాయని పేర్కొన్నది. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి మొత్తం కేసులలో 29శాతం భాగాన్ని ఆక్రమిస్తుండగా.. కోటా వంటి అత్యున్నస్థాయి కోచింగ్‌ హబ్‌ ను కలిగి ఉన్న రాజస్థాన్‌ 10వ ర్యాంకులో ఉన్నది.

పోలీసు స్టేషన్‌లలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా నేషనల్‌ క్రైం బ్యూరో ఈ డాటాను రూపొందించింది. అయితే.. చాలా కేసులు పోలీసుల రికార్డులో లేవనే అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే.. విద్యార్థుల ఆత్మహత్యలు  తల్లిదండ్రుల్లో గుబులు పుట్టిస్తున్నాయి.

ఆత్మహత్యలనేవి మానసిక సంఘర్షణ నుంచి తీసుకునే తీవ్ర నిర్ణయాలు. తాజా గణాంకాల నేపథ్యంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై మరింత దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి విద్యా సంస్థల్లో విద్యార్థులపై అధిక మానసిక ఒత్తిడిని నివారించాలని ఐసీ2 మూవ్‌మెంట్‌ వ్యవస్థాపకులు గణేశ్‌ కోహ్లి అభిప్రాయపడ్డారు. అహేతుకమైన పోటీలను నివారించాలని అన్నారు.