Shabash Pocharam Project| శభాష్ పోచారం..గర్వకారణంగా 103ఏళ్ల ప్రాజెక్టు: మంత్రి ఉత్తమ్ ట్వీట్

విధాత, హైదరాబాద్ : కామారెడ్డి జిల్లాలో మెరుపు వర్షాలు..వరదల ధాటికి పోచారం ప్రాజెక్టు(Pocharam Project)కు గండిపడి ప్రాజెక్టు కొట్టుకపోతుందన్న అంచనాలకు భిన్నంగా రెట్టింపు వరదలను తట్టుకుని దృడంగా నిలబడటం పట్ల తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తన సంతోషాన్ని రాష్ట్ర ప్రజలతో పంచుకుంటున్నట్లుగా ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. 103 సంవత్సరాల పురాతన పోచారం ప్రాజెక్ట్ 1,82,000 క్యూసెక్కుల భారీ వరద ప్రవాహాన్ని తట్టుకుని సురక్షితంగా నిలబడిందని.. ఈ ప్రాజెక్టు గరిష్ట వరద (ఎంఎఫ్ డీ) 70,000 క్యూసెక్కులు మాత్రమేనని గుర్తు చేశారు. ప్రాజెక్టు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిన్న పోచారం ప్రాజెక్టు అన్ని గేట్లు తెరిచినా..వరద ఉదృతి ప్రాజెక్టుపై నుంచి 8అడుగుల ఎత్తులో వెళ్లడం..ప్రాజెక్టు ఒవర్ హెడ్ వద్ధ గండిపడటంతో ఇక ప్రాజెక్టు మనుగడ కష్టమేనన్న ఉద్రిక్త క్షణాల తర్వాత, ప్రాజెక్టు బలంగా నిలబడటాన్ని చూడటం నాకు, మా నీటి పారుదల శాఖ సహచరులకు గొప్ప ఉపశమనం కలిగించిందన్నారు. నిజంగా ఇది గర్వించదగ్గ..భావోద్వేగ సమయం అని ఉత్తమ్ అభివర్ణించారు.
శభాష్ పోచారం..
వందేళ్ల క్రితం నిజాం ప్రభుత్వం నిర్మించిన తెలంగాణ తొలి ప్రాజెక్టు పోచారం ప్రాజెక్టు అని..ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ప్రస్తుతం కామారెడ్డి జిల్లాగా ఉన్న మంచిప్ప చెరువుపై నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామంలో 1917లో పోచారం ప్రాజెక్టుకు నిజాం శంకుస్థాపన చేశారని మంత్రి ఉత్తమ్ గుర్తు చేశారు. కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలు, మెదక్ జిల్లాలోని మెదక్ మండలాల నీటి అవసరాలను తీర్చేందుకు రూ.27.11 లక్షల వ్యయంతో 2.423 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు నిర్మాణం 1922లో పూర్తయిందన్నారు. గత 103 ఏళ్లుగా నిజామాబాద్, మెదక్ జిల్లాల ప్రజల సాగు, తాగునీటి అవసరాలను ఈ పోచారం ప్రాజెక్టు తీరుస్తుందని తెలిపారు. నిజాం ప్రభుత్వం సున్నపురాయితో నిర్మించిన ఈ ప్రాజెక్టు పొడవు 1.7 కిలోమీటర్లు, మంచిప్ప వాగుపై 21 అడుగుల ఎత్తైన కట్ట, దాని చుట్టూ 58 కిలోమీటర్ల పొడవైన కాలువలు తవ్వారని.. ఈ ప్రాజెక్టు కు 73 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయని వివరించారు.
ఈ ప్రాజెక్టు కింద రైతులు 10,500 ఎకరాలు సాగు చేసుకుంటున్నారని.. గతంలో 2.423 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించగా, పూడిక కారణంగా ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 1.82 టీఎంసీలకు పడిపోయిందన్నారు. ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీలను ఏ, బీ జోన్లుగా నిర్మించారని..1 నుంచి 48 డిస్ట్రిబ్యూటరీలతో కూడిన ఏ జోన్, 49 నుంచి 73 డిస్ట్రిబ్యూటరీలతో కూడిన బీ జోన్లుగా విభజించారని వెల్లడించారు.
నిన్న భారీ వరదలతో పోచారం ప్రాజెక్టు పై నుంచి ఉదృతంగా వరద నీరు ప్రవహిస్తున్న దృశ్యం..
ఈ విషయం మీతో పంచుకోవడానికి నాకు సంతోషంగా ఉంది —
103 సంవత్సరాల పురాతన పోచారం ప్రాజెక్ట్ 1,82,000 క్యూసెక్కుల భారీ వరద ప్రవాహాన్ని తట్టుకుంది సురక్షితంగా నిలబడింది, ఈ ప్రాజెక్టు MFD 70,000… pic.twitter.com/SiOqH7zF1Y
— Uttam Kumar Reddy (@UttamINC) August 28, 2025