Caste Census Karnataka | కర్ణాటకలో 22.09.2025 నుంచి కుల గణన.. ఏర్పాట్లు పూర్తి చేసిన బీసీ కమిషన్

కర్ణాటక రాష్ట్రంలో మరో విడుత కుల గణన 22.09.2025న మొదలుకానున్నది. అక్టోబర్‌ 7 వరకూ వివరాలు సేకరిస్తారు. కర్ణాటకలో సుమారు రెండు కోట్ల నివాసాలలో రమారమి ఏడు కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. వారి నుంచి 1.85 లక్షల మంది ఉపాధ్యాయులు వివరాలు సేకరించనున్నారు.

Caste Census Karnataka | కర్ణాటకలో 22.09.2025 నుంచి కుల గణన.. ఏర్పాట్లు పూర్తి చేసిన బీసీ కమిషన్

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విధాత):

Caste Census Karnataka | కర్ణాటక రాష్ట్రంలో సోమవారం (సెప్టెంబర్ 22వ తేదీ) నుంచి కుల గణన (సామాజిక, విద్య సర్వే) ప్రారంభమవుతోంది. ఈ మేరకు ఆ రాష్ట్ర బీసీ కమిషన్ కావాల్సిన ఏర్పాట్లు, శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసింది. అయితే ఈ సర్వేపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. గతంలో 2015లో సర్వే చేయగా, అది తప్పుల తడకగా ఉండటం, కాలం చెల్లడంతో మరోసారి నిర్వహించాలని అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. కుల గణన సర్వే సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభమై అక్టోబర్ 7వ తేదీన ముగించనున్నారు. రాష్ట్రంలోని రెండు కోట్ల నివాసాలలో ఏడు కోట్ల మంది ప్రజల నుంచి 1.85 లక్షల మంది ఉపాధ్యాయులు వివరాలు సేకరించనున్నారు.

ఇప్పటికే 1.55 కోట్ల నివాసాలకు స్టిక్కర్లను అతికించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.420 కోట్లు వెచ్చిస్తున్నది. సామాజిక, విద్య స్థితిగతులపై 60 ప్రశ్నలతో ఒక సర్వే పత్రాన్ని రూపొందించామని కర్ణాటక రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్ పర్సన్ మధుసూధన్ ఆర్. నాయక్ వెల్లడించారు. కుల గణన నివేదిక వచ్చే డిసెంబర్ నాటికి సిద్ధం చేసి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అందచేస్తామని తెలిపారు. ఆశా వర్కర్లు ముందుగానే ప్రతి ఇంటికీ వెళ్లి దరఖస్తు ఫారాలను అందచేస్తారని, సేకరించిన వివరాలను రేషన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలను మొబైల్ నెంబర్‌తో అనుసంధానం చేస్తున్నామని పేర్కొన్నారు.

  • సర్వేలో మతం, కులం, విద్య, మాతృభాష‌, వివాహం, ఆరోగ్య బీమా, రుణాలు, భూములు, మరుగుదొడ్డి సదుపాయం, మంచినీటి నల్లా కనెక్షన్, పశు సంపద వివరాలు సేకరించాలని దరఖాస్తులో పొందుపరిచారు.
  • ఎస్సీ, ఎస్టీ కులాలు మినహాయిస్తే కర్ణాటకలో 1,561 కులాలు ఉన్నాయి.
  • వీర శైవ లింగాయతులు తమను హిందూ కులంలో కాకుండా ఇతరుల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
  • కురుబ క్రిస్టియన్లు, మడివాలా క్రిస్టియన్లు, వొక్కలిగ క్రిస్టియన్లు, లింగాయత్ క్రిస్టియన్లు, బ్రాహ్మిన్ క్రిస్టియన్లు ఉన్నరు.
  • వీరిని ఏ కులంలో చేర్చాలనే చర్చ కూడా జరుగుతోంది.
  • వీళ్లను ఓబీసీ వర్గం కింద చేర్చితే చాలా నష్టాలు ఉంటాయంటున్నారు.