గుండెపోట్లు పెరుగుతున్నాయి!
ప్రస్తుతం మనల్ని బాగా భయపడుతున్న అతిపెద్ద సమస్య ఏంటంటే గుండెపోటే. వయసుతో సంబంధం లేకుండా చాలామంది గుండెపోటు కారణంగా ప్రాణాలను కోల్పోతున్నారు

విధాత : ప్రస్తుతం మనల్ని బాగా భయపడుతున్న అతిపెద్ద సమస్య ఏంటంటే గుండెపోటే. వయసుతో సంబంధం లేకుండా చాలామంది గుండెపోటు కారణంగా ప్రాణాలను కోల్పోతున్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం గుండెపోటు మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. జాతీయ నేర పరిశోధన సంస్థ (ఎన్‌సీఆర్బీ) ఇటీవల విడుదల చేసిన నివేదికను గమనిస్తే.. 2021 కంటే 2022లో గుండెపోటు మరణాలు 12.5% పెరిగాయి. 2022లోనే గుండెపోటు కారణంగా 32,547 మంది మరణించారు.
గుండెపోటు మరణాల శాతం పెరగడానికి కొవిడ్ కూడా ఒక కారణంగా చెబుతున్నారు. కొవిడ్ సోకినవారి గుండె పనితీరు బలహీనంగా మారిందని, దీనితో గుండెపోటు మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిందని వెల్లడించింది. 2022లో 56,450 హఠాన్మరణాలు సంభవించాయని పేర్కొన్నది. హింస వల్ల కాకుండా మెదడులో రక్తస్రావంవంటి ఏ ఇతర కారణాలతో మరణించినా దానిని హఠాన్మరణంగా పరిగణిస్తామని వెల్లడించింది. ఈ మరణాలను అధిగమించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రజలను హెచ్చరించింది. నిత్యం వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మద్యపానానికి, ధూమపానానికి దూరంగా ఉండడం వంటి వాటితో గుండెపోటు సమస్యను అధిగమించవచ్చునని తెలిపింది.