మీ చిన్నారులు భద్రమేనా?.. రిపోర్ట్ కాని కేసులు ఎన్నో!
వికసిత్ భారత్ అని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తున్నప్పటికీ.. బేటీ పడావో బేటీ బచావో పేరిట నినాదాలు ఇచ్చినా.. చిన్నారులు, కౌమార దశలోని పిల్లలపై ప్రత్యేకించి లైంగిక హింస గత కొన్నేళ్లలో రికార్డు స్థాయిలో పెరిగిందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి.

పోస్కో కేసులలో గణనీయ పెరుగుదల
గత రెండేళ్లలో 26శాతం పెరిగిన కేసులు
బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి చెప్పాలంటున్న నిపుణులు
న్యూఢిల్లీ : వికసిత్ భారత్ అని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తున్నప్పటికీ.. బేటీ పడావో బేటీ బచావో పేరిట నినాదాలు ఇచ్చినా.. చిన్నారులు, కౌమార దశలోని పిల్లలపై ప్రత్యేకించి లైంగిక హింస గత కొన్నేళ్లలో రికార్డు స్థాయిలో పెరిగిందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. రిపోర్టు అవుతున్న కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరిగింది. అదే సమయంలో రిపోర్టు కాని ఘటనలు ఎన్నో! భయం, సరైన అవగాహన లేకపోవడం, చుట్టుపక్కలవాళ్లు ఏమనుకుంటారోనన్న సంశయాలు తల్లిదండ్రులను, పిల్లలను ఆ విషయాలు బయటికి చెప్పకుండా నిరోధిస్తున్నాయి.
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) లెక్కల ప్రకారం గడిచిన రెండేళ్లలో చిన్న పిల్లలకు సంబంధించి ఐపీసీ, పోస్కో చట్టాల కింద నమోదైన కేసులు 26శాతం పెరిగాయి. కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ తదనంతరం ఇవి మరింత పెరిగాయి. 2022లో చిన్నారుల పట్ల అసభ్య ప్రవర్తన కేసులు 8.7 శాతం పెరిగాయి. సంఖ్యాపరంగా చూసుకుంటే 1.62 లక్షల ఘటనలు చోటు చేసుకున్నాయి.
వాస్తవానికి స్పర్శ అనేది మనల్ని ప్రేమించేవారి నుంచి లభించే భద్రమైన సానుకూల అనుభవం. ఇందులోనూ మంచి స్పర్శ, చెడు స్పర్శ.. గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ అనేవి ఒక చిన్నారికి తొలి నాళ్లలోనే నేర్పించాల్సిన రెండు ముఖ్యమైన అంశాలని నిపుణులు చెబుతూనే ఉంటారు. ఇవి ప్రమాదకర పరిస్థితులనుంచి ముందుగానే బయటపడేందుకు దోహదం చేస్తాయి. తమను తామే ప్రాథమికంగా రక్షించుకునేందుకు ఉపయోగపడుతాయి. అయితే.. చాలా మంది తల్లిదండ్రుల్లోనే ఈ అవగాహన కొరవడుతున్నది. పేద వర్గాల్లో ఇది మరీ తక్కువగా ఉంటున్నది.
మంచి స్పర్శ అనేది ఆ చిన్నారికి భద్రతపై భరోసాను ఇస్తుంది. తాను సంపూర్ణ రక్షణలో ఉన్నానే భావనను కలిగిస్తుంది. ఉదాహరణకు కుటుంబ సభ్యుల నుంచి లేదా ఆత్మీయ ఆలింగనం, లేదా స్నేహితుల నుంచి స్నేహపూరకమైన కరచాలనం. అదే చెడు స్పర్శ అనేది మీకు ఇబ్బందికరంగా, భయపెట్టేదిగా, అవాంఛనీయమైనదిగా, అభద్రతాభావాన్ని కలిగించేదిగా ఉంటుంది. లోదుస్తులు కప్పి ఉంచే భాగాలను స్పృశించడం ప్రధానమైన బ్యాడ్ టచ్. మెడ కింద భాగం నుంచి.. మోకాళ్ల వరకూ ఎవ్వరూ ముట్టుకోకూడదనే విషయాన్ని చిన్నారులకు వివరించి చెప్పాలి.
బాల్యంలో బ్యాడ్ టచ్‌కు గురైన చిన్నారుల కలిగే భయానక భావాల గురించి మణిపాల్ హాస్పిటల్లో కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ శర్మిష్ఠ చక్రబర్తి వివరిస్తూ.. ‘బ్యాడ్ టచ్ అనేది చిన్నారుల మానసిక, భావోద్వేగ పరిస్థితులపై గణనీయ ప్రభావం చూపుతుంది. తొలుత వేదన, వ్యాకులత, ఉద్విగ్న దుఃఖం, ఒత్తిడికి లోనవుతారు. తర్వాత నమ్మకానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. ఫలితంగా తమ భాగస్వామితో భౌతిక, భావోద్వేగ బంధాల విషయంలో అనేక సవాళ్లను వారు ఎదుర్కొంటారు. ఆత్మగౌరవం, శారీరక ఆకృతి అంశాలు ఉంటాయి. ఇటువంటివారికి తగిన చికిత్స అందించకపోతే ఆకలి లేకపోవడం వంటివాటికి బాధితులు గురవుతారు. తలనొప్పి, కడుపు నొప్పి, వెన్ను నొప్పి వంటి శారీరక రుగ్మతల బారిన కూడా పడతారు. ఒక్కోసారి మనసు ఖాళీగా మారిపోయి.. తమకు తామే హాని చేసుకునే పరిస్థితులు కూడా ఎదుర్కొంటారు’ అని చెప్పారు.
అభివృద్ధి క్రమంలో బాల్యం అనేది అత్యంత ముఖ్యమైన దశ. తన చుట్టూ ఉన్నవాటి నుంచి పిల్లలు జ్ఞానం పొందుతారు. అందుకే ఈ దశలోనే పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేవి ప్రతి తల్లిదండ్రులు వివరించి చెప్పాలని నిపుణులు సూచిస్తున్నారు. పాఠశాలల్లో పేరెంట్ టీచర్ మీటింగ్స్‌లో కూడా ఇదొక అంశంగా ఉండాలని చెబుతున్నారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో, సెమీ అర్బన్ ప్రాంతాల్లో తల్లిదండ్రుల్లో ఈ అంశంపై అవగాహన పెంచాలని సూచిస్తున్నారు.