caste census । ఈసారి జనగణనలో కుల గణన? సంప్రదింపుల్లో కేంద్రం!
ఇండియా కూటమితోపాటు ఎన్డీయేలోని జేడీయూ వంటి పక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో ఈసారి జనాభా లెక్కల్లో కుల గణన కోసం ప్రత్యేకంగా కాలం ఏర్పాటు చేసే అంశంపై కేంద్రం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది.

caste census । దేశంలో ప్రతి పదేళ్లకోసారి జనాభా లెక్కలు (Census) సేకరిస్తుంటారు. ఏ ప్రాంతంలో ఎంత జనాభా (population) ఉన్నదనేదాని బట్టి ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టేందుకు దీనిని ఉద్దేశించారు. అయితే.. కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నది. ప్రత్యేకించి గత లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha elections) ఇండియా కూటమి (India Alliance) ప్రధానంగా దీనిని ముందుకు తీసుకువచ్చింది. కులాలవారీగా జనాభా లెక్కలు సేకరిస్తే ఆయా కులాల వారికి అవసరమైన సంక్షేమ పథకాల్లో (welfare schemes) తగినంత వాటాను కల్పించేందుకు దోహపడుతుందనే వాదన ఉన్నది. అయితే.. కుల గణన చేపట్టేందుకు కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వాలు గత పదేళ్లలో ఎన్నడూ సానుకూలంగా లేవు. కానీ.. ఇప్పుడు బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే పరిస్థితిలో లేదు. పదేళ్ల తర్వాత కేంద్రంలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వం (coalition government) ఏర్పడింది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత స్థాయిలో సీట్లు తెచ్చుకోలేక పోయింది. దీంతో ఎన్డీయే (NDA) భాగస్వామ్య పక్షాలతో ప్రత్యేకించి టీడీపీ(TDP), జేడీయూ (JDU) మద్దతుతో ప్రభుత్వాన్ని మోదీ ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది.
1881లో దేశంలో మొదటిసారి జనాభాను లెక్కించారు. ఆ తర్వాత ప్రతి పదేళ్లకోసారి జనాభా లెక్కలను సేకరిస్తూ వచ్చాయి. 2021 లో జనాభా లెక్కలు సేకరించాల్సి ఉన్నా.. కొవిడ్ విజృంభించిన నేపథ్యంలో జాప్యం చోటు చేసుకున్నది. అప్పటి నుంచి జనాభా లెక్కల సేకరణకు కేంద్రం పూనుకోలేదు. దేశంలోని అనేక రాజకీయ పార్టీలు కుల గణనను (caste census) డిమాండ్ చేస్తున్నాయి. ‘కుల గణనను ఆపాలని మీరు భావిస్తే.. మీరు కలల్లో ఉన్నట్టే లెక్క. ఏ శక్తీ దానిని ఆపలేదు. ఇండియా ఒక ఆదేశం ఇచ్చింది. త్వరలోనే 90శాతం మంది భారతీయులు కుల గణనకు మద్దతు పలుకుతారు. ఆ ఆదేశాలను అమలు చేయండి. లేదంటూ తదుపరి వచ్చే ప్రధాని దానిని నెరవేర్చుతారు’ అని ఇటీవల ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ (India Today’s Mood of the Nation) డాటాను ఉటంకిస్తూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యానించారు. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో 74 శాతం మంది భారతీయులు కుల గణనకు మద్దతు పలికారు. అంతకు ముందు నిర్వహించిన సర్వేలో కుల గణనకు 59 మంది మద్దతు పలకగా.. తాజా సర్వేలో ఆ శాతం గణనీయంగా పెరగడం గమనార్హం.
ఇండియా కూటమి పక్షాలే కాకుండా.. ఎన్డీయేలో కీలక భాగస్వామ్యపక్షాలైన నితీశ్ కుమార్ (Nitish Kumar) నేతృత్వంలోని జేడీయూ, ఎంపీ చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) నాయకత్వంలోని ఎల్జేపీ వంటి పార్టీలు సైతం దేశవ్యాప్త కుల గణనను డిమాండ్ చేస్తున్నాయి. బీహార్‌లో జేడీయూ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రవ్యాప్త కుల సర్వే నిర్వహించిన దగ్గర నుంచి దేశవ్యాప్త కుల గణన డిమాండ్ ఊపందుకున్నది. బీహార్ కుల సర్వే (statewide caste survey) వివరాలు గత ఏడాది అక్టోబర్‌లో విడుదలయ్యాయి. రాష్ట్ర జనాభాలో 80 శాతం మంది అత్యంత వెనుకబడి వర్గాల వారు ఉన్నారని ఆ సర్వేలో తేలింది. గతంలో లేటరల్ ఎంట్రీ (lateral entry hiring) ద్వారా కేంద్రంలోని కీలక శాఖల్లో ముఖ్యమైన ఉద్యోగాలకు నియామకాలు జరిపేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైనప్పుడు రిజర్వేషన్లు, కుల గణన అంశం మరోసారి ప్రముఖంగా చర్చకు వచ్చింది. ఆ సమయంలోనే చిరాగ్ పాశ్వాన్.. కుల గణనకు తమ పార్టీ ఎల్లప్పుడూ సుముఖంగానే ఉందని వివరణ ఇచ్చారు కూడా.
మహిళా రిజర్వేషన్ల చట్టం (Women’s Reservation Act) అమలు కూడా జనాభా లెక్కల సేకరణతో ముడిపడి ఉన్నది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును ఇటీవలి లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం హడావుడిగా ఆమోదించింది. కానీ.. అమలును మాత్రం జనాభా లెక్కల సేకరణతో ముడిపెట్టింది. జనాభా లెక్కల సేకరణ అనంతరం లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. అంటే.. జనాభా లెక్కలు తేలితేనే.. మహిళా రిజర్వేషన్ ఖరారు చేసేందుకు అవకాశం ఉంటుంది.
కుల గణనకోసం ఇండియా కూటమి గట్టిగా పట్టుబడుతున్న నేపథ్యంలోనే జేడీయూ వంటి కీలక ఎన్డీయే భాగస్వామ్యపక్షాలు సైతం అదే డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని సంకీర్ణ సర్కార్ జనాభా లెక్కల సేకరణ ఫార్మాట్‌లో కుల వివరాల నమోదుకు ప్రత్యేకంగా కాలమ్ (caste column) పొందుపర్చే విషయంలో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. అయితే.. ఈ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికరవర్గాలు చెబుతున్నాయి.